రాష్ట్రీయం

దండకారణ్యంలో మారణకాండ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భద్రాచలం టౌన్, మార్చి 22: దండకారణ్యం కాల్పుల మోతతో దద్దరిల్లింది. పచ్చటి అడవిలో మరోమారు నెత్తురు చిందింది. చత్తీస్‌గఢ్ రాష్ట్రం బస్తర్ రేంజ్ సుకుమా జిల్లాలో మావోయిస్టులు మారణహోమం సృష్టించారు. మాటువేసి మెరుపుదాడితో భద్రతా బలగాలను మట్టుబెట్టారు. కూంబింగ్‌కు వచ్చిన బలగాలనే లక్ష్యంగా చేసుకున్న మావోలు మూకుమ్మడిగా కాల్పులకు దిగి 17మంది జవాన్లను దారుణంగా హతమార్చారు. మావోల కాల్పుల ధాటికి జవాన్లు చెల్లాచెదురవ్వగా వారిలో 17మందిని తొలుత మావోయిస్టులు అపహరించారు. బలగాల గాలింపు చర్యల్లో ఆదివారం 17మంది జవాన్ల మృతదేహాలు లభ్యమయ్యాయి. సుకుమా జిల్లాలో కొన్నాళ్లుగా డీఆర్‌జీ, ఎస్టీఎఫ్, సీఆర్‌పీఎఫ్‌కు చెందిన కోబ్రా దళాలు కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. చింతగుఫా, బూర్కాపాల్ మధ్య ఎల్మాగూడ అటవీ ప్రాంతంలో శనివారం భారీ సంఖ్యలో మావోయిస్టులు గుమిగూడారని వారికి సమాచారం అందింది. దీంతో సాయంత్రం 4.30 గంటలకు బలగాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టేందుకు బయలుదేరాయి. దాదాపు 350 మంది జవాన్లు ఇందులో పాల్గొన్నారు. దట్టమైన అడవిలో మావోల కోసం అనే్వషించి ఫలితం లేకపోవడంతో బలగాలు క్యాంప్‌కు బయలుదేరాయి. అయితే కొర్రాజుగూడ వద్ద మింపా గ్రామానికి సమీపంలోకి బలగాలు చేరుకునేసరికి సాయుధులైన మావోయిస్టులు విచక్షణా రహితంగా కాల్పులకు దిగారు. సుమారు రెండున్నర గంటల పాటు ఇక్కడ భీకర కాల్పులు జరిగాయి. మావోలు అంబూష్ వేసి జరిపిన ఈ కాల్పుల్లో 14మంది జవాన్లకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని హుటాహుటిన రాయపూర్‌లోని ప్రభుత్వ ఆసుపత్రికి
తరలించారు. పలువురిని మావోలు అపహరించారు. ఈ కాల్పుల్లో 14మంది జవాన్లు గాయపడగా, 13మంది కనిపించకుండా పోయారని చత్తీస్‌గఢ్ రాష్ట్ర పోలీసు శాఖ తొలుత ఒక ప్రకటన విడుదల చేసింది. అయితే అదృశ్యమైన వారికోసం ఆదివారం భద్రతా బలగాలు ఆప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టాయి. 17మంది భద్రతా సిబ్బంది మృతదేహాలను గుర్తించారు. యాంటీ నక్సల్స్ ఆపరేషన్‌లో భాగంగా బలగాలు కూంబింగ్ అనంతరం తిరుగుముఖం పట్టాయని, దారికాచిన మావోలు వ్యూహాత్మకంగా బలగాలను తేరుకోనివ్వకుండా కాల్పులకు దిగారని, దీంతో పలువురు గాయపడ్డారని బస్తర్ రేంజ్ ఐజీ పి సుందర్‌రాజ్ తెలిపారు. కాల్పుల అనంతరం తొలుత 13మంది కనిపించకుండా పోయినట్లు సమాచారం అందిందని, ఆదివారం నాటి గాలింపు చర్యల్లో 17మంది జవాన్ల మృతదేహాలు లభ్యమయ్యాయని వెల్లడించారు. కాల్పులు జరిగిన ప్రాంతం నుంచి భద్రతా బలగాల నుంచి ఒక ఏకే 47 సహా 16 ఆటోమేటిక్ రైఫిళ్లను మావోయిస్టులు ఎత్తుకెళ్లినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో సుమారు 250 మంది వరకు మావోయిస్టులు పాల్గొన్నట్లు సమాచారం. కాగా ఎన్‌కౌంటర్‌లో గాయపడిన భద్రతా బలగాలను చత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బగేల్ పరామర్శించారు. మావోయిస్టు పార్టీ కేంద్ర కార్యదర్శి నంబాల కేశవరావు అలియాస్ బస్వరాజ్ ఆధ్వర్యంలోనే ఈ దాడి జరిగినట్లు భావిస్తున్నారు. మావోల దాడిలో డీఆర్‌జీ, ఎస్టీఎఫ్ బలగాలకు చెందిన గీత్‌రామ్ రాఠియా, నారద్ నిషాద్, హేమంత్‌పోయా, అమర్‌జీత్ ఖోల్కో, మడకం బుచ్చా, హేమంత్‌దాస్ మానిక్‌పురీ, గంధం రమేష్, లిబ్రూరామ్ బగేల్, సోయం రమేష్, ఉయికా కమలేష్, పొడియం ముత్తా, ఉయికా ధృవ, పంజామ్ నగేష్, మడకం మాసా, పొడియం మాసా, పొడియం లక్కా, మడకం హిడ్మా, నేతేంద్ర బంజామీ మృతి చెందారు. కాల్పుల్లో గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.
అంబూష్ చేసి.. దారిమళ్లించిన మావోలు
వరుస ఎన్‌కౌంటర్లలో తీవ్రంగా దెబ్బతింటున్న మావోయిస్టు పార్టీ అదును కోసం ఎదురుచూసి, ప్రతీకారేచ్ఛతో రగిలిపోతూ వ్యూహాత్మకంగా దాడి చేసినట్లు తెలుస్తోంది. బలగాలను తమ ఉచ్చులోకి దింపి కాల్పులకు తెగబడినట్లు చత్తీస్‌గఢ్ రాష్ట్ర పోలీసు వర్గాలు చెబుతున్నాయి. చింతగుఫా పోలీసు స్టేషన్ పరిధిలోని ఎల్మాగూడ అటవీ ప్రాంతంలో మావోయిస్టు కీలక నేత హిడ్మా ఆధ్వర్యంలో నగేష్, వినోద్, దేవా, తదితర నేతలతో పాటు 300మంది మావోయిస్టులు సమావేశమయ్యారని చత్తీస్‌గఢ్ ఇంటిలిజెన్స్ వర్గాలకు సమాచారం అందింది. దాంతో డోర్నపాల్ పోలీసు స్టేషన్ నుంచి 200 మందిని, బూర్కాపాల్ క్యాంపు నుంచి 150 మందిని ఈ ప్రాంతానికి నేరుగా కూంబింగ్ ఆపరేషన్ కోసం పంపారు. శనివారం మధ్యాహ్నం గాలింపు పూర్తి చేసుకొని బలగాలు తిరుగుముఖం పట్టాయి. అయితే మావోలు అంబూష్ చేయడంతో బలగాలు చిక్కుకుపోయాయి. బలగాలు తమను సమీపిస్తున్నాయన్న సమాచారం తెలుసుకున్న మావోలు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు, హెల్మెట్లు ధరించి సిద్ధమయ్యారని సమాచారం. భారీ అటవీ ప్రాంతానికి బలగాలు చేరుకోగానే అక్కడే దారికాచి ఉన్న సాయుధులైన మావోలు అన్నివైపుల నుంచి కాల్పులకు దిగారు. అప్పటికే కూంబింగ్ చేసి అలసిపోవడంతో ఈ దాడిని భద్రతా జవాన్లు అసలు ఊహించలేకపోయారు. ఆకస్మాత్తుగా కాల్పులు జరగడంతో వెంటనే అప్రమత్తమైనా ఫలితం లేకపోయింది. మావోలు తూటాల వర్షం కురిపించడంతో భద్రతా బలగాలు చెల్లాచెదురయ్యాయి. అనంతరం రెండున్నర గంటల తర్వాత కాల్పులు ఆగిపోగా ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బలగాలు క్యాంప్‌కు చేరుకున్నాయి. మావోలు అపహరించిన జవాన్ల కోసం ఆదివారం డ్రోన్ల సాయంతో అనే్వషించారు. ఈ క్రమంలో కాల్పులు జరిగిన ప్రాంతానికి 7కిలోమీటర్ల దూరంలో అదృశ్యమైన 17మంది మృతదేహాలు లభ్యమయ్యాయి. వెంటనే మృతదేహాలను బలగాలు అడవి నుంచి బయటకు తీసుకొచ్చాయి. ఈ ఘటనలో 12మంది డీఆర్‌జీ, ఐదుగురు ఎస్టీఎఫ్ సిబ్బంది చనిపోయినట్లు నక్సల్స్ ఆపరేషన్ డీజీపీ అవస్థీ ప్రకటించారు.

*చిత్రం... గాయపడిన జవాన్లను పరామర్శిస్తున్న చత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బగేల్