రాష్ట్రీయం

రోబో ఇసుక తయారీకి పరిశ్రమ హోదా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఫిబ్రవరి 15: రాష్ట్రంలో నానాటికీ పెరుగుతున్న ఇసుక డిమాండ్‌ను దృష్టిలో వుంచుకుని రోబో ఇసుక తయారీకి పరిశ్రమ హోదా కల్పించి ప్రోత్సహించేందుకు ఇసుక విధానంపై రాష్ట్ర ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు అధ్యక్షతన ఏర్పాటైన మంత్రివర్గ ఉప సంఘం సోమవారం నాడిక్కడ సమావేశమై కీలక నిర్ణయం తీసుకుంది. ఈ సమావేశంలో మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, కె అచ్చన్నాయుడు, పీతల సుజాత పాల్గొన్నారు. ఇసుక రీచ్‌ల ఇ-వేలాన్ని ఆరు జిల్లాల్లో నేటినుంచి రెండురోజులపాటు తాత్కాలికంగా నిలిపివేయాలని నిర్ణయించారు. ఉభయ గోదావరి జిల్లాల్లో వేలం పూర్తికాకుండా నిలిచిన రీచ్‌లతోసహా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో ఇ-వేలాన్ని రెండురోజులు తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు మైనింగ్ శాఖ కార్యదర్శి గిరిజాశంకర్ తెలిపారు. రోబో ఇసుక తయారీకి మంత్రివర్గ ఉప సంఘం నిర్ణయం తీసుకోవటం, మంత్రివర్గం కూడా పరిశ్రమ హోదాకు ఆమోదం తెలిపితే ఇతర పరిశ్రమలకిచ్చే ప్రోత్సాహాలన్నీ వర్తించనున్నాయి. ప్రధానంగా విద్యుత్ రాయితీ, వ్యాట్‌లో 75శాతం రాయితీ, సీనరేజిలో 50శాతం తగ్గింపు, పెట్టుబడిలో సబ్సిడీ వంటి ప్రోత్సాహాన్ని ఇసుక తయారీ పరిశ్రమకు కూడా వర్తిస్తుంది. ప్రస్తుతం వున్న క్రషర్స్, ఇసుక తయారీ యంత్రాలు కొత్తవి కొనుగోలు చేస్తే వ్యాట్ రాయితీ వర్తిస్తుంది. రోబో ఇసుకను ప్రోత్సహించేలా మార్కెటింగ్ టైఅప్ ఏర్పాటు చేస్తారు. ఈ పరిశ్రమకు 50 కిమీల పరిధిలో వున్న అన్ని ప్రభుత్వ నిర్మాణ కార్యక్రమాలకు ఇసుక అవసరాల్లో 50శాతం మేర తయారీ ఇసుకను వినియోగించాలన్న నిబంధన విధించినట్లు మంత్రి యనమల తెలిపారు. ప్రభుత్వం నిర్ణయించిన యూనిట్ ఇసుక ధర రూ.500 కంటే ఎక్కువగా, ప్రభుత్వం కోరుకున్న ఆదాయం కంటే తక్కువగా వచ్చిన టెండర్ల విషయంలో ఒక విధానపరమైన నిర్ణయం తీసుకోవాలని ఉప సంఘం నిర్ణయించింది. అమల్లోవున్న నియమ నిబంధనలు, న్యాయస్థానాల తీర్పులను దృష్టిలో వుంచుకుని తక్షణం తగిన సమాచారం తమకందించాలని మంత్రి యనమల మైనింగ్ అధికారులను ఆదేశించారు. నిర్మాణ పనులకు ఇసుక కృత్రిమ కొరత ఏర్పడే పరిస్థితులు తలెత్తకుండా జాగ్రత్తలు చేపట్టాలని ఉప సంఘం అధికారులను ఆదేశించింది.
గుర్తించిన ఇసుక రీచ్‌లకు ఇ-వేలం విధానంతోపాటు రైతుల పట్టా భూముల్లో వున్న ఇసుక అమ్మకానికి విధివిధానాలపై కూడా మంత్రివర్గ ఉప సంఘం రైతు ప్రతినిధులతో చర్చించింది. కృష్ణా జిల్లాకు చెందిన రైతు కెపి రావు మాట్లాడుతూ పాటదారు కోట్ చేసిన అత్యధిక ధరను రైతులు చెల్లించేలా పట్టా భూముల్లోని ఇసుక అమ్మకానికి నిబంధన విధించటం సబబు కాదన్నారు. దీనికితోడు సీనరేజి, ఆదాయపు పన్ను వంటివి అదనంగా చెల్లించాలని ఆదేశించటం భావ్యం కాదన్నారు. నదీగర్భంలో వున్న పట్టా భూముల్లో ఉపరితలం వరకు వున్న ఇసుక మాత్రమే తవ్వేందుకు అనుమతించారని, దీనివల్ల పంటల సాగుకు భూమి వినియోగంలోకి రాదని చెప్పారు. నెలవారీ 70శాతం మేర ఇసుక తవ్వి అమ్మకాలు జరపాలన్న నిబంధన పట్టా రైతులకు కష్టసాధ్యమన్నారు. తూర్పుగోదావరి జిల్లా కడియపులంక గ్రామానికి చెందిన రైతు ఈలి నాగరాజు మాట్లాడుతూ లంక భూముల్లో ఇసుక మేటలు పూర్తిగా తొలగించేందుకు అనుమతించాలన్నారు. రెండు మీటర్ల లోతు వరకు ఇసుక వుంచాలన్న నిబంధనను తొలగించాలన్నారు. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం రైతు నరేష్‌చంద్ర మాట్లాడుతూ సాగు భూముల్లో గాలికి ఇసుక మేటలు వేస్తుందని, దీన్ని పూర్తిగా తొలగించుకునేందుకు అనుమతించాలని కోరారు. సమావేశం అనంతరం యనమల మాట్లాడుతూ మంత్రులు, రైతుల సూచనలను పరిగణనలోకి తీసుకుని సరైన విధానాన్ని రూపొందించి మంత్రిమండలి ఆమోదంకోసం పక్కాగా సూచనలు చేయనున్నామని వివరించారు.