డైలీ సీరియల్

కొత్త స్నేహితులు 39

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చివరకు అనుకున్న రోజు వచ్చేసరికి అతడి మానసిక ఆందోళన మరింత పెరిగింది. అందుకే.. ఆమెనక్కడ చూడడంతో అతడి ఆనందానికి హద్దు లేకుండా పోయింది.
అదే ఊపులో ఆమె ముందుకు వెళ్లి, ‘‘సాహిత్యా’’ అని పిలిచాడు. అతడి మనసులో ఉప్పొంగుతోన్న సంతోషం అతడి కంఠస్వరాన్ని అదుపు చేయలేకపోవడంతో అతడి పిలుపు కూడా అరుపులా వినిపించింది సాహిత్యకూ, ఆమె పక్కన కూర్చున్నవాళ్లకూ.
సాహిత్యకు ఓవైపు ఒక నడి వయసు ఆవిడా, మరోవైపు ఇంచుమించు సామ్రాట్ వయసే వున్న ఒక యువకుడూ కూర్చుని ఉన్నారు. సాహిత్యతోపాటు వారిద్దరూ కూడా సామ్రాట్ పిలిచిన తీరుకు ఓసారి అతడివైపు చూశారు.
సాహిత్య లేచి నిలబడి అంతవరకూ నేలమీద తన కాళ్లమధ్య ఉంచిన బ్యాగ్‌ను అందుకుని ‘‘పద..’’ అంది.
ఆమె చేతిలోంచి బ్యాగ్ అందుకుని ‘‘నువ్వొచ్చి ఎంతసేపైందీ?’’ అన్నాడు సామ్రాట్.
‘‘నిన్న రాత్రే వచ్చి నీ కోసం ఎదురుచూస్తూ కూర్చున్నాను ఇక్కడ! అయినా ఏదో ఉపద్రవం జరిగిపోయినట్టు ఆ అరుపేవిటీ!’’ అంది సాహిత్య అతణ్ణి చిరుకోపంగా చూస్తూ.
‘‘నీకు తెలియదు సాహిత్యా.. నేనీ రోజుకోసం ఎంతగా ఎదురుచూస్తున్నానో! ఎన్నో రోజులనాటి కల ఈ రోజు నెరవేరబోతోందన్న ఆనందంతో నన్ను నేను నిగ్రహించుకోలేకపోయాను. వెరీ వెరీ సారీ..’’ అన్నాడు సామ్రాట్.
‘‘మరేం ఫర్వాలేదులే. అయినా నువ్వంతగా పొంగిపోవడానికి ఏముందిందులో? ఈ ఊళ్లో అప్పుడప్పుడూ కల్సుకునే బదులు మనం మరో ఊళ్లో కలిసి కొన్ని రోజులుండబోతున్నాం అంతే కదా!’’ అంది సాహిత్య.
‘‘ఉహూ.. నీకు తెలియదు సాహిత్యా.. ఇది నా చిరకాలం వాంఛ! అందుకే నాకంత ఆరాటమూ, ఆనందమూ కూడా!’’
‘‘ఏవిటో నీ మాటలు ఒకసారి నాకర్థం కావు. ట్రైన్ రావడానికింకా చాలా సమయముందిగా! ఈలోగా మనిద్దరం కూర్చుందుకెక్కడైనా మంచి చోటుంటే చూడు’’ అంది సాహిత్య నడుస్తూనే.
ప్లాట్‌ఫాంమీద మరి కాస్సేపు నడిచిన తర్వాతగానీ జనసమ్మర్ధం అంతగా లేని ఖాళీ జాగా కనిపించలేదతడికి. రెండు బ్యాగ్‌లూ క్రిందికి దించి, ఆమె కూర్చున్నాక తనూ పక్కనే కూర్చుంటూ, ‘‘నాకెంతో సంతోషంగా ఉందో తెలుసా?’’ అన్నాడు సామ్రాట్ మళ్లీ.
‘‘ఏదైనా అతి పనికిరాదు సామ్రాట్’’ అంది సాహిత్య అతడి ఆనందానికి కళ్లెం వేస్తున్నట్టుగా.
‘‘ఉహూ.. ఇప్పుడు నువ్వేం చెప్పినా నేను వినను. నాకంటే ముందుగా నువ్వు వచ్చి నా కోసం ఎదురుచూడడం.. మనిద్దరం కలిసి ప్లాట్‌ఫాం మీద నడుచుకుంటూ ఇక్కడికి రావడం.. ప్రతీ క్షణం నాకెంతో మరపురాని మధురానుభూతిలా అనిపిస్తోంది’’ అన్నాడు సామ్రాట్.
ఓసారతడివైపు చూసి అంది సాహిత్య, ‘‘నువ్వు మామూలుగానే ఉన్నావా? లేక ఏదైనా మగతలో ఉన్నావా అని అనుమానం వస్తుంది నాకు. ఇద్దరం కలిసి ఒక చోటికి వెళ్లాలనుకున్నపుడు, ఇద్దరూ వేర్వేరు ప్రదేశాలనుంచి బయల్దేరినపుడు ఎవరో ఒకరు ముందుగా అనుకున్న స్థలానికి చేరతాం కదా!
నేను కాకపోతే నాకంటే ముందుగా నువ్వు చేరేవాడివి. అంతేగా! దీనికే ఇంత సంబరడిపోవడమెందుకో నాకర్థం కావడంలేదు’’ అంది సాహిత్య.
‘‘నీకు అర్థమయ్యేటట్టు చెప్పడం నాకు చేత కావడంలేదు సాహిత్యా.. మనం కల్సుకున్న ప్రతిసారీ తిరిగి ఎవరింటికి వాళ్లు వెళ్లేటప్పుడు నువ్వేమనుకునేదానివో గానీ నేను మాత్రం బరువెక్కిన గుండెతో మళ్లీ మనం కలుసుకుని ముచ్చటించుకునే సమయం ఎప్పుడొస్తుందోనని అనుకునేవాణ్ణి. అందుకే మనం ఇప్పుడు ఎటువంటి ఆటంకమూ లేకుండా కొన్ని రోజులపాటైనా కల్సి ఉండబోతున్నందుకు ఎంతో ఆనందంగా ఉంది’’ అన్నాడు సామ్రాట్.
‘‘సరే.. సరే.. కాఫీ త్రాగాలని ఉంది నాకు. నీకూ ఉంటే చెరొక కప్పూ తీసుకురావూ!’’ అంది సాహిత్య.
‘‘చూశావా.. చూశావా.. నాగోలే తప్ప నీకేమైనా కావాలా? అని ఇంతవరకూ అడగలేదు నేను. సారీ సాహిత్యా! ఇప్పుడే వస్తాను’’ అంటూ పరుగులాంటి నడకతో అక్కణ్ణించి వెళ్లి అయిదు నిముషాల్లో పొగలు కక్కుతోన్న కాఫీ కప్పుల్తో తిరిగి వచ్చి ఆమె చేతికి ఓ కాఫీ కప్పు అందించాడు సామ్రాట్.
కాఫీ త్రాగుతూ అంది సాహిత్య, ‘‘రైల్వే స్టేషన్‌లోనూ, బస్‌స్టాండ్‌లలోనూ ఇంతకుముందుకంటే కాఫీ, టీల నాణ్యత మెరుగుపడినట్టుగా ఉంది కదూ?’’
‘‘సాధారణంగా ఆడవాళ్లకు బయటి పదార్థాలు తినేవైనా, త్రాగేవైనా ఒహపట్టాన నచ్చవు. తాము వాటిని అద్భుతంగా తయారుచేయగలమని ఆడవాళ్లు మనసారా నమ్మడమే అందుకు కారణమై ఉండొచ్చు.
నీ చేతి కాఫీ నేనెప్పుడూ రుచి చూడకపోయినా నువ్వు చేసేటంత బాగా మాత్రం ఈ కాఫీ ఉండి ఉండదని నా నమ్మకం’’ అన్నాడు సామ్రాట్.
‘‘నువ్వు సామ్రాట్‌లా కాక మరీ భట్రాజులా తయారవుతున్నావు రోజురోజుకూ. ఎవరో తయారుచేసిన కాఫీని నేను మెచ్చుకొంటొంటేనే తట్టుకోలేకపోతున్నావు నువ్వు.
చూడబోతే ఇక నా మీద ఈగలూ, దోమలూ వాలినా సహించలేక వాటిని వేటాడి చంపేవరకూ నిద్రపోయేలా లేవు నువ్వు’’ అంది సాహిత్య.
ఆమె మాటలకు ఒక్క క్షణం చిన్నబుచ్చుకుని అన్నాడు సామ్రాట్, ‘‘అవును నా వరకూ నువ్వే అందరికంటే గొప్ప! నీకంటే గొప్పవాళ్లు ఈ ప్రపంచంలో ఎవరూ ఉండరు’’
‘‘ఇక నీ పొగడ్తలు నేను వినలేను బాబూ. ఇలా అయితే మన నాలుగు రోజుల ప్రయాణాన్నీ తప్పకుండా కుదించుకోవాల్సి వస్తుంది’’ అంది సామ్రాజ్ఞి బెదిరిస్తున్నట్టుగా.

-ఇంకాఉంది

సీతాసత్య