రాష్ట్రీయం

2021 నాటికి పోలవరం పూర్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పోలవరం, ఫిబ్రవరి 2: పోలవరం ప్రాజెక్టు నిర్మాణం 2021 నాటికి పూర్తిచేస్తామని జలవనరుల శాఖ మంత్రి పి అనిల్‌కుమార్ యాదవ్ తెలిపారు. ఆదివారం ఉదయం పశ్చిమగోదావరి జిల్లాలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతానికి వచ్చిన ఆయన పనులను పరిశీలించి, ప్రగతిపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ స్థానిక విలేఖర్లతో మాట్లాడుతూ తాము చెప్పిన సమయానికి భగవంతుని సంకల్పంతో ప్రాజెక్టు నిర్మాణం పూర్తిచేసి సీఎం జగన్మోహన్‌రెడ్డిచే ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తామన్నారు. ప్రతిపక్ష టీడీపీ పోలవరం పనులు జరగటం లేదంటూ రకరకాలుగా దుష్ప్రచారాలు చేస్తోందన్నారు. ప్రాజెక్టు పనులను సీఎం జగన్ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ నిర్మాణం వేగవంతమయ్యేలా కృషి చేస్తున్నారన్నారు. గత ప్రభుత్వం నిర్వాసితులను గూర్చి పట్టించుకోలేదని, వారికి ఒక్క ఇల్లు కూడా నిర్మించలేదని ఆరోపించారు. వైఎస్సార్ నిర్మించిన 3వేల గృహాలు మినహా ఒక్క ఇంటిని కూడా టీడీపీ ప్రభుత్వం నిర్మించలేదన్నారు. వచ్చే మార్చి నాటికి 18వేల ఇళ్ల నిర్మాణం పూర్తిచేస్తామని తెలిపారు. ఆర్ అండ్ ఆర్ సమస్యలు పరిష్కరించేందుకు ఒక ఐఏఎస్ అధికారిని ప్రభుత్వం నియమించిందని, ఇప్పటి వరకూ ఆర్ అండ్ ఆర్ సమస్యలపై పదివేల అర్జీలు అందాయని, వాటిని నిశితంగా పరిశీలించి పరిష్కరిస్తామని మంత్రి పేర్కొన్నారు. నిర్వాసితులకు పూర్తి న్యాయం చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఈ మధ్యకాలంలో వచ్చిన కేంద్ర కమిటీ ప్రాజెక్టు నిర్మాణ పనులపై సంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలిపారు. గత ప్రభుత్వం 70 శాతం పనులు పూర్తిచేశామని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారని, రూ.55వేల కోట్లతో నిర్మించే ప్రాజెక్టు రూ.17వేలు కోట్లు పూర్తిచేసి 70 శాతం పూర్తిచేశామని చెప్పటం ఎంత వరకూ సాధ్యమని, కేవలం 30 శాతం పనులు మాత్రమే టీడీపీ హయాంలో జరిగాయని చెప్పారు. గత ప్రభుత్వ పెద్దల సమయమంతా అబద్ధాలతోనే గడిపేశారని, పని తక్కువ ప్రచారం ఎక్కువ అని ఉద్దేవా చేశారు. తమ ప్రభుత్వం పని ఎక్కువ, ప్రచారం తక్కువన్నారు. ఎడమ కాలువతోపాటు దాని అనుబంధ పనులు వేగంగా జరుగుతున్నాయని మంత్రి తెలిపారు. కేంద్ర నుంచి నిధులు రాకపోయినా రాష్ట్ర నిధులు వెచ్చిస్తామని, అనంతరం రీయింబర్స్‌మెంట్ ద్వారా కేంద్రానికి నివేదికలు ఇస్తామన్నారు. ఒక ప్రణాళికా బద్ధంగా ముందుకు వెళుతున్నామని, రానున్న అయిదు సంవత్సరాల్లో రాష్ట్రంలో ఉన్న అన్ని ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తిచేస్తామని మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ స్పష్టం చేశారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతానికి చేరుకున్న మంత్రికి పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు,
ఆర్‌అండ్‌ఆర్ కమిషనర్ టి బాబూరావునాయుడు, జేసీ కె వెంకటరమణారెడ్డి, ప్రాజెక్టు ఈఎన్‌సీ సి నారాయణరెడ్డి, సీఈ బి సుధాకరబాబు, ఎస్‌ఈ నాగిరెడ్డి స్వాగతం పలికారు. అనంతరం స్పిల్‌వే వద్దకు చేరుకున్న మంత్రి అనిల్‌కుమార్ జూలా క్రేన్ ద్వారా 50వ బ్లాక్‌పైకి వెళ్లి కాంక్రీటు పనులను పరిశీలించారు. ఎగువ కాపర్ డ్యాంను పరిశీలించిన మంత్రి అంగుళూరు వద్ద ఎర్త్‌కం రాక్ ఫీల్డ్ డాం గ్యాప్-1, స్పిల్‌వే సమీపంలో గ్యాప్-3కి సంబంధించిన కాంక్రీటు పనుల భూమి పూజను నిర్వహించారు. మంత్రి వెంట జంగారెడ్డిగూడెం ఆర్డీవో వై ప్రసన్నలక్ష్మి, ఐటీడీఏ పీవో ఆర్‌వి సూర్యనారాయణ, డీఎస్పీ ఎం వెంకటేశ్వరరావు, ఇంజినీరింగ్ అధికారులు ఉన్నారు.

*చిత్రం... క్రేన్ ద్వారా స్పిల్‌వేలోని బ్లాక్‌పైకి వెళ్తున్న మంత్రి అనిల్‌కుమార్