రాష్ట్రీయం

రాజుకున్న రాజకీయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్/కర్నూలు, ఫిబ్రవరి 19: ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. కర్నూలు జిల్లాకు చెందిన కొందరు వైకాపా ఎమ్మెల్యేలు టిడిపిలో చేరబోతున్నారన్న ప్రచారం రాజకీయవర్గాల్లో సంచలనం రేకెత్తిస్తోంది. నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి, ఆయన కుమార్తె, ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ టిడిపిలో చేరడానికి రంగం సిద్ధమైందంటూ శుక్రవారం ప్రచారం భారీయెత్తున సాగింది. దీనికి అనుగుణంగానే భూమా నాగిరెడ్డి నంద్యాల, ఆళ్లగడ్డ నియోజకవర్గాలకు చెందిన తమ అనుచరులతో సమావేశం నిర్వహించడం ప్రాధాన్యం సంతరించుకుంది. పార్టీ మారే విషయం తమతో చర్చించినట్టు సమావేశానికి హాజరైన నేతలు చెప్పగా, విలేఖరులు అడిగిన ప్రశ్నకు ‘ఏదైనా ఉంటే నేనే చెబుతా’నంటూ భూమా నాగిరెడ్డి సమాధానం దాటవేయడం గమనార్హం. పైగా మరోమారు సమావేశమవుదామంటూ పార్టీ ముఖ్యనేతలతో చెప్పి భూమా నాగిరెడ్డి నేరుగా హైదరాబాద్‌కు పయనమయ్యారు. మరోవైపు జిల్లాకు చెందిన ఉప ముఖ్యమంత్రి కెయి కృష్ణమూర్తి కూడా హుటాహుటిన హైదరాబాద్‌కు బయల్దేరారు. పైగా కర్నూలు జిల్లాకు చెందిన పార్టీ నేతలతో సిఎం చంద్రబాబు విజయవాడలో శనివారం కీలక సమాచారం నిర్వహించబోతుండటం ఈ పరిణామాలన్నింటికీ కీలక మలుపుగా భావిస్తున్నారు. భూమా నాగిరెడ్డి, ఆయన కుమార్తె టిడిపి తీర్థం పుచ్చుకోనున్న నేపథ్యంలో కర్నూలు జిల్లాకే చెందిన మరో నలుగురు ఎమ్మెల్యేలు కూడా పార్టీ మారే అవకాశం ఉందని సమాచారం. అయితే జిల్లాకు చెందిన కొందరు వైకాపా ఎమ్మెల్యేలను పార్టీ మారడం గురించి ప్రశ్నించగా అలాంటిదేమీ లేదన్నారు.
వైకాపా నుంచి 29మంది ఎమ్మెల్యేలు టిడిపిలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారంటూ కెఇ కృష్ణమూర్తి గురువారం చేసిన ప్రకటన అనంతరం రాజకీయాలు జోరందుకోవడం గమనార్హం. అన్ని వివరాలూ చేతికి అందాకే కెఇ ప్రకటన చేశారని, వైకాపా ఎమ్మెల్యేలు ఒకేసారి పార్టీలో చేరతారని ఆయన అనుచరులు చెబుతున్నారు.
చిత్తూరు ఎమ్మెల్యేలకూ గాలం?
అనంతపురం జిల్లా ఉరవకొండ ఎమ్మెల్యే వై విశే్వశ్వరరెడ్డిని, కదిరి ఎమ్మెల్యే ఎ చాంద్ బాషాను కూడా టిడిపి నేతలు కలిసే ప్రయత్నం చేయగా వారు నిరాకరించినట్టు తెలిసింది. చిత్తూరు జిల్లాలో ఎనిమిదిమంది వైకాపా ఎమ్మెల్యేలు ఉన్నారు. ఆ జిల్లా నుండి ఇద్దరు ముగ్గురిని టిడిపిలోకి తీసుకోవాలనే వ్యూహంలో సిఎం ఉన్నట్టు సమాచారం. అయితే వీటన్నింటిపై మార్చి 1న జరిగే పార్టీ సమావేశంలో స్పష్టత వస్తుందని టిడిపి నేతలు చెబుతున్నారు.
పార్టీ నేతల్లో విశ్వాసం నింపేందుకే?
తెలంగాణ రాష్ట్రంలో పట్టుకోల్పోతున్న తెలుగుదేశం పార్టీ ఆంధ్రాలో కొంతమంది వైకాపా ఎమ్మెల్యేలను చేర్చుకోవడం ద్వారా పార్టీ నేతల్లో విశ్వాసాన్ని నింపే కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందులోభాగంగానే వైకాపా ఎమ్మెల్యేలతో టిడిపి నేతలు మంతనాలు సాగిస్తున్నారు. నియోజకవర్గంలో పనులు, పదవులు, కాంట్రాక్టులు పేరిట టిడిపి నేతలు వైకాపా ఎమ్మెల్యేలతో చర్చలు జరుపుతుండగా, కొంతమంది ఎమ్మెల్యేలు వైకాపా నాయకత్వంపై ఆగ్రహంతో టిడిపిలో చేరేందుకు సిద్ధమవుతున్నారు.
గత నాలుగు రోజులుగా ఇరు పార్టీల నేతలూ పార్టీ ఫిరాయింపులపై ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. 21 మంది టిడిపి ఎమ్మెల్యేలు తమకు టచ్‌లోకి వచ్చారని వైకాపా పేర్కొనగా, 28 మంది వైకాపా ఎమ్మెల్యేలు తమతో టచ్‌లోనే ఉన్నారని, తాము చేర్చుకోవడం మొదలుపెడితే వైకాపా అధినేత జగన్ టూ లెట్ బోర్డుపెట్టుకోవల్సి ఉంటుందని తెలుగుదేశం పార్టీ నేతలు చెబుతున్నారు. కాగా విపక్ష నేత జగన్ మరో అడుగు ముందుకేసి, 21మంది ఎమ్మెల్యేలు తమ పార్టీలో చేరితే ప్రభుత్వానే్న పడగొడతామని సవాల్ విసరడం కూడా గమనార్హం.
ఇదిలాఉండగా 28 మంది వైకాపా ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో ఉన్న మాట నిజమేనని ఐటి మంత్రి పల్లె రఘునాధరెడ్డి పేర్కొనగా, ఎవరినీ బలవంతంగా పార్టీలో చేర్చుకునేది లేదని, ఆసక్తితో పార్టీలో చేరేందుకు ముందుకు వస్తే తప్పకుండా పరిశీలిస్తామని ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు పేర్కొన్నారు.