రాష్ట్రీయం

నిండుకున్న జలాశయాలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, మే 8: జలకళతో తొణికిసలాడే గోదావరి జిల్లాల్లోని జలాశయాలు ఇపుడు నిండుకున్నాయి. డెడ్ స్టోరేజికి చేరుకున్నాయి. ఖరీఫ్‌లో కూడా నీటి గండం ఉండేలా పరిస్థితి కనిపిస్తోంది. ఖరీఫ్‌లో సాగునీటిని సరఫరా చేసే రిజర్వాయర్లలో నీటి నిల్వలు పూర్తిగా అడుగంటాయి. ఖరీఫ్ నాటికైనా జల కళ సంతరించుకుంటుందా అనే అనుమానాలు వెంటాడుతున్నాయి. వేసవి ఆధునికీకరణ పనులు పూర్తయితేనే ఖరీఫ్‌లో సాగునీరు లక్ష్యం మేరకు దక్కే పరిస్థితివుంది. లేదంటే పూడుకుపోయిన కాలువల వల్ల పూర్తి స్థాయిలో సాగునీరు అందే అవకాశం కన్పించడంలేదు. తూర్పు గోదావరి జిల్లాలోని ఏలేరు, సుబ్బారెడ్డి సాగర్, సూరంపాలెం, మద్దిగెడ్డ, పంపా, భూపతిపాలెం, ముసురుమిల్లి ప్రాజెక్టుల్లో నిల్వలు పూర్తిగా అడుగంటిపోయాయి. ఏలేరు రిజర్వాయర్ డెడ్ స్టోరేజికి చేరుకుంది. 0.010 టిఎంసికి నిల్వలు పడిపోయాయి. సూరంపాలెం రిజర్వాయర్‌లో 0.030 టిఎంసిలకు నీటి మట్టం పడిపోయింది. పంపా రిజర్వాయర్‌లో 0.010 టిఎంసిలు నీటి నిల్వలు పడిపోయాయి. వర్షాలు సకాలంలో కురవకపోతే ఖరీఫ్‌లో విత్తనాలు వేసే సమయానికి ఈ ప్రాజెక్టుల నుంచి సాగునీరు అందించలేని సూచనలు కనిపిస్తున్నాయి. ఏలేరు నీటి సామర్ధ్యం 24.11 టిఎంసిలు, ఖరీఫ్‌లో 57వేల ఎకరాలకు సాగునీరు అందిస్తుంది. ఈ ఏడాది నుంచి పురుషోత్తపట్నం నుంచి ఏలేరు ఆయకట్టును స్థిరీకరించాలనేది సంకల్పం. అయితే సకాలంలో ప్రాజెక్టు పూర్తయితే సరి, లేకపోతే ఆయకట్టుకు నీరు అందించలేని స్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం 4 టిఎంసిలకు నీటి మట్టం పడిపోయింది. తూర్పు కనుమల్లో కురిసిన వర్షం జడేరు, మడేరు వాగుల ద్వారా ఏలేరులోకి చేరుకుంది. ఈ ప్రాజెక్టు నిర్మించి దాదాపు నలభై ఏళ్లు పూర్తవుతుండటంతో పూడిక పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో రూ.137 కోట్లతో ఆధునికీకరణ పనులు చేపట్టారు. పనులు ఖరీఫ్ నాటికి పూర్తయ్యే పరిస్థితి లేదు. దీంతో వర్షాలు సకాలంలో పడకపోతే మాత్రం ఏలేరు నుంచి ఈ ఖరీఫ్ నీటి సరఫరా ప్రశ్నార్ధకంగానే వుంది. ఇక జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతానికి సంబంధించి భూపతిపాలెం రిజర్వాయర్ ప్రాజెక్టు ద్వారా 23వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించేందుకు నిర్దేశించినప్పటికీ కేవలం నాలుగు వేల ఎకరాలకు మాత్రమే అందిస్తున్నారు. ఇది కూడా ప్రస్తుత పరిస్థితుల నేపధ్యంలో అందే పరిస్థితి కనిపించడం లేదు. రంపచోడవరం, గంగవరం మండలాల్లోని ఏజెన్సీ పొలాలకు సాగునీరు అందించాల్సివుంది. జూన్ నుంచి ఏజెన్సీలో వర్షాలు కురిసి కొండ వాగులు ద్వారా సీతపల్లి వాగులోకి భారీస్థాయిలో వరద నీరు చేరుకుని భూపతిపాలెం రిజర్వాయర్ నిండుకుండలా ఉంటుంది. ఇటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ పూర్తి ఆయకట్టుకు సాగునీరు అందించలేని స్థితిలో ఈ ప్రాజెక్టు అలంకారప్రాయంగా మారింది. ప్రాజెక్టును నిర్ధేశిత లక్ష్యం మేరకు పూర్తిచేసేందుకు నిధులు కేటాయించాలని, పూర్తి స్థాయిలో సాగునీరు అందించాలని గిరిజన రైతులు కోరుతున్నారు. 0.65 టిఎంసిల సామర్ధ్యం కలిగిన ఈ రిజర్వాయర్‌లో 0.30 టిఎంసిల నీటి నిల్వలు వున్నాయి. అదే విధంగా మన్యం ప్రాంతంలో గోకవరం, కోరుకొండ, రంపచోడవరం, గంగవరం మండలాల పరిధిలోని ఏజెన్సీ భూములకు సాగునీరు అందించేందుకు నిర్మించిన ముసురుమిల్లి రిజర్వాయర్ ప్రాజెక్టు కాల్వలకు సాగునీరు అందించకుండానే పూడికపేరుకుపోవడంతో కనీసం స్థాయిలో కూడా సాగునీరు అందించే పరిస్తితి కన్పించడం లేదు. సూరంపాలెం రిజర్వాయర్ ప్రాజెక్టు సామర్ధ్యం 0.25 టిఎంసిలు కాగా కేవలం 0.03 టిఎంసిల నీరు మాత్రమే వుంది. ఈ ప్రాజెక్టు ద్వారా 15వేల ఎకరాలకు సాగునీరు అందంచాల్సివుంది. సకాలంలో వర్షాలు పడకపోతే మాత్రం ఈ ఆయకట్టు నోరెళ్లబెట్టాల్సిందే. కాల్వల్లో కూడా పూడికలు పెరిగిపోయాయి. అన్ని ప్రాజెక్టుల్లోనూ ఆధునికీకరణ పనులు సకాలంలో పూర్తిచేసి ఖరీఫ్ నాటికి లక్ష్యం మేరకు సాగునీరు అందిస్తామని చిన్నతరహా సాగునీటి ప్రాజెక్టుల పర్యవేక్షణాధికారి సుగుణాకరరావు చెప్పారు.

1200 పోస్టుల భర్తీకి త్వరలో నోటిఫికేషన్
ఎక్సైజ్ శాఖ మంత్రి జవహర్
నరసాపురం, మే 8: ఎక్సయిజ్ శాఖలో 1200 పోస్టుల భర్తీకి త్వరలో నోటిఫికేషన్ జారీ చేయనున్నామని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కెఎస్ జవహర్ చెప్పారు. ప్రస్తుతం తమ శాఖలో 6400 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారని, వీరికి అదనంగా రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో ఏర్పడిన ఖాళీలను భర్తీ చేస్తామన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో సోమవారం ఆయన విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. ముందుగా ఒప్పంద ఉద్యోగులను విధుల్లోకి తీసుకుంటామని, అలాగే ఉద్యోగులకు పదోన్నతులు కల్పిస్తామన్నారు. సిబ్బంది పెట్రోలింగ్ నిర్వహించడానికి సొంత వాహనాలు కొనుగోలుచేస్తామన్నారు. రాష్ట్రంలో నాటు సారా నిర్మూలించి, సారా రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి ప్రత్యేక చర్యలు తీసుకున్నామన్నారు. దీనిలో భాగంగా తూర్పు గోదావరి జిల్లా సామర్లకోటలో రూ.20 కోట్ల వ్యయంతో శిక్షణా కేంద్రం ఏర్పాటుచేస్తామన్నారు. అలాగే సిబ్బందికి ఆధునిక ఆయుధాలు, వాహనాలు సమకూరుస్తామన్నారు. రాష్ట్రంలో కల్తీ మద్యం విక్రయించే దుకాణాలపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు. ఇతర రాష్ట్రాల నుంచి అక్రమ మద్యం రాష్ట్రంలోకి చొరబడకుండా సరిహద్దులలో చెక్‌పోస్టులు ఏర్పాటుచేశామన్నారు. ఏజెన్సీ ప్రాంతంలో కల్తీమద్యం నిర్మూలించి, నాణ్యమైన మద్యం సరఫరా చేసేందుకు అన్ని చర్యలు తీసుకున్నామన్నారు.

ఎడ్‌సెట్-2017లో
7వేల మందికి అర్హత
ఆంధ్రభూమి బ్యూరో
విశాఖపట్నం, మే 8: ఎపి ఎడ్‌సెట్ 2017 ఫలితాలను ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఎడ్‌సెట్ కన్వీనర్ సోమవారం విడుదల చేశారు. మొత్తం పరీక్షకు 8,785 మంది దరఖాస్తు చేసుకోగా, 7,152 మంది హాజరయ్యారు. వీరిలో 7వేల మంది అభ్యర్థులు అర్హత సాధించారు. మేథమెటిక్స్‌లో ఆంధ్రా యూనివర్శిటీ ఫరిధి నుంచి 982 మంది హాజరుకాగా 100 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఎస్‌వి యూనివర్శిటీ పరిధిలో 681 మంది హాజరుకాగా 100 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఫిజికల్ సైన్స్‌లో ఎయు పరిధి నుంచి 498 మందికి గాను, 497 మంది, ఎస్‌వియు పరిధి నుంచి 247 మందికి గాను 246 మంది ఉత్తీర్ణులయ్యారు. బయలాజికల్ సైన్స్ విభాగంలో ఎయు పరిధి నుంచి 775 మందికి గాను 768 మంది, ఎస్‌వియు పరిధి నుంచి 645 మందికి గాను 638 మంది ఉత్తీర్ణత సాధించారు. సోషల్ స్టడీస్‌లో ఎయు పరిధి నుంచి 1485 మందికి గాను 1430 మంది, ఎస్‌వియు పరిధి నుంచి 1260 మందికి గాను 1192 మంది ఉత్తీర్ణత సాధించారు. ఇంగ్లీష్‌లో ఎయు నుంచి 298 మందికి గాను 296 మంది, ఎస్‌వియు పరిధిలో 87 మందికి గాను శతశాతం ఉత్తీర్ణత సాధించారు.

రాష్ట్రానికి రానున్న 28 ఐటి కంపెనీలు
పోలవరం, మే 8: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేస్తున్న కృషి కారణంగా రాష్ట్రానికి 28 ఐటి కంపెనీలు రానున్నాయని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తెలిపారు. ప్రపంచంలో అత్యుత్తమ కంపెనీలు ఆంధ్రాకు రావడం ద్వారా లక్ష ఉద్యోగాలు లభిస్తాయన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు పరిశీలించడానికి సోమవారం ఇక్కడకు వచ్చిన మంత్రి దేవినేని విలేఖర్లతో మాట్లాడారు. ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తన బాధ్యత నిర్వహించకుండా దుర్మార్గంగా ప్రవర్తిస్తోందని ధ్వజమెత్తారు. ప్రాజెక్టులు అడ్డుకోవడానికి ఆ పార్టీ చేయని ప్రయత్నం అంటూ లేదన్నారు. విదేశాలలో మన రాష్ట్రాన్ని అప్రతిష్టపాల్జేస్తోంద ధ్వజమెత్తారు. ఒకవైపు ఉద్యోగాలు లేవని, కంపెనీలు రాలేదని విమర్శిస్తూ కంపెనీలను తీసుకురావడానికి అమెరికా పర్యటనలో ఉన్న సిఎంపై ఇ మెయిల్ ద్వారా విషప్రచారాన్ని చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇ మెయిల్స్ ద్వారా ప్రచారం చేసిన వారిపై విచారణ జరిపి చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు.

నంద్యాల అభ్యర్థిపై
సిఎందే తుది నిర్ణయం
ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన శిల్పా చక్రపాణిరెడ్డి
ఆంధ్రభూమి బ్యూరో
విజయవాడ, మే 8: నంద్యాల అభ్యర్థిపై ముఖ్యమంత్రి చంద్రబాబుదే తుది నిర్ణయమని ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణిరెడ్డి స్పష్టం చేశారు. వెలగపూడి సచివాలయ ఆవరణలోని శాసనమండలి చైర్మన్ చక్రపాణి చాంబర్‌లో ఆయన సోమవారం ప్రమాణస్వీకారం చేశారు. మండలి చైర్మన్ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తనకు రెండోసారి ఎమ్మెల్సీగా అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. నంద్యాలలో గెలిచే అభ్యర్థి ఎవరన్న అంశంపై సర్వే చేయిస్తున్నామని తెలిపారు. సీటు ఎవరికిచ్చినా గెలుపు కోసం పని చేస్తానన్నారు. సిఎం నిర్ణయం శిరోధార్యమన్నారు. సిఎం, మంత్రిలోకేష్ ఆశయాలకు అనుగుణంగా పని చేస్తామని వెల్లడించారు. ఎంపిటీసీ, జడ్పీటీసీ సభ్యులు, కౌన్సిలర్ల గౌరవ వేతనాల పెంపునకు తన వంతు కృషి చేస్తానని, వారి సమస్యలపై కూడా దృష్టి సారిస్తానన్నారు.

జూ.కళాశాలల్లో
బయోమెట్రిక్ హాజరు
ఆంధ్రభూమి బ్యూరో
రాజమహేంద్రవరం, మే 8: ఇంటర్మీడియట్ కళాశాలల్లో విద్యార్థుల హాజరు విషయంలో కూడా ఆధార్ అనుసంధానిత బయోమెట్రిక్ విధానాన్ని ప్రభుత్వం ప్రవేశ పెట్టింది. ఈ విధానంలో విద్యార్ధులు ముందుగా వేలి ముద్ర వేసిన తర్వాత తరగతి గదిలోకి ప్రవేశించాల్సివుంది. విద్యార్థుల కచ్చితమైన హాజరు కోసం ఇంటర్మీడియట్ కళాశాలల్లో ప్రభు త్వం కొత్తగా ఆధార్ అనుసంధాన బయోమెట్రిక్ విధానాన్ని ప్రవేశ పెట్టింది. విద్యార్ధుల సంఖ్యతో పాటు పారదర్శకమైన విధానంలో స్కాలర్ షిప్‌లను అందించేందుకు, ఫీజు రీయంబర్స్‌మెంట్‌కు ప్రధానంగా దోహదపడుతుందని విధిగా బయోమెట్రిక్ విధానాన్ని ప్రవేశ పెట్టింది. బయోమెట్రిక్ యూనిట్ల ఏర్పాటుకు ఈ నెలాఖరు వరకు గడువు ఇచ్చారు. జిల్లాలోని అన్ని జూనియర్ కళాశాలల్లో విద్యార్ధులకు తప్పనిసరిగా ఆధార్ అనుసంధాన బయో మెట్రిక్ యూనిట్లను ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుందని రాజమహేంద్రవరం ఇంటర్ బోర్డు ప్రాంతీయ పర్యవేక్షణాధికారి ఎ వెంకటేష్ తెలియజేశారు.