రాష్ట్రీయం

సీఏఏపై అసత్య ప్రచారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 9: పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)పై ప్రజల్లో అభూతకల్పనలు సృష్టించి ప్రతిపక్ష పార్టీలు దుష్ప్రచారం చేస్తున్నాయని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జీ కిషన్ రెడ్డి ధ్వజమెత్తారు. ఈ చట్టం వల్ల దేశంలోని ఏ ఒక్క భారతీయుడికి ఇబ్బంది కలిగినా పునరాలోచించేందుకు ప్రధాని మోదీ సిద్ధంగా ఉన్నారని ఆయన స్పష్టం చేశారు. దేశంలో కొన్ని వర్గాల ప్రయోజనాల కోసం ఈ చట్టంపై పునరాలోచించే ప్రసక్తి లేదని ఆయన పేర్కొన్నారు. పౌరసత్వ సవరణ చట్టాన్ని రూపొందించాలని గతంలో మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్ పార్లమెంటులో డిమాండ్ చేసిన విషయాన్ని ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి గుర్తు చేశారు. ఆదివారం ఇక్కడి బీజేపీ కార్యాలయంలో సంత్ రవిదాస్ 621వ జయంతి వేడుకలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ పాకిస్తాన్, అఫ్గానిస్తాన్, బంగ్లాదేశ్‌లో మతపరంగా మైనారిటీలను ఆదుకునేందుకు
పౌరసత్వ సవరణ చట్టం తెచ్చామని, దీని వల్ల భారతీయ పౌరుల హక్కుల ఎలాంటి భంగం వాటిల్లదని ఆయన స్పష్టం చేశారు. అయితే, ఈ మూడు దేశాల నుంచి వచ్చే చొరబాటుదార్లకు మాత్రం పౌరసత్వం ఇచ్చే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. పౌరసత్వ సవరణ బిల్లు 2015లో లోక్‌సభలో, గత ఏడాది రాజ్యసభ ఆమోదం పొందిందన్నారు. మోదీ ప్రభుత్వంలో తప్పులను పట్టుకోలేక, నిరాశానిస్పృహలకు లోనైన రాజకీయ పార్టీలు ఓట్ల కోసం ముస్లింలను రెచ్చగొట్టేందుకు సీఏఏను వాడుకుంటున్నాయన్నారు. తమ మేనిఫెస్టోలో పౌరసత్వ సవరణ బిల్లు ఉందని, 303 సీట్లతో ప్రజలు బీజేపీకి మ్యాండేట్ ఇచ్చారని ఆయన చెప్పారు. దేశంలో గొడవలు సృష్టించేందుకు రాజకీయాల కోసం ఈ చట్టాన్ని ప్రతిపక్ష పార్టీలు వాడుకుంటున్నాయన్నారు. బీజేపీకి భగవద్గీత కంటే రాజ్యాంగమే మిన్న అని, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగాన్ని జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో అమలు చేస్తామన్నారు. 370వ అధికరణ వల్ల అంబేద్కర్ రాజ్యాంగం అమలు కాలేదన్నారు. ఈ రాష్ట్రంలో బలహీనవర్గాలకు రిజర్వేషన్లు అమలు కాలేదన్నారు. ఇకపై ఈ విధానానికి స్వస్తి చెబుతున్నామన్నారు. 370వ అధికరణ రద్దు ద్వారా ఒక దేశం, ఒక రాజ్యాంగం అనే పవిత్ర లక్ష్యాన్ని సాకారం చేసేందుకు వీలవుతుందన్నారు. దేశ విభజన సమయంలో అధికారం కోసం జిన్నా, నెహ్రూ కుమ్మక్కై కాశ్మీర్‌లో బలహీనవర్గాల ప్రజలకు రిజర్వేషన్ ఫలాలు అందకుండా కుట్ర చేశారన్నారు. సీఏఏ వల్ల దేశంలో 130 కోట్ల మంది ప్రజలకు చక్కటి భద్రత ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. మోదీ ప్రభుత్వాన్ని ఏ రకంగా ఢీకొనలేక చివరకు భ్రష్టుపట్టిన విపక్షాలు మతపరమైన విభజన కోసం ముస్లింలను తప్పుదోవపట్టించి స్వార్థ ప్రయోజనాలకోసం వినియోగించుకుంటున్నాయని ఆయన మండిపడ్డారు. గత ఆరేళ్లలో దేశంలో మోదీ పాలనలో ఎటువంటి బాంబుపేలుళ్లు లేవని, కర్ఫ్యూలు లేవని, మతసంఘర్షణలు లేవని, దీనీని చూసి ఓర్వలేక విపక్షాలు కేంద్రంపైన, బీజేపీపైన బురదజల్లేందుకు ప్రయత్నిస్తున్నాయన్నారు. ప్రజలు గత ఎన్నికల్లో బీజేపీకి భారీ మ్యాండేట్ ఇచ్చారని, ఎన్నికల ప్రణాళికలో పేర్కొన్న అంశాలనే తాము అమలు చేస్తున్నామని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి చెప్పారు. చొరబాటుదార్లకు పౌరసత్వం ఇచ్చే ప్రసక్తే లేదని ఆయన మరోసారి స్పష్టం చేశారు. కేవలం చట్టంలో పేర్కొన్న మూడు దేశాలు (పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్)కు చెందిన మైనారిటీలకు మాత్రమే పౌరసత్వం కల్పిస్తామన్నారు. వీరు దేశంలోని అనేక నగరాల్లోని కాలనీల్లో అధ్వాన్న పరిస్థితుల్లో జీవిస్తున్నారన్నారు. వీరిని ఆదుకునేందుకు కేంద్రం చర్యలు తీసుకుంటే రాజకీయాలు చేయడం తగదని ఆయన హితవు పలికారు. సంత్ రవిదాస్ సమాజంలో దురాచారాలపై రాజీలేని పోరాటం చేసిన మహానీయుడని, రవిదాస్ గొప్ప సంస్కర్త, ఆధ్యాత్మిక పురుషుడని ఆయన ప్రస్తుతించారు. రవిదాస్ ఆశయాలు, ప్రవచనాలు దేశంలో ప్రజలకు ఆదర్శనీయమన్నారు. మజ్లిస్ కనుసన్నల్లో టీఆర్‌ఎస్ పార్టీ, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నడుచుకుంటున్నారని, అధికార పార్టీ మజ్లిస్ పార్టీ చేతిలో కీలుబొమ్మగా మారిందని మండిపడ్డారు. కేవలం అధికారం కోసం ఎంఐఎం లాంటి మతోన్మాద పార్టీతో అంటకాగుతూ ఓటు బ్యాంకు రాజకీయాలకు పార్టీలు పాల్పడుతున్నాయని ఆయన మండిపడ్డారు.

*చిత్రం... హైదరాబాద్‌లోని బీజేపీ కార్యాలయంలో ఆదివారం జరిగిన సంత్ రవిదాస్ 621 శత జయంతి ఉత్సవాల్లో మాట్లాడుతున్న కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి