డైలీ సీరియల్

యమహాపురి 12

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇప్పుడు ఇక్కడున్న వ్యవస్థను ఛేదించగల వ్యవస్థ ఏదైనా దగ్గర్లో వుంటే- దాన్ని దెబ్బతియ్యాలని నా ఆశయం. ఆ పని చెయ్యకపోతే మధురాపురిలో నెలకొన్న శాంతి భద్రతలు తాత్కాలికమే ఔతాయి’’ అన్నాడు ఈశ్వర్.
‘‘ఈ దరిదాపుల్లో అలాంటి వ్యవస్థ ఉంటుందనుకోను’’ అన్నాడు శ్రీకర్ వెంటనే నమ్మకంగా.
‘‘ఉంది’’ దృఢంగా అన్నాడు ఈశ్వర్. ‘‘ఇక్కడికి ముప్ఫై కిలోమీటర్ల దూరంలో ఉంది నరకపురి. పేరుకి తగ్గ వ్యవస్థ అక్కడ రాజ్యమేలుతోంది. అక్కడి జనం అగచాట్లు స్వయంగా తెలుసుకోవాలి తప్ప ఊహకందవు’’
‘‘నరకపురి? పేరే చిత్రంగా ఉంది’’ అన్నాడు శ్రీకర్.
‘‘పేరు చిత్రం కాదు. భయంకరం. అక్కడి జన జీవితం పేరుకంటే భయంకరం’’ అన్నాడు ఈశ్వర్.
‘‘ఏదో వంకన ఒక్కసారి బెటాలియన్‌తో వెళ్లి రెయిడింగ్ చేస్తే సరి...’’ అన్నాడు శ్రీకర్ యథాలాపంగా.
‘‘ఆ పనే చెయ్యబోయాను. వ్యాఘ్రపురికి బదిలీ ఆర్డర్స్ వచ్చాయి’’ అన్నాడు ఈశ్వర్.
శ్రీకర్ తెల్లబోయి ‘‘ఒక మంచి పని చెయ్యబోయినందుకు ఇదన్నమాట శిక్ష!’’ అన్నాడు.
‘‘శిక్షని నువ్వనుకుంటున్నావు. కానీ పై అధికారులు నాకు మేలు చేశానంటున్నారు. కొంతవరకూ అది నిజం కూడా. నరకపురిపై రెయిడింగ్ కంటే వ్యాఘ్రపురికి వెళ్లడం గుడ్డిలో మెల్ల- తెలుసా? మధురాపురిలో మోడల్ స్కీం పెట్టి విజయం సాధించానుగా- మరిన్ని మధురాపురిలు తయారుచెయ్యడానికిగానూ నన్ను డిపార్ట్‌మెంట్ అలా రక్షించినందన్నమాట!’’ అన్నాడు ఈశ్వర్.
‘‘అలాంటప్పుడు మిమ్మల్ని వ్యాఘ్రపురికి బదులు మరో సేఫ్ ప్లేస్‌కి బదిలీ చెయ్యాల్సింది..’’
‘‘చేసేవారే- కానీ నరకపురిపై రెయిడ్ చెయ్యాలన్న ఆలోచన నాకొచ్చింది చూడు. అందుకుగానూ- వ్యాఘ్రపురి నాకు తప్పనిసరయింది. అదీ నరకపురి పవర్’’ అన్నాడు ఈశ్వర్.
‘‘నరకపురి గురించి మరిన్ని వివరాలు చెప్పండి సార్!’’ అన్నాడు శ్రీకర్ కుతూహలంగా.
‘‘నరకపురి అంటే టైం ఫిక్స్ చేసి ఆన్ చేసిన బాంబ్. దాని దరిదాపులకి వెడితే అంతే సంగతులు. ఇంతకంటే వివరాలడగడం నీకు మంచిది కాదు. చెప్పడం నాకు మంచిది కాదు’’
‘‘కానీ మీకు తెలిసినవి నాకు చెబితే..?’’
‘‘చెప్పను. ఈ విషయమై నేను నీకు చెప్పగలిందొక్కడే! నరకపురి గురించి దానంతటదే సమాచారం వస్తే సేకరించి ఉంచుకో. నేరుగా నరకపురి జోలికి వెళ్లకు. ఒకవేళ అక్కడి వ్యవస్థ విషయమై ఏదో చెయ్యాలని ఉన్నా- చాపకింద నీరులా వ్యవహరించు. నీ గురించి ఆ గ్రామానికి ఎంత తక్కువ తెలిస్తే అంత మంచిదని మర్చిపోకు. అనుభవంమీద చెబుతున్నాను’’ అన్నాడు ఈశ్వర్? గంభీరంగా.
ఈశ్వర్‌కి నరకపురి విషయమై పూర్తి అవగాహన వున్నదనీ, అతడిప్పుడు ఆ ఊరి విషయంలో పూర్తి అసహాయుడిగా మిగిలిపోయాడనీ శ్రీకర్‌కి అర్థమైంది. ‘‘ఇక్కడుండి నరకపురి పూర్తి వివరాలు సేకరించాలి. అదీ, చాపకింద నీరులా! ఆ తర్వాత అక్కడి వ్యవస్థ విషయమై ఏదో చెయ్యాలి’’ అనుకున్నాడు శ్రీకర్.
‘‘నువ్వేమాలోచిస్తున్నావో నేనర్థం చేసుకోగలను. ప్రస్తుతానికి ఆ ఆలోచనలు పక్కన పెట్టు. నేనిప్పుడు నీకు నా ఇన్‌ఫార్మర్స్ జాబితా ఇస్తాను. వారిలో ముఖ్యంగా ఇద్దరి గురించి చెప్పాల్సి ఉంది. ఒకరు డిపార్ట్‌మెంటల్. ఒకరు సెంటిమెంటల్’’ అన్నాడు ఈశ్వర్.
ఈశ్వర్ మాట మార్చుతున్నడని అనుకున్నాడు శ్రీకర్. తనూ అతడి ట్రాక్‌లోకే వస్తూ ‘‘డిపార్ట్‌మెంట్‌లో ఉండేది మనవాళ్లేగా- వాళ్లు ఇన్‌ఫార్మర్సేమిటీ?’’ అన్నాడు.
‘‘అదే మరి- ట్రాప్ అంటే! మన డిపార్ట్‌మెంట్లో సుందరం అని ఓ కానిస్టేబులున్నాడు. నిజాయితీకి మారు పేరు. అతగాణ్ణి నాకు అప్పగించారు. నేనతడికి రోమింగ్ డ్యూటీ ఇచ్చాను. బయటివాళ్ల దృష్టికి- లంచాలకీ, ప్రలోభాలకీ పడిపోయే చౌకబారు వ్యక్తిలా- కనిపిస్తాడు. నేర ప్రవృత్తి ఉన్నవాళ్లు అతగాణ్ణి సులభంగా నమ్ముతారు. అట్టే ప్రమాదం కాని కొన్ని రహస్యాలు అతడి ద్వారా లీక్ చేయిస్తూ- ఆ నమ్మకం పెంపొందేలా చేశాను. అతడి ద్వారా మనకి లభించే సమాచారం విలువ ఎలాంటిదంటే రూపాయి పెట్టుబడికి పదివేలొచ్చినట్లు. అర్థమైందిగా- మన డిపార్ట్‌మెంట్లో ఇన్‌ఫార్మర్ అంటే’’.
శ్రీకర్ చటుక్కున లేచి నిలబడి ఈశ్వర్‌కి సెల్యూట్ చేశాడు. ‘‘వాట్ ఏ బ్రిలియంట్ ఐడియా!’’ అన్నాడు.
ఈశ్వర్ మానిటర్లోకి చూస్తూ కంప్యూటర్ కీబోర్డు మీద మీటలు నొక్కాడు. ‘‘ఇప్పుడే జాబితా నీ ఈమెయిల్‌కి అటాచ్‌మెంట్‌గా పంపాను. అది ఓపెన్ చెయ్యాలంటే- పాస్‌వర్డ్ కావాలి. నీ డేటాఫ్ బర్త్ దానికి పాస్‌వర్డ్. ఓకే’’ అన్నాడు. శ్రీకర్ తలూపాడు.
‘‘ఆ జాబితాలో లేనివి రెండు పేర్లు. ఒకటి సుందరానిది. రెండు...’’ అని ఆగి, ‘‘నువ్వు జేమ్స్‌బాండ్ సినిమాలు చూస్తావా?’’ అన్నాడు. శ్రీకర్ ఎందుకని అడగలేదు. తలూపాడు.
‘‘నేర పరిశోధనకు ఏ దారిలోనైనా వెళ్లొచ్చు. అది అడ్డదారి కావచ్చు, తప్పుదారి కావచ్చు. లక్ష్యం మంచిదైతే చాలు. సమర్థించుకోవచ్చు. ఇదీ జేమ్స్‌బాండ్ సందేశం. ప్రపంచ వ్యాప్తంగా జేమ్స్‌బాండ్‌కి ఉన్న అభిమానుల సంఖ్యని బట్టి- ఆ సందేశం సబబైనదేనని గ్రహించొచ్చు. జేమ్స్‌బాండ్ అబద్ధాలు చెబుతాడు. అనుమానితుల్ని చంపేస్తాడు. ఆడపిల్లల్ని వలలో వేసుకుని అనుభవిస్తాడు’’.
‘‘తెలుసు...’’

ఇంకా ఉంది

వసుంధర