మెయిన్ ఫీచర్

అమృతము కూడు కట్టిన దొర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాలి వెనె్నల కురిపించు చందమామ
మాట కరుకైన నేమిలే మనసువెన్న
గుండె లోతెరింగిన యట్టి గొప్పవాడు
అమృతము కూడుకట్టిన యయ్యాగాదె’’
అని ఎప్పుడో చిన్నప్పుడు మా తాత గురించి నేను వ్రాసుకున్న పద్యమిది. అప్పటి నా వయస్సు పదిమీద నాలుగు. తాత కరవై దాటి ఎనిమిది గడిచినవి. వయసు కన్నా ముందు ‘‘కోట పద్మనాభ’’ మసలు తాతట చేత ఈ’’ విది తస్వ శక్తిపై విశ్వాసమన్నవాడు’’న్నూ తాతయే. అరణి మధించి సంపాదించిన అగ్నివంటివాడు కదా! అదీ నా చెలిమి చుట్టరికం.
అగ్గిపుల్లలు ఎనె్నన్నో అంటుకొని వెలిగి ఆరిపోయినా ఈ అలౌకికాగ్ని నిత్యవనం కలది అరుంది. కలకాలం నిలవగలదీ అయింది. అరణి మధించటం ఎంత కష్టమో మా ‘‘తాత’’నర్థం చేసుకోవడమూ అంత కష్టమే. కానీ ఆ స్పర్శ తగిలితే మరో పెడ మనసు పోదు. కొందరు కొన్నివేళల్లో కవులు; మరికొన్ని వేళల్లో మానవులు. నాకు తెలిసి మా ‘‘తాత’’సర్వవేళలా మహాకవే. కవిత్వ భాషలో ‘‘కవనార్థమ్ముదయించి’’న వాడు. అహర్నిశలు మానవ మాత్రుడుగా జీవించి నిత్యజీవితంలో మానవుడికి సహజమైన హృదయ దౌర్బల్యాలలో కూడ కవిత్వాన్ని పిండటానికిగా అయినవాడు. మా తాతకి ‘‘పేకాట’’మహా ఇష్టం. నాతో కూడా ఆడినాడు. పదమూడు ముక్కలాట. (రమీ) అలాగే ఇంగ్లీషు సినిమాలు చూడటం కూడా. లీలామహల్-లో.
‘చెఱ్ఱాడి ఉప్పు తెచ్చిననాడు
శాత్రవ వ్యూహముల్ పగిలించునొరపు..’
- లాంటి వాటిని ఎగసనతోయడానికే. సినిమాలు చూస్తున్నా ఆ చూస్తున్నది మనసులోని అక్షయభాండారంలో నిద్రాణమైన దాన్ని కవిత్వంగా రూపురేఖలు కట్టించడానికే. సర్వవేళల్లోను ఒకే ఒక లక్ష్యంతో జీవయాత్ర అయేసరికి ధ్యానము- ధ్యేయము- ధ్యాత కలిసి ముప్పేటగా అవటం జరుగుతుంది. ఇది మా ‘‘తాత’’లో సర్యాత్మనా చూడగల అంశమే. మా తాతలో మనిషిని మనీషిని వేరుచేసి చూడలేము. ఈ యోగం ఓ పట్టానరానిదీ; వస్తే నిలవనిదీ; నిలిస్తే మాత్రం నవ నిధులను ఒరిగించేది. ఈ పరుస వేదిని చేతబట్టుకునే మా తాత; బసవరాజు అప్పారావుగారు అన్నట్లు ‘‘ఎన్ని పోకడలయినా పోగలడు; పోకడలన్నిటినీ పైడిముద్దలు చేయనూ గలడు.’’
తిక్కన మహాభారతాన్ని రచించే ముందు ‘‘మహాకవిత్వ దీక్షా విధినొంది రచించెద’’-ననీ ‘‘నా పుట్టుకృతార్థతం బొరసె’’ అనీ చెప్పాడు. ప్రాచీనులలో ఏమోగాని నవీనులలో ఈ దీక్ష ఎంతమందికుంటుందో అందరకూ తెలిసిందే. కారణం ఇప్పుడు కలం పట్టుకున్న ప్రతివాడు తిక్కనే. అక్షరాలు తెలిసిన ప్రతివాడు ఆనందవర్ధనుడే. ఐతే ఈ ‘‘దీక్షావిధి’’ అక్షర సాక్ష్యంగా నెలరోజుల వ్యవధిలోనే ‘‘వేయి పడగలు’’ విప్పుకుంది. ఈ ‘‘నిష్ఠాగరిష్ట’’మైన కార్యభారాన్ని మా చినతాత సహాయంతో నిర్వహించి కృతకృత్యుడయ్యాడు. (ఇది నేను చూచింది కాదు చెప్పగా విన్నది). అది ఇప్పుడు తలచుకుంటే ఒక దుఃఖం ఒక సంతోషం కలగలసి ఈ పద్యమైంది.
‘‘ఎంత కోమల పుష్పవృష్టి వర్షించెనో
రమణీయ నందనారాయమవాటి
ప్రణవ నాదంబెంత ప్రభవించి మొరసెనో
విబుధ లోకపు దుందుభి వ్రజంబు
ఎంత కమ్మని హాయి ఏ పార వీచెనో
పారిజాత సుగంధ పవన బాల
ఇంపుసొంపిలనెన్ని వంపులు తిరిగెనో
యప్సరాంగనల నృత్యముల మేను
ఎరమిరస భాండ భాండిక లెన్నియెన్ని
హరణమయ్యెనో మధురామృతాన్న పంక్తి
కల సమస్తంబునకు మనఃకాంతుడైన
....... తెలుగున నెలయునాడు...’’
విబుధులు చెప్పగా విన్న సంగతి. వేదం వెంకట్రాయ శాస్త్రులుగారు నైషధం. ఆముక్తమాల్యద గ్రంథాలకు వ్యాఖ్యానం వ్రాసే రోజులలో ఆ బృహత్తర కార్యం నిర్వహిస్తూనే విశ్రాంతికోసం కాళిదాసు, శ్రీహర్షుల నాటకాలను తర్జుమా చేశేవారట. ఇట్టివారినేకదా ‘‘గాఢ ప్రతిభు’’ లంటుంది లోకం. శ్రీనాధుడొకచోట నన్నయగారిని గాఢ ప్రతిభుడంటే- దేవులపల్లి కృష్ణశాస్ర్తీగారు మా ‘‘తాత’’ని గాఢ ప్రతిభుడితడు అని శ్లాఘించాడు. ఈ ప్రతిభతోటే ‘‘తాత’’ ఎన్ని పొత్తాలు వ్రాశాడని. దేనికదే ప్రత్యేకోత్తమం. వ్రాసింది రాశిలోనే కాదు వాసిలోను అనితర సాధ్యమే. ఆయనకెదురైన ప్రతీపశక్తుల్ని ‘‘్ఢ’’కొని చిత్తుచిత్తు చేశాడు. జంట కవుల ప్రియశిష్యుడు కదా అందుకే ఈ గురుస్తుతి.
‘‘లంపుల మారి ధూర్త కవులన్ కికురింతలు సేయు నేర్పు
సెల్లింపులు మీకు దక్కినవిలే-
తొలికారు మెరుంగుటందపున్ మంపెసలారు
గొజ్జగి సుమాళము మీకవనంపు నీటులో జంపుల
పల్లెకాపు నెరజాణల ఊయల లూపులూగబో’’ అనీ
‘‘విద్యానగర రాజవీధులలోబడి కదలి వచ్చినది మీకడకు కవిత’’ అనీ
‘‘మీదై క్రిందయినారు కాకవులు- సామీచన్య
పంథా గతుండై దూరీకృత శత్రువై తుదకు తానై
కైత కొగ్గరి; కవుల్ వేదూండ్లంబలె నీరసంపడిరి కాళీ
పాద మంజరీ నానాదేశంబున మద్గురూత్తముడు
శబ్దాంభోధి బంధించుచో’’ అని గురుస్తుతి చేశాడు.
తాత ‘సాహితీ సమితి’ సభ్యుడు. ఉన్నది సంవత్సరన్నర. ఈ ఏణ్ణర్థపు కాలంలోనే ఆయన కీర్తిపతాకానికి బంగారుమువ్వలు పట్టెడకట్టి ‘‘నర్తనశాల’’లో ‘‘అనార్కలి’’ అభినయించటం తెలుగులు చేసుకున్న పుణ్య పరిపాకమే. కారణమేమిటో కాని సాహితీ సమితి మూల విరాట్టుకు తాతకు సరిపడలేదు. గునుగు మేత విషయంలో మా తాత నీతిమంతుడే. ఆ సమయంలో ఆయనకు బాసటగా నిలచిన ‘‘నండూరి సుబ్బారావుగారు- నాయని సుబ్బారావుగారు, కొడాలి ఆంజనేయులుగారు నలుగురు సాహితీ సమితి గడపదాటారు. ‘‘చైత్ర - వైశాఖ’’ముల వంటి జంటకవులిర్వురి ప్రమేయంతో ఆ సాహితీ సమితికి స్వస్తిచెప్పాడు. మా తాత కనుక ఆ ‘‘పడమటి చాంచర’’మునకు ఎదురొడ్డి నిలిచాడని అంటారు. మరొకరు ఎవరైనా అయితే స్పృహ కోల్పోయేవారని కూడా అంటారు. ఎత్తిన కలం దించకుండా పరంపరలుగా కావ్యాలు కథలు వ్రాసుకుపోతునే వున్నాడు. దేశం క్రమశః తాత అక్షరాలను ఆపోశన పట్టింది. ‘‘విదిత స్వశక్తిపై విశ్వాసమున్న- ఎదిరి సామర్థ్యంబు తృణంగానే తోస్తుంది. అలాగే తోచింది కూడా. కారణం తాత శక్తి(ప్రతిభ) తాత వజ్రాయుధం.
ఇంత వజ్రాయుదం నేను మొదట్లో చెప్పుకున్న నా పద్య భావాన్ని తానే విధంగా అప్పట్లోనే చెప్పుకున్నాడో చూడండి.
‘‘మాట దురుసు చేసినావు చేసితి మనసు మెత్తనగ
బాట తప్పించితి బ్రతుకు పుట్టెడు ప్రతిభనిచ్చితివి
కోటి శత్రుల కూర్చినావు కూర్చుంటి గుండియలోన
నాటగా నందమూర్ని లయ విశే్వశ్వరా కులస్వామి...’’
అయితే ఈ గాఢ ప్రతిభ ఎట్టిది? దైవదత్తమా- స్వార్జితమా రెండూను. తాత అల్లాటప్పాకాదు గదా. గురుకుల క్లిష్టుడు. దేశంలో ‘‘తిరుపతి వేంకట’’ కవులు దిగ్విజయం చేస్తున్నారు. అందులో చెళ్ళపిళ్ళవారు కవితా సింహాసనాన్ని బందరులో ప్రతిష్ఠించారు. బందరు వీధుల్లో తెలుగు సారస్వతం పురివిప్పినట్టు త్రొక్కింది. ఆరోజుల్లో తాత బందరు విద్యార్థి. ‘‘కుంకుంబొట్టు’’- ‘‘పొడుంపట్టు’’ అప్పట్లో ఒక ‘‘్ఫ్యషన్’’. ప్రతి విద్యార్థి పద్య కుసుమాలతో మాలకట్టే విద్య నేర్చుకున్నవాడే.
అక్కడ నోబుల్ హైస్కూల్‌లో కానుకొలను త్రివిక్రమ రామారావు గారని తెలుగు ఉపాధ్యాయుడు. ఆయన సంవత్సరాలకు సంవత్సరాలే విద్యాకైంకర్యం చేశారు. శంకరాద్వైతులు. అధీతి బోధాచరణ ప్రసారాలాయన సొమ్ము. ఏకబుద్ధి. ఆయనే తరువాత ‘‘విమలానంద భారతీ’’ మహాస్వాములయ్యారు. వీరినే తాత సాక్షాత్ బ్రహ్మగా భావించారు. వీరిదగ్గర తాత నేర్చుకున్నదీ వుంది. ఆ నేర్చుకున్న ఒక ‘‘నిధి ధ్యాసే’’ శంకరులందలి పరమప్రామాణ్యమైన విశ్వాసం. సంస్కృతాంధ్రములయందలి ప్రగాఢ ప్రేమ. తాత శతావధానం చేశాట్ట... ఈమాట కొందరికైనా కొత్తగా వుంటుందేమో. నేనెరగను గదా నాకుకూడా కొత్తగా అనిపించినా ఇప్పుడా కొత్తదనం లేదు.
తెనుగు గడ్డన పుట్టాం. తెనుగు భాషలో వ్రాస్తున్నాం ఈ దేశానికి- ఈ భాషకు- కొన్ని ఆచార వ్యవహారాలు- కొన్ని సంప్రదాయాలు. సంస్కృతులు వున్నాయి. ఇవి మన మనోధర్మమూ భాషా- ప్రభుత్వమూ కలసి పాకానపడితే కానీ కవిత్వం కాదు;’’ అనేది గురుశిష్యుల అచ్చమైన దృష్టి. తాతగారంతకుముందే ‘తారక రామరావు’ (విమలానంద భారతీ మహాస్వామి)గారి కటాక్షంవల్ల అబ్బిన సంస్కారాన్ని తిరుపతి కవులవల్ల కలిగిన ఆవేశాన్ని తన మనోధర్మాన్ని కలిపి గుచ్చెత్తి కవిత్వం వ్రాస్తాడు. మా తాతను చదివితే పూర్వాంధ్ర మహాకవుల కవిత్వాన్ని చదివినట్లే. ఆయన్ను చూస్తే పూర్వాంధ్ర మహాకవుల్ని చూచినట్లే. తాత వ్రాసింది తెలుగు కవిత్వం. తెనుగు బురఖాలో మరో కవి కంఠంకానే కాదు. మరో సంప్రదాయం మరో భాషా ప్రభుత్వం తాతకు వంటబట్టలేదు.
మా తాత మంచి పొడగరి. చామనఛాయకు కొంచెం తక్కువేనేమో స్వతహా మంచి భోగి. భోజనప్రియుడు. వృకోదరుని వంటి జిజ్ఞాసువు. అందువల్లనే ఏమో ఆయన పద్యాలు ఒక్కకచో గదాయతాలు. పద్యం ఎంత బాగా అనగలడో- మాటకూడా అంతే బాగా అనగలడు. ‘‘బాగా’’ అంటే ఎంత బాగానో కట్టెవిరిచి పొయ్యిలోపెట్టి దానితో చురకలువేసేటంత బాగా. చిత్రమేమిటంటే- ఇలా మాట్లాడుతున్నాడేమిటి?- అని అనుకోకుండా ఆయన అంతరంగం దగ్గరకు పోగలిగినవానికి అక్కడ ‘‘అమృతము కూడు కట్టిన దొర.’’
ఎదుటివాళ్ళు నొచ్చుకుంటారని తెలుసు; కానీ నిజం నిష్టూరమైనా అనేస్తారు. నొచ్చే మాటలన్నా మనసు కలకలా విచ్చే మాటలన్నా మంచి ఏదో అదే చేస్తాడు చివరికి. శుష్కప్రియాలు, శూన్యహస్తాలు ఆయనకసలు తెలియవు. ‘‘మునిమాణిక్యం నరసింహారావుగారి ‘‘మేరీ కహాని’’లో నరసింహారావుగారి బందరు ఉద్యోగ ప్రయత్నం సంగతి చదివినవారికి వేరే చెప్పనక్కరలేదు; అదొక ఉదాహరణ. ‘‘అలఘస్వాదు రసావతార ధిషణాహంకార సంభార దోహల బ్రాహ్మీమయమూర్తి’’ తానైనా- ఎదటి ప్రతిభకు ఎరిగి నీరాజనంపట్టే నవనీతమూర్తి; మా తాత. నండూరి సుబ్బారావుగారి ఎంకిపాట విని ఎగిరి గంతేయటం (నిజంగానే ఎగిరి గంతు), శ్రీశ్రీ మహాప్రస్థానాన్ని చదివినప్పుడు గాఢంగా కౌగలించుకోవటం మెరమెచ్చులు కావు. గుండెలోతుల్లోని గుబాళింపే. ఈ పద్యం మా తాత చెప్పిందే; చదివి ఆయన మనసునెరగండి.
1. ఒక క్రైస్తవ కవి ఉదిత మాధుర్య
రసోత్కటంబగు శబ్దమూది పలుకు
2. ఒక బ్రహ్మమతకవి ఉల్లోలమగుకూర్పు
టదుకులో కూటస్థుడైనవాడు
3. అల గౌతమీ కోకిలాఖ్యకవి
పంచవ స్వరంబున మాట మాట నూదు
4. పరగనిద్దర దృష్టవంతులే కవులు
చిక్కగ సన్నగా పాడగలరు గోతి
5. నినె్నవరు మెచ్చకొందురీనేల యందు
పలుకు పెళుసైనయట్టి నిర్భాగ్యకవిని
కవిత లౌకిక సాంసారిక ప్రగాఢ
దుఃఖదూషిత వాంఛావిధూత మతిని’’
ఇందులో కనిపించే 1) గుఱ్ఱంజాషువా, 2) దేవులపల్లి వెంకటకృష్ణశాస్ర్తీ, 3) వేదుల సత్యనారాయణశాస్ర్తీ, 4) పింగళి- కాటూరి, 5) మా తాత. ఎక్కడైనా మెరమెచ్చులు కానీ- ఆత్మస్తుతి గానీ పరనింద గానీ కనిపించిందా? అనిపించిందా? మా తాత తత్త్వమే అంత. లోస్వయంపాకశ్రీ ఆయనకు అబ్బలేదు. సరదాకోసం బురద చిమ్మటం కూడా చేతకాదు.
ఒక కవి- మా తాత పుట్టింది ‘‘మన్మథ’’ నామ సంవత్సరమైతే వేదిక మీద ‘‘వికారి’’గా ఉపన్యసించటం ఒక జాంతవ లక్షణం కదూ...!
ఈ వికార ధోరణి మా తాతకు లేదని చెప్పటమే నా విధిత్సితము. మహాసంకల్పం చేసి మరీ వ్రాస్తాడు. కొన్ని రోజులపాటు ఏకదీక్షతో గాయత్రీ మంత్రాన్ని (ఎన్ని లక్షలో నాకు తెలియవు) జపంచేసిన తరువాతే కల్పవృక్షాన్ని నాటాడని పెద్దలు చెప్పారు. ఒకసారి ఆయనే నాకు చెప్పాడు. తనకు తోచినది మహోన్నతమైనదని భావిస్తేనే శ్రీకారం చుడతాడు. తనను అనుకరించేవారినో- అభిశంసించే వారినో ఆయన ఎప్పుడూ పట్టించుకున్న దాఖలాలేదు. మా తాత పద్యం బాగా చదువుతాడు. (నాకు కొంత తెలుసు) గణనీయమ సిద్ధమైన తాళము అవసరం లేనిచోట ఆయన చేతిలో చచ్చి వూరుకుంటుంది. అతీతమైన ఏదో లయ ఆ చదివే ధోరణిలోంచి పుట్టుకొస్తుంది. ఎప్పుడన్నా ఈనాటికి ఆనాడాయన చదివిన ఘట్టం, అందులోని పద్యం ఇప్పటికీ నా గుండెను పట్టేవుంది. సంస్కృతాంధ్రాలలోని సారస్వతాన్ని మా తాత చదివినట్లు ఎవరూ చదవలేదని మాత్రం చెప్పగలను. ఆయన జీవితం సాహిత్యపు లోతుల్లో మునిగిపోయి వుండేది. చెప్పగా విన్నది తరువాత గ్రంథస్థం అయింది. నేను చూడటం జరిగింది. 1926లోనో 1927లోనో మా తాత ‘‘నక్షత్రాలు రెండు’’ అనే ఖండ కావ్యం వ్రాశాడు. కవి మరణించగా ఒక నక్షత్రం ఆకాశానికెక్కటం- రాజు మరణించగా ఒక నక్షత్రం నేలకు రాలి పడటం ఆ కావ్యేతి వృత్తం. అయితే ఆ తర్వాత 1967లో ఇదే ఇతివృత్తంతో గుఱ్ఱం జాషువాగారు బింబప్రతిబింబ భావాన్ని సూచించే కొన్ని పద్యాలు వ్రాశారు. అవి కొత్త లోకములోని ‘‘వ్యత్యయము’’ అనే ఖండికలోని మొదటి ఆరు పద్యాలు. ‘‘ఇప్పటికీ ఇది జాషువాగారి ‘‘స్వభావం’’ గానే ప్రచారంలో వుంది. ఇంకొకరి పుస్తకం తెఱచి చేతబట్టుకొని ఆ మాటలు ఆ ఆత్మ మరొకరి స్వరంలో పొదిగే అలవాటు మా తాతకు లేదుగాక లేదు. శ్రీశ్రీ అన్నట్టు మా తాత ‘‘ఏకవీర’’డే.
1933లో మా తాతకు భార్యావియోగం తటస్థించింది. ఆవిడగారి పేరు వరలక్ష్మి. ‘‘కర్మశతకం’’- ‘‘స్మృతి శతకం’’- ‘‘నిత్య శతకం’’ అని ఆవిడగారి గురించి మూడు శతకముల వియోగకావ్యం వ్రాశాడు. భావ నైశిత్యంలోగాని- కరుణ రసోత్కర్షలోగాని దీనికిసాటి రాగల మరో కావ్యం ఇంతవరకులేదు. ఒక్కొక్క శతకము పదేసి దశకములుగా విభజింపబడింది. కర్మశతకమున కర్మకాండకు సంబంధించిన విషయాలు- స్మృతిశతకాన తన భార్య గుణగణాలు. నిత్య శతకాన నిత్యానిత్య వివేచనంతో కూడిన ఉపనిష ద్రహస్యములు వివరింపబడ్డాయి. కర్మ శతకమునందలి ‘కృష్ణార్పణమ’ను దశకము చివరలో మా తాత ఇలా అంటాడు.
‘‘పితృదత్తమగు నాస్తి హతమయ్యోనాయందు
ఆయనిచ్చిన భార్య అట్లెపోయె
నా తండ్రి చేసిన నానా మహాపుణ్య
కర్మలీగతి గంగ కలసిపోయె
మిగెలిన యొక్కడే నాకు మేరువంత
బరువు నా గుండెలో మధ్య భాగమందు
నంతె పేరునకంతె భార్యాస్థిగాని
నా శరీరాస్థి నిజము కృష్ణార్పణమ్ము’’
- ఇలా అన్నప్పుడు కరుణ రసము పరాకాష్ఠనందుకొన్నదిగదా. ప్రియాంగనా తనూ గతాస్థిని కృష్ణార్పణ మొనరించుచూ మా తాత -
‘‘ఏ తన్నదీకుల్యవెగచి పండించెడు
రాజనమ్మలకు శ్రీరామరక్ష’’ - అని ఆశించాడు. నిర్మలమైన అనురాగానికి, భార్యమీద గౌరవానికి, తద్వియోగ జనితమైన కరుణకు నెరవై. ఆత్మీయాంశతోగూడిన ఇట్టి విషాద స్మృతికావ్యము నాన్యతో దర్శనీయం. అన్నట్లే పొత్తం పేరు ‘‘వరలక్ష్మీ త్రిశతి.’’
ఇంతకూ -
ఇంత వ్రాసి మా తాత పేరు వ్రాయనే లేదు. చూశారా...! ప్రాచీన తెలుగు కవులను తనలోనికి ఆవాహన చేసుకుని కళాన్యాసం చేసినవాడు మా తాత. తిక్కనవలె మహాకవిత్వ దీక్షగలవాడు మా తాత. ఎఱ్ఱనవలె సర్వమార్గేచ్ఛా విధాతృడు మా తాత. నన్నయవలె ఆంధ్ర కవిత్వ విశారదుడు మా తాత. శ్రీనాథునివలె గడుసరి- ప్రౌఢుడు మా తాత. నాచన సోమనవలె సర్వజ్ఞుడు మా తాత. పాల్కురికి సోమనవలె మహా ఆవేశపరుడు మా తాత. అంతరంగంలో శ్రీకృష్ణదేవరాయలు మా తాత.
‘‘ఈ సంసారమిదినెన్ని జన్మలకు నేనీ వౌని వాల్మీకి భా
షా సంక్రాంత ఋణంబు దీర్పగలదా? సత్కావ్య నిర్మాణ రే
ఖా సామాగ్రి ఋణంబు దీర్పగలదా? కాకుత్సుడౌస్వామి గా
థా సంపన్నము భక్తిదీర్చినను ద్వైతాద్వైత మార్గంబులన్’’
- అని చెప్పుకున్న మా తాత పేరు విశ్వనాథ సత్యనారాయణ.

- సాంధ్యశ్రీ, 8106897404