రివ్యూ

ఫీల్ లేని పోరాటం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫర్వాలేదు** భాఘి -3
**
తారాగణం: టైగల్ ష్రాఫ్, రితేష్ దేశ్‌ముఖ్, శ్రద్ధాకఫూర్
బ్యాగ్రౌండ్ స్కోర్: జులియస్ ప్యాకియం
సినిమాటోగ్రఫీ: శంతన కృష్ణన్, రవిచంద్రన్
ఎడిటింగ్: రామేశ్వర్ ఎస్ భగత్
నిర్మాత: సాజిత్ నడియావాలా
దర్శకత్వం: అహ్మద్ ఖాన్
**
ఈ ప్రపంచమింకా ఇలా ఉందంటే కారణం -ప్రేమ. చుట్టూ అందంగా అల్లుకున్నవే బంధాలు, బాధ్యతలు. తల్లిదండ్రులు ఎదిగేవరకూ వెంటుంటారు. భార్య -జీవితం మధ్యలో ప్రవేశిస్తుంది. అక్క చెల్లెళ్లు మనతో కొంతకాలమే ఉంటారు. జీవితాంతం మనతో కలిసుండే అవకాశం సోదరులకే ఉంటుంది. వాళ్లే మన కష్టసుఖాలలో పాలుపంచుకుంటూ జీవిత చరమాంకం వరకు అండదండగా ఉంటారు -రామాయణంలో రామలక్ష్మణుల్లా. అన్నదమ్ముల అనుబంధం అనిర్వచనీయం. అలాంటి ఓ కథకు దృశ్యరూపమిస్తే -బాగీ 3. నడియావాలా గ్రాండ్ సన్స్ ఎంటర్‌టైన్‌మెంట్, ఫాక్స్ స్టార్ స్టూడియో సంయుక్తంగా నిర్మించిన చిత్రాన్ని దర్శకుడు అహ్మద్‌ఖాన్ తెరకెక్కించాడు.
విక్రమ్ (రితేష్ దేశ్‌ముఖ్) మహా పిరికివాడు. రౌడీలను, గూండాలని చూస్తేనే వణికిపోయి పక్కదారిలోంచి పారిపోతుంటాడు. ఇతని తమ్ముడు రాదే (టైగర్ ష్రాఫ్) సాహసి, మహాబలవంతుడు. తన తండ్రి జాకీ ష్రాఫ్ చనిపోతూ ‘అన్నయ్య అమాయకుడు. అతన్ని జాగ్రత్తగా చూసుకో’ అని చెప్పి కన్నుమూస్తాడు. అప్పట్నుంచి అన్నయ్యే అతని లోకం. కంటికి రెప్పలా ప్రతిక్షణం కాపాడుకుంటూ, అతనికి ఏ కష్టం రాకుండా చూస్తుంటాడు.
కొన్ని తప్పని పరిస్థితుల్లో అన్నయ్య పోలీసు ఉద్యోగంలో చేరాల్సి వస్తుంది, చేరతాడు. కాని అతను చేరిన పోలీసు స్టేషన్ పరిధిలో రౌడీలు రాజ్యమేలుతుంటారు. పిరికివాడైన అన్న తప్పని పరిస్థితులలో తమ్ముడి సాయం కోరటం, తమ్ముడు ఆ గ్యాంగ్‌ని మట్టికరిపించటం.. అన్నయ్యకు ప్రమోషన్ రావటం చకచకా జరిగిపోతుంది.
సిరియాలో గాజీ అనే ఓ క్రూరుడు సిరియా ప్రభుత్వాన్ని, దేశాన్ని అల్లకల్లోలం చేసి దాన్ని ఆక్రమిచాలని చూస్తూ, మానవ బాంబులతో దేశాన్ని అట్టుడికిస్తాడు. అక్కడి పోలీసులు అతన్ని నిలువరించలేపోతారు. అయితే మానవ బాంబులు కావాలి కాబట్టి ప్రపంచవ్యాప్తంగా వున్న తన ఏజెంట్ల ద్వారా కొన్ని కుటుంబాలని కిడ్నాప్ చేసి వాళ్ల భార్యాబిడ్డలను చంపుతానని బెదిరించి కుటుంబ పెద్దని మానవ బాంబుగా మార్చి రద్దీ ప్రదేశాలకు వెళ్లి తనను తానే పేల్చుకొని, కొన్ని వేలమందిని చంపేటట్లు పథకాలు రచించి అమలు చేస్తుంటాడు.
ఆగ్రా (్భరతదేశం)లో ఉండే అన్నదమ్ములైన విక్రమ్, రాధేలకు ఎక్కడో సిరియాలో మారణహోమాలు సృష్టించే గాజీకి ఏమిటి సంబంధం? అతని రాక్షస కౌగిలిలో బందీగా మారిన అన్నను ఓ తమ్ముడు ఎలా కాపాడుకున్నాడు అనేది తెరపైనే తెలుస్తుంది.
రాధేగా నటించిన టైగర్ ష్రాఫ్ గురించే చెప్పుకోవాలి. సినిమాని ఒంటిచేత్తో మోసేశాడు. ఫైట్లు అద్భుతంగా చేశాడు. కండలు తిరిగిన దేహంతో గండరగండడుగా అద్భుతంగా కనిపించారు. డాన్సులు, పోరాట దృశ్యాలతో సినిమాలు ఆడతాయి కాని దానికి గొప్ప నటన తోడైతే తెరపై మహాద్భుతాలు ఆవిష్కరించబడతాయి. ఈ జూనియర్ కండలవీరులు తన సీనియర్ కండల వీరులనుండి నేర్చుకోవాల్సి వుంది. సల్మాన్, హృతిక్ డాన్సులు, ఫైట్లతోపాటు అద్భుత భావోద్వేగాలను అలవోకగా పండిస్తారు. టైగర్ మోములో ఇంకొన్ని హావభావాలు పండితే ప్రేక్షకులకు కన్నుల పండుగే. డ్యాన్స్, ఫైట్లతో మంచి గ్రేడు సాధించాడు. నటన ఓకె.
అన్నగా నటించిన రితేష్ ఆ పాత్రకు అతికినట్టు సరిపోయాడు. బాడీ లాంగ్వేజ్, హావభావాలు సరిగా సరిపోయాయి. తమ్మునిపట్ల ఇతనికి వున్న ప్రేమ క్లైమాక్స్‌లో కనిపించే సన్నివేశంలో అద్భుతంగా నటించాడు. తన తమ్ముడిని పొడిచిన విలన్ గ్యాంగుని చిత్తుగా కొట్టే సీన్ బావుంది. శ్రద్ధాకపూర్‌కి నటించే ఆస్కారంవున్న సీన్స్ తక్కువ. ఉన్న సీన్లలో తన పరిధి మేరకు చక్కగా నటించింది. అతిథి పాత్రలాగా చాలా తక్కువ నిడివివున్న పాత్రైనా జాకీష్రాప్ అద్భుతంగా నటించాడు. జాకీ గొప్ప నటుడు. అన్ని పాత్రలలో అద్భుతంగా నటించి శభాష్ అనిపించుకున్నాడు. ఇంత గొప్ప నటుడి నటవారసునిగా వచ్చిన టైగర్ తండ్రిని ఆదర్శంగా తీసుకొని నటనను మరింతగా మెరుగుపర్చుకుంటే గొప్ప నటుడిగా ఓ వెలుగు వెలగటం తథ్యం!
పాటలు బావున్నాయి. ‘తేరే జైసీ యారు కహా’ (నీలాంటి గొప్ప స్నేహితుడు లేడు) అనే అర్థంలో వచ్చే పాతకాలపు గొప్ప పాటతోపాటు వచ్చే పాటలు బావున్నాయి. డైలాగ్స్, పొడుపు కథలు బావున్నాయి. ‘మనము ధరిస్తాము, తింటాము..’ ఏంటది? చెప్పుదెబ్బలు.
ఇక దర్శకుడు ఎంచుకున్న కథ చాలా పాతది. ఈ లైన్ తీసుకునే ఎన్నో సినిమాలొచ్చాయి. కొన్ని అద్భుతంగా ఆడాయి. ఈ పాత కథని కొత్తగా చూపించలేకపోయాడు. కేవలం డాన్సులు, ఫైట్లకోసమే సినిమా తీసినట్టుగా తీశాడు. ఫైట్లుకూడా పాత పద్ధతిలోవే! క్లైమాక్స్‌లో హెలికాప్టర్లు హీరోని చుట్టుముట్టే సీన్ తప్ప ఆహా అనిపించే సీన్స్ లేవు. స్క్రీన్‌ప్లేలో బలంలేక చతికిలపడింది. ఏ మెరుపులు లేక ఓ సాదా సీదా సినిమాగా మిగిలిపోయింది. ప్రాణంలేని శరీరానికి మేకప్ వేసినట్టుగా తయారైంది. ఎంత కష్టపడినా కథ, కథనాలలో వైవిధ్యం చూపలేకపోతే అన్ని సినిమాలలో ఇదొకటిగా మిగిలిపోయింది.

-మధుర మురళి