డైలీ సీరియల్

బంగారుకల 16

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాయల వాక్కు వింటూ సభ ఆశ్చర్యపడింది. రాయలు ఉద్వేగంగా వెల్లడిస్తున్నాడు.
‘‘ఆ కలలో ఆంధ్ర మహావిష్ణువు విష్ణ్భుక్తుల చరిత్రను తెలుగులో కావ్యంగా రాసి వేంకటేశునికి అంకితమీయమని నన్ను ఆదేశించాడు’’ రాయలు చెప్పాడు.
‘‘సాధు సాధు’’ అని సభ ఆమోదం ప్రకటించింది.
‘‘తెలుగులోనే కావ్యరచన ఎందుకంటే...’’
‘‘తెలుగదేల యన్న దేశంబు దెలుగేను
...................................
దేశ భాషలందు తెలుగు లెస్స’’
అన్నరాయల భావానికి మంత్రముగ్ధులైనారంతా!
‘‘మేము రచిస్తున్న ‘ఆముక్తమాల్యద’ ప్రబంధం నుండి ఒకటి రెండు పద్యాలు విన్పించగలము. అవధరించండి’’ విష్ణుచిత్తుని భక్తి తత్పరత ఎట్టిదనగా-
‘‘అం దుండుం ద్వయ పద్మపద్మవదనుం డద్వంద్వు డశ్రాంతయో
.................... నిష్ట న్విష్ణుచిత్తుండనన్’’
రాయల కవితా ప్రవాహంలో నాటి సభ సరస్వతీ నదిలా ప్రవహించింది.
పెద్దన ఆముక్తమాల్యద కథాంశాన్ని మిగుల శ్లాఘించారు.
అష్టదిగ్గజ కవుల కావ్యాలనుండి రసబంధురమైన కొన్ని పద్యాలను విని సభలో సాహితీ డోలికల్లో ఓలలాడింది.
భువన విజయం సాహితీ విజయంగా భాసించింది. అప్పాజీ వదనంలో రాయలపట్ల అవ్యాజమైన ప్రేమ, తృప్తి తోణికిసలాడింది.
‘‘శ్రీకృష్ణదేవరాయలవారికి జయము జయము’’ అనే హర్షధ్వానాలతో నాటి సభ ముగిసింది.
***
‘‘ప్రభూ!మేము కూడా మీ వెంట తిరుమలకు వస్తాము. వేంకటేశుని కనులారా దర్శించి తరిస్తాము’’ తిరుమలాంబ మాటలకు రాయలు ఆమోదించాడు. ముచ్చటపడిన రాయలు ముగ్గురు దేవేరులు కోరిక ప్రకారం వారితో కాలినడకన సకల సన్నాహాలతో తిరుమల యాత్ర చేశాడు. పండితులు, కవులు, గురువులతో గోవిందనామ స్మరణతో శ్రీవేంకటాచలం చేరాడు రాయలు.
రాయలు తిరుమల క్షేత్ర మహాత్మ్యమును దేవేరులకు వివరించాడు.
‘‘ఇది మేరు పర్వత భాగం. వేంకట అంటే ‘ఇహపరాలు ఇచ్చేవాడని’ అర్థం. ఏడుకొండల వేంకట నాయకుడు కలియుగంలో భక్తులపాలిట కొంగుబంగారమై వెలిశాడు’’.
సకల తీర్థములవున్న స్వామి పుష్కరిణిలో దేవేరులతో స్నానం చేసి వరాహ స్వామిని దర్శించి, శ్రీవేంకటేశుని దర్శించి అముక్తమాల్యద అంకిత పద్యాన్ని స్వామికి విన్పించాడు రాయలు. తిరుమల దేవాలయ శిల్పసంపద అందరినీ అబ్బురపరిచింది. రాయలు దేవేరులతో శిల్పరూపంలో వెంకటేశుని ముంగిట కొలువుతీరటం చూసి అందరూ ఆనందపడ్డారు.
విజయనగర సామ్రాజ్య రక్షణ చేయమని స్వామిని కోరి రాయలు తిరుగు ప్రయాణమయ్యాడు.
****
విజయనగరంలోని కారాగార ప్రధాన అధికారికి రాజాంగుళీకాన్ని చూపించింది మంజరి.
‘‘ఏమి ఆజ్ఞ?’’
‘‘చంద్రప్పను చూడాలి’’
భటులు ఆమెను చంద్రప్ప ఉన్న కారాగార విభాగానికి తీసుకెళ్లారు. ఆమెని చూసి చింద్రప్పకు ఆశ్చర్యం, ఆనందం, భయం కలిగాయి.
‘‘మంజూ! ఎందుకింత దుస్సాహసం? ప్రభువుల ఆగ్రహానికి గురి కావాలసి వస్తుందని తెలియదా?’’
‘‘ప్రభువులు అనుగ్రహించారు చంద్రా! అందుకే ఇలా రాగలిగాను. దేవేరులతో రాయలవారు శ్రీవేంకటాచలానికి వెళ్లారు. ఆ తిరుమలేశుని దయవలన నీపై వచ్చిన నింద కూడా త్వరలోనే తొలగిపోతుంది. నేను తిమ్మరుసు మహామాత్యునికి అన్నీ విన్నవిస్తాను.
‘‘వారు నమ్ముతారా!’’ చంద్రప్ప నిరాశగా అన్నాడు.
‘‘వారు విజ్ఞులు. నువ్వు ధైర్యంగా ఉండు. నాడు ఏం జరిగిందో చెప్పటానికి సాక్షి ఉన్నాడు’’.
‘‘సాక్షా!’’ ఆశ్చర్యపోయాడు చంద్రప్ప.
‘‘అవును’’ నేనిక వెళ్లివస్తాను. కన్నీరు దాచుకుంటూ వెళ్లిపోయింది మంజరి.
మంజరి మర్నాడు తిమ్మరసును కలిసి చంద్రప్ప తన ఇంటిలో రహస్య పత్రాలను దాచిన విషయం, అవి దొంగిలింపబడిన తీరు వలివరించింది. తన కుమారుడే సాక్ష్యం చెప్పటం తిమ్మరుసును ఆశ్చర్యానికి లోను చేసింది.
గండమనాయకుడు విశ్వాసపాత్రుడే! అయితే అతని కుమారుడైన కంటకుడు వీరేంద్రుడితో కలిసి రాజ్యానికే ముప్పు తెచ్చే పనిలో ఉన్నాడని తిమ్మరుసు గ్రహించాడు. వెంటనే గండమ నాయకుని పిలిపించాడు.
‘‘అమాత్యవర్యా! ఏమిటి ఆజ్ఞ! గండమ నాయకుడు తిమ్మరుసు ఎదుట వినయంగా నిలిచాడు.
‘‘గండమనాయకా! రాజు కొలువులో విధి నిర్వహణ కత్తిమీద సాముగదా!’’ సేనానాయకుడు ప్రశ్నార్థంగా చూశాడు.
‘‘నీ స్వామి భక్తి నిరూపించుకొనే సమయం ఆసన్నమైంది’’ తిమ్మరుసు మళ్లీ అన్నాడు.
‘‘చెప్పండి అమాత్యా! నా శిరస్సు ఒక్క వేటుతో తెగవేసుకోనా?’’
‘‘అంతకంటే కఠినమైన త్యాగం. నీ కుమారుడు కంటకుడు రహస్య రాజ పత్రాలను శత్రువుకు చేరవేశాడని మనకి విశ్వసనీయ సమాచారం అందింది. అతను స్ర్తి లోలత్వంతో కాముకుడై మంజరిని చెరపడుతున్నాడని అభియోగాలున్నాయి’’ తీవ్రంగా ఉంది తిమ్మరసు స్వరం.
గండమ నాయకుడు అవమానభారంతో తలదించుకున్నాడు. అతనికి తెల్సు కుమారుని నిర్వాకాలు.
‘‘మన శిక్ష్మాస్మృతి ప్రకారం కంటకుడ్ని ముందు బందీని చేయండి. తర్వాత విచారణ జరిపిద్దాం. చంద్రప్పను విడుదల చేయండి. రాయచూర్‌ను ఆదిల్‌ఖాన్ వశం చేసుకొన్నాడు. మనం వెంటనే రాయచూర్ ముట్టడికి సిద్ధం కావాలి’’.
‘‘అలాగే మంత్రివర్యా! కంటకుడు నా కుమారుడని అనుకోవటానికే అవమానంగా వుంది. అతన్ని బందీ చేయకపోతే విజయనగరానికే చాలా ప్రమాదం. నాకిక సెలవు’’.

- ఇంకా ఉంది

-చిల్లర భవానీదేవి