ఆంధ్రప్రదేశ్‌

రబీకి నీరివ్వకపోతే ప్రత్యక్ష పోరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పిసిసి అధ్యక్షుడు రఘువీరారెడ్డి హెచ్చరిక

రాజమండ్రి, డిసెంబర్ 29: ఉభయ గోదావరి జిల్లాల్లోని గోదావరి డెల్టాలోని మొత్తం ఆయకట్టుకు సాగునీరందిస్తామని చెప్పి, రైతులతో రబీ సాగు మొదలుపెట్టించిన రాష్ట్ర ప్రభుత్వం నీరందించకపోతే రైతుల తరపున కాంగ్రెస్ పార్టీ ప్రత్యక్ష పోరాటం చేపడుతుందని పిసిసి అధ్యక్షుడు ఎన్ రఘువీరారెడ్డి హెచ్చరించారు. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో మంగళవారం ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన భరోసాతో రైతులు రబీ సాగు చేపట్టి ఇప్పటికే ఎకరాకు సుమారు రూ.6వేలు నుండి రూ.7వేలు వరకు పెట్టుబడి పెట్టారన్నారు. ఇపుడు 60శాతం ఆయకట్టుకు మాత్రమే సాగునీటిని అందిస్తామని అధికారులు చెబుతున్నారన్నారు. ఈ దశలో సాగు ఆపమంటే రైతులు నష్టపోతారన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్వాకంవల్ల ఇప్పటికే రైతులు తీవ్రంగా నష్టపోయారని, రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రుణ మాఫీ లభించక, వర్షాభావం, అకాల వర్షాల వల్ల ఖరీఫ్ పంటను రైతులు పోగొట్టుకున్నారన్నారు. కనీసం రబీ అయినా దక్కుతుందన్న ఆశతో ఉన్న రైతులు రాష్ట్ర ప్రభుత్వ చేతకానితనం వల్ల మరోసారి నష్టపోయే పరిస్థితి ఏర్పడిందన్నారు. డిసెంబర్ నెలాఖరు నాటికి నాట్లు పూర్తిచేయాలని ఉభయగోదావరి జిల్లాల కలెక్టర్లు తొందరపెట్టారని, దాంతో రైతులు నాట్లు వేసుకున్నారన్నారు. ఇపుడు నీరు లేదంటూ కొంత ఆయకట్టులో రబీని ఆపమంటున్నారన్నారు. ఇపుడు కొత్తగా బోర్లు వేసుకోమని అధికారులు రైతులకు సూచిస్తున్నారని, ఇది ఎంతవరకు సమంజసమని రఘువీరారెడ్డి ప్రశ్నించారు. రైతుల జీవితాలతో ఆటలాడుతుంటే కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదన్నారు. సీలేరు నుండి తెస్తారో, గోదావరి నీళ్లే ఇస్తారో ప్రతి ఎకరానికి సాగునీటి సరఫరా జరిగి తీరాలని డిమాండ్ చేశారు. రబీ సాగుచేసుకోమని చెప్పి, ఇపుడు రాష్ట్రప్రభుత్వం చేతులెత్తేస్తోందన్నారు. ప్రాజెక్టుల వద్దే నిద్రపోతానని చెబుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు, గోదావరి డెల్టా కాలువ గట్లపై నిద్రచేసి, పంటను కాపాడాలని సూచించారు. పట్టిసీమ ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టినప్పటి నుండి గోదావరి జిల్లాల రైతులకు ఏడాదిన్నర కాలంగా కంటిమీద కునుకు లేకుండా పోయిందన్నారు. పట్టిసీమ ప్రాజెక్టు వల్ల రాయలసీమకు ఎలాంటి ప్రయోజనం ఉండదని, అసలు రాయలసీమ ప్రజలు పట్టిసీమ ప్రాజెక్టును అడగలేదన్నారు. మరొకరి పొట్టకొట్టి, తాము లాభపడాలన్న మనస్తత్వం రాయలసీమ ప్రజలది కాదని, పస్తులయినా ఉంటారు, చావనైనా చస్తారుగానీ, రాయలసీమ ప్రజలు మరొకరికి నష్టం జరగనివ్వరన్నారు. రాయలసీమ ప్రజలు పౌరుషం కలవారన్నారు. కేవలం అధికార పార్టీ పెద్దలు తమ ప్రయోజనాల కోసమే పట్టిసీమ ప్రాజెక్టును నిర్మించారన్నారు. దీనివల్ల ఇపుడు గోదావరి డెల్టాకు నష్టం కలుగుతోందన్నారు. పట్టిసీమ ప్రాజెక్టు పేరుతో రూ.500కోట్లు దోపిడీ జరిగిందన్న విషయాన్ని ప్రజలంతా గుర్తించారన్నారు.
పోలవరం ప్రాజెక్టును 2018నాటికి పూర్తిచేసి తీరాలని, అపుడే గోదావరి డెల్టాలో రెండు పంటలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా నీటి సరఫరా జరుగుతుందన్నారు. గోదావరి డెల్టా రైతులకు నష్టం జరిగితే ఎంతటి పోరాటానికైనా కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతుందని, జైళ్లకు, లాఠీలకు, అరెస్ట్‌లకు భయపడేది లేదని రఘువీరారెడ్డి హెచ్చరించారు. విలేఖర్ల సమావేశంలో కేంద్ర మాజీ మంత్రులు పళ్లంరాజు, జెడి శీలం, మాజీ మంత్రి వట్టి వసంతకుమార్ తదితరులు పాల్గొన్నారు.