డైలీ సీరియల్

బంగారుకల - 28

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘విజయనగరంలో స్ర్తిలను ఎంత గౌరవిస్తామో మీకు తెలుసు. అలాంటిది ఎందరో స్ర్తిలు అతనివల్ల బాధపడుతున్నారు. అధికారులకు లంచాలు నేర్పిస్తున్నాడు’’ ఆవేశంగా మళ్లీ చెప్పాడు గోవిందరాయలు.
‘‘నిజమే గోవిందా! అన్నపూర్ణాందేవి బంధువు అనే చిన్న కారణమే అతన్ని రక్షిస్తోంది. మన వేగులవల్ల చాలా కొత్త సంగతులు తెలుస్తున్నాయి. నేనున్నాను నీవు కలవరపడకు’’ కుమారుని శాంతపరచే ప్రయత్నం చేశారు తిమ్మరుసు.
ఇంతలో చంద్రప్ప వచ్చినట్లు వర్తమానం అందింది. చంద్రప్ప వచ్చేలోపు గోవిందరాయలు లోనికి నిష్క్రమించాడు.
‘‘అభివాదం మంత్రివర్యా’’
‘‘చంద్రప్పా! ఏమి వార్త’’
‘‘మంత్రివర్యా! నవరాత్రి ఉత్సవాల్లో ఒక ప్రమాదం తప్పింది’’
‘‘ఏమిటది చంద్రప్పా’’
‘‘ఓఢ్రం నుంచి వచ్చిన నృత్యాంగనల్లో ఒక స్ర్తి దుస్తుల మాటున ఛురిక దాచింది. ఆమె రాయలవారికి చాలా చేరువగా వచ్చింది గాని ప్రయత్నించేలోపు మంజరి ఆ రహస్యాన్ని ఛేదించడంతో ఆ నర్తకిని దండనాధులు బందీని చేశారు’’.
‘‘ఆమెను ఓఢ్రం నుంచి పిలువనంపింది మనమేనా?’’ అనుమానంగా అడిగారు తిమ్మరుసు.
‘‘కాదు వీరేంద్రులవారి వ్యక్తిగత ఆహ్వానం మేరకు వచ్చిందట’’ తటపటాయిస్తూ చెప్పాడు చంద్రప్ప.
‘‘ఊ’’ తిమ్మరుసు గంభీరముద్ర వహించారు.
‘‘అంతేకాదు అమాత్యవర్యా! కవాతు చేసిన మన సైన్యంలో లెక్కకు మించి ఇతర సైన్యం గుర్తించలేని విధంగా కలిసి ఉందట’’
‘‘ఇక నీవు వెళ్లవచ్చు’’ చంద్రప్ప నమ్కస్కరించి వెళ్లిపోయాడు. మంత్రి తిమ్మరుసు చురుకుగా సేనానాయకుడికి కబురు పెట్టారు.
***
మంజరి పున్నమి వెలుగులో వసంతవాటికలో వేచి వుంది. కొలనులోని చందమామ చంద్రప్పలా ఉన్నాడు. తమ వివాహానికి ఇంకా మూడునాళ్లున్నది.
ఆ తర్వాత చంద్రప్పతో తమ విహారం శిల్పారామంలోనే! పరవశిస్తూ సంచరిస్తున్న మంజరి.
విజయనగరమంతా ఎక్కడచూసినా అద్భుత శిల్పప్రపంచమే కదా! శ్రీరామచంద్రునికి సహాయపడిన వానరోత్తముల రాజ్యం ఇది. ఇపుడు మరో రామరాజ్యమయింది. వరాహస్వామి పతాక చిహ్నంగా ఉన్న ఈ విజయనగరంలో రఘునాథ దేవాలయం బయటి గోడమీది శిల్పకళాకృతులంటే మంజరికి ఎప్పుడూ ఇష్టమే. ఇక్కడే రామచంద్రుడు తమ తండ్రికి పిండప్రదానం చేశాడంటారు. నిజమేనా! ఎప్పటి రాముడు! త్రేతాయుగం నాటి మాట. నమ్మినా నమ్మకపోయినా ఆ పుణ్యస్థలం నేటికీ పవిత్రమైనదే! మంజరి నర్తనశాలలో ప్రవేశించింది. రాత్రివేళ కదా! నిశ్శబ్దంగా ఉంది. కానీ ఆమె మనోవీధిలో అక్కడ నృత్యకేళీ పరమ మనోహరంగా జరుగుతున్నది. ఇది ఎంతటి ముగ్ధ మనోహర ప్రదేశం!
‘‘కాళ్ళ పారాణి చిక్కన నృత్యవేళల
చెమటలో కరిగిపోసినది ‘చార’
చక్రభ్రమణ వేళ జలతారు తలకట్టు
తెగిన ముత్యాలు దిద్దినవి ‘ముగ్గు’
శ్రామకేళికావేళ వాదించి ప
చ్చీసులో నెంచి కచ్చినది ‘పావు’
నృత్యగాన పరీక్ష నెరిగి దినాభ్యాస
మునకు ధరించి విప్పినది ‘గజ్జె’
రేగిపోలేదు, చెరగను లేదు, కదలి
పంటగడి తప్పలేదు, సప్తస్వరాల
కనుగుణంబుగ మ్రోయ మానినది లేదు
నేటికిని కిన్నరాంగనా నిచయ మాంధ్ర
రాజకన్యానుసరణ పరత్వమందు
తెలుగు నర్తనశాలలో తిరుగుకతన’’
ఆమె వివశంగా సన్నని గొంతుతో పాడుకుంటున్నది. అకస్మాత్తుగా గోవిందరాయడి రాక ఒకింత విస్మయం కలిగించింది.
‘‘మంజరీ! ఇక్కడ్నించి త్వరగా వెళ్లిపో! అపాయం’’ హెచ్చరించిన అతను మరుక్షణంలో మాయమయ్యాడు.
ఆమె తేరుకుని వెంటనే పరుగులాంటి నడకలో ఇల్లు చేరుకుంది. వెనుక కత్తుల శబ్దాలు విన్పిస్తున్నాయి. ఏం జరుగుతుందిక్కడ. విజయనగరం నివురుకప్పిన నిప్పులా వుంది.
‘‘ఈ నిప్పు జ్వాలగా ఎగయకముందే చల్లార్చు స్వామీ!’’ విరూపాక్షుని ఉద్వేగంగా ప్రార్థించింది మంజరి.
***
శ్రీకృష్ణదేవరాయల మందిరంలో సేనానాయకుడు రామలింగనాయకునితో సమావేశమయ్యారు ప్రభువు.
‘‘ప్రభూ! చిన్న పామునైనా పెద్ద కర్రతోనే...’’ రామలింగనాయకుని ఆత్రుత అది.
‘‘మాకు తెలుసు రామలింగ నాయకా! ఇస్మాయిల్ ఆదిల్‌ఖాన్‌పై దాడి జరిపి రాయచూర్‌ను మన స్వంతం చేసుకున్నది సముచితమే! అయినా స్వమత కారణంగా గోల్కొండ, అహ్మద్‌నగర్, బీదర్, బీరార్ పాలకులు మనపై కత్తిగట్టారు. ఆదిల్‌ఖాన్‌కు రాయచూర్ తిరిగి ఇవ్వాలట. హు!’’ రాయలు సింహంలా జూలు విదిల్చి మళ్లీ అన్నాడు కోపంగా.
‘‘అట్టానెన్నటికీ జరగదు. ఆదిల్‌ఖాన్‌ని వచ్చి నా పాదాలను ముద్దుపెట్టుకోమనండి. అలా చేస్తే అతని రాజ్యాన్ని తిరిగి ఇచ్చేస్తామని కబురు పంపండి’’
‘‘కానీ ప్రభూ!’’
‘‘మా ఆజ్ఞ’’ ప్రభువు మందిర అంతర్భాగంలోకి విసవిసా వెళ్లిపోవటంతో రామలింగ నాయకుడు నిస్సహాయంగా చూశాడు.
ప్రాణాలొడ్డి సాధించిన రాయచూర్‌ను తిరిగి ఆదిల్‌ఖాన్‌కు అప్పగించటమా! ఇది విజయనగర ప్రతిష్ఠకే మాయనిమచ్చ. తిమ్మరుసుల వారేమని యోచించారో! ఆదిల్‌ఖాన్ రాయల్ని కలవటానికి సిద్ధంగానే ఉన్నాడు. సరిహద్దులోకి రమ్మని కబురంపాలని ప్రభువు ఆజ్ఞ. కానీ అతను వస్తాడా? బెల్గామ్ సుల్తాన్ లారీ కూడా జిత్తులమారి. నమ్మటానికి లేదు. ఆలోచిస్తూ రామలింగ నాయకుడు మందిరం బయటికి వస్తుండగా వీరేంద్రుడు ఎదుటపడ్డాడు.

- ఇంకా ఉంది

-చిల్లర భవానీదేవి