స్మృతి లయలు
కదిలేవీ.. కదిలించేవీ.. ఉత్తరాలే! -100
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
ఫాత ఫొటోలు ముచ్చట్లు చెబుతాయి. జ్ఞాపకాలను కెలుకుతాయి. కానీ ఉత్తరాలు సంభాషిస్తాయి. అప్పటి చరిత్రను బొమ్మలు తీసి చూపిస్తాయి. రాసిన వాడి ఆంతర్యాన్ని అంతఃచేతననీ ప్రతిబింబిస్తాయి. గుట్టలు గుట్టలుగా పడి ఉన్న ఉత్తరాలను ఒక ‘కాణాచి’గా భావించాను. పదిలంగా ఉన్న వాటిని చాలా ఆలస్యంగా తడుముతున్నాను. కనీసం ఓ నాలుగైదు సంవత్సరాల క్రితం వాటిని తెరిచి, అనుభవించవలసింది అనిపిస్తోంది. యాభై ఏండ్ల నాటి ఉత్తరాలు అటకల మీద నివురుగప్పిన నిప్పులలాగా ఉన్నాయి.
బెజవాడ వస్తూనే దినపత్రిక సుడిగుండంలో పడ్డాను గనుక కొత్త ఉత్తరాలను మాత్రమే అతికష్టం మీద చూసుకొనే వాణ్ని. నెలకి పదిహేను రోజులు సాయంకాలాలే లేవు. అయితే మద్రాసుతో ‘టచ్’ మాత్రం ఉండింది. అక్కడి ఆఫీసు సంగతులు పి.ఎస్.ఆర్., వి.వి.ఎన్.లకు కూడా అంతగా తెలిసేవి కావు గానీ, నాకు వాసిరాజు ప్రకాశం, ‘లీడర్’ అని నిక్‌నేమ్ ఇచ్చి ఆదరించిన అసిస్టెంట్ ఫోర్‌మేన్ (ఆ తర్వాత ఫోర్‌మాన్ అయ్యాడు) బి. వేంకటేశ్వర్లు రాసే ఉత్తరాల వల్ల తెలిసేవి. వర్కర్ల సంస్థకి, అభ్యుదయ కళాసమితి విశేషాలు తెలిసేవి. అక్కడి దినపత్రిక పట్ల యాజమాన్యానికే శ్రద్ధ తగ్గింది అని తెలిసింది.
‘‘అక్టోబర్ పదహారున డైలీ ఎడిటర్ ఇన్‌చార్జి శ్రీరాములుగారు రాజీనామా చేశారు. ‘‘దినపత్రికకి ఇంకా ఎవరూ కొత్తవారు రాలేదు గానీ తిరుమల రామచంద్రగారు ఒక పాత మనిషియే అని చెప్పుకుంటున్న కృష్ణగారు కనబడుతున్నారు’’ అని రాశాడు. శ్రీరాములుగారు కొంత కాలంగా అసంతృప్తిగా ఉన్నారు అని నాకు ముందే తెలుసు. మద్రాసు ఎడిషన్ ‘హంస గీతిక’ పాడుతున్నది అని మాకు తెలుస్తూనే ఉంది. అయితే అదనంగా సినిమా పేజీ ఒకటి రావడంతో పి.ఎస్.ఆర్.తో ‘్భటీ’యే కుదరటం లేదు నాకు.
భేటీ అంటే జ్ఞాపకం వచ్చింది. నేను సాధారణంగా ‘్భటీ’ అన్న మాట, ‘అగుపించింది’ అన్న మాటని అంటే ‘కనిపించింది’ అని వాడే వాణ్ని. అయ్యవారికి ఈ రెండు మాటలు పడవుట! నిజానికి ‘్భటీ’ అన్న మాటను ప్రభవాళ్లు ఉపయోగించే మాట గానీ, అలవాటులో పొరపాటుగా నా నవలలోని పాత్రలు ముఖ్యంగా ‘ఎదిగి ఎదగని మనుషులు’లోని కొన్ని పాత్రలు ‘‘శ్రీకాకుళం, వైజాగ్ బెల్ట్’’కి చెందినవి. వాటి నోట ఈ ‘అగుపించడం’ పలికేది. పి.ఎస్.ఆర్. ‘‘మొదట ఈ భేటీ అన్న మాటని మరిచిపో, బాబూ!’’ అన్నాడోసారి. మరోసారి, అయ్యవారు రాసిన ఉత్తరం చూపించాడు. ‘‘సాధ్యమైనంత వరకు నొచ్చుకోకుండా చెప్పండి, వీరాజీకి ‘‘అంటూ’’, ఈ రెండు మాటలూ నాకు (అతనికి) బాగుండవు’’ అని రాశారు వారు!
నా మనసు ఆర్ధ్రమైపోయింది. ‘‘ఆయన కఠినంగా ఉంటారు’’ అన్నదే మా వాళ్ల ‘మాట’ కానీ, ఏనాడూ 1972లో ఆ మహానుభావుడు ఇహలోక యాత్ర చాలించే దాకా, నన్నొక్క మాటయినా అనలేదు. నేనూ ఆ అవకాశం ఇవ్వలేదు. ‘‘సంపాదకులకు సంపాదకుడు’’ అని ‘రచన’ పత్రిక సంపాదకుడు ‘సాయి’కి, ప్రత్యేక వ్యాసం అడగగానే రాసి ఇచ్చాను. సందర్భం వచ్చింది కనుక, ఆ మహనీయుణ్ని తలుచుకుంటున్నాను. అయ్యవారికి నివాళులర్పిస్తున్న ప్రెస్ క్లబ్ మీటింగుకి - నండూరి రామమోహనరావుగారు రాలేదు. నేనూ, యూనియన్ అధ్యక్షుడిగా ఉన్న డి.ఎమ్.కె.గాంధీ పాల్గొన్నప్పుడు శ్రీ శంభుప్రసాద్‌గారి పేరు విజయవాడ ప్రెస్‌క్లబ్‌కి ఉంచాలని తీర్మానించాం. కానీ, అది సాధ్యం కాలేదు. అదంతా వేరే గాథ..
‘‘హైదరాబాద్ ప్రెస్‌క్లబ్‌కి దేశోద్దారకుని పేరు ఉన్నది కదండీ’’, అన్నారు రాధాకృష్ణగారు. లోకల్‌గా కొందరి అభిప్రాయంలో నార్లవారి పేరు పెట్టాలన్న అభిప్రాయం ఉన్నదిట. మొత్తానికి అయ్యవారి అస్తమయం ఆంధ్రపత్రికని అన్ని విధాలా దెబ్బతీసింది. వీక్లీని బెజవాడకీ, మిగిలిన దినపత్రిక ముక్కని ‘హైదరాబాద్’కీ తరలించడం అనతికాలంలోనే జరిగింది.
ఈలోగా 73 అక్టోబర్ దాకా, నేను దినపత్రికలోనే అన్ని రకాల ఇన్‌డోర్‌లోనూ, ఔట్ డోర్‌లోనూ కూడా అసెంబ్లీ నుంచీ లోకల్ కార్పొరేషన్ సమావేశాలూ సహా, అనేక ఫీచర్లూ, ఎడిట్‌పేజీ వ్యాసాలూ మొదలు ఎడిటోరియల్స్ రాయడం దాకా తలమునకలై పనిచేసే అవకాశం దక్కింది... ధన్యోస్మి!
బెజవాడలో బయస్కోపు హవా
శుక్రవారం సినిమా పేజీ బెజవాడ వచ్చాకా ‘విదేశీ వార్తలు, హిందీ చిత్రరంగ వార్తలు’ అంటూ పాఠకులలో ఆసక్తి కలిగించే వార్తలను సేకరించి రాయడం మొదలెట్టాము. ‘బై, బారో ఆర్, స్టీల్’ అన్న సూత్రం ఉందిగా. మద్రాసు నుంచి డి.కె.ఎమ్. పంపించే ఫిలిమ్ రివ్యూలు చక్కగా ఉండేవి. వాటికి ప్రాముఖ్యత పెంచాను. అరవై ఆరులో దిలీప్‌కుమార్, సైరాబానుల పెళ్లి, విజయానంద్, వహిదా రెహ్మాన్‌ల పెళ్లిలాంటి వార్తలే కాకుండా ‘దిలీప్‌కుమార్ లోక్‌సభకి పోటీ చేస్తాడు’ లాంటి వార్తల్ని యువజన ప్రేక్షకులలో కుతూహలాన్ని రేకెత్తించేవి. తెలుగు సినిమాలు హిందీలోకి వెళ్తే వాటికి మనం వార్తలు రాసి వేస్తే తప్ప పబ్లిసిటీ ఏజెంట్ల వద్ద నుంచి వార్తలు అందవు.
కులగోత్రాలు సినిమాని హిందీలో మాలాసిన్హా, బిశ్వజిత్‌లతో తీస్తున్నారని రాస్తూ ఎన్నికలలో హిందీ తారలు శ్రీమతి ఇందిరాగాంధీ తరఫున ప్రచారం చేస్తారని రాయడం, ఇవన్నీ ‘‘పది పైసలకు’’ మాత్రమే దొరికిపోయే ఆంధ్రపత్రిక దినపత్రికలో దొరికిపోవడం కొత్త సంచలనాన్ని సృష్టించింది. దానికి తోడు శుక్రవారం సినిమా రిలీజ్‌లతో పాటు శనివారం లేదా ఆదివారం ఆ సినిమా నటీనటుల్ని తెచ్చి ‘గెట్ టుగెదర్’లు పెట్టడాన్ని నవయుగ, పూర్ణా ఫిలిమ్స్ వారికి దోహదించాయి ఇవి. నవయుగా మానేజర్ కాట్రగడ్డ నరసయ్యగారు ఈ విషయంలో కొత్త పుంతలు తొక్కాడు. దీంతో, రొటీన్ సినిమా పేజీలు, ప్రత్యేక సినిమా సప్లిమెంట్స్‌గా మారిపోయాయి.
స్టూడియోలలో వేసే ప్రివ్యూల కన్నా బెజవాడ థియేటర్లలో, పత్రికల వారికి చూపిస్తే ‘ఉభయ తారకం’ అన్న అభిప్రాయం, పంపిణీ రంగం, ప్రదర్శన రంగం రెండు రంగాలలోనూ హుషారు ఇచ్చింది. బెజవాడ నిండా ‘‘టాబ్లాయిడ్ పత్రికలు’’, జనతా/శారద/లాంటి డైలీలు - ములుకోల, వాహిని, ప్రజాసేవ, జాగృతి, ప్రజారాజ్యం లాంటి టాబ్లాయిడ్లు వీటన్నిటికీ ఒక కొత్త ఊపు వచ్చింది. అరవై ఆరు నుంచే, హిందీ సినిమాలకు కూడా ప్రివ్యూలు ఎక్కువైనాయి. బెజవాడలో ప్రెస్‌షోలు కూడా ఎక్కువైనాయి. ఉదాహరణకి మహ్మద్ నటించిన ‘్భత్ బంగలా’ సినిమా విజయా టాకీస్‌లో భారీ స్పెషల్ షోగా వేస్తే సినిమా ప్రముఖులతో, వారి కుటుంబాలతో, పత్రికల వారితో హాలు కిటకిటలాడిపోయింది. సినిమా విజయమూ అలాగే లభించింది.
ఆనక... అది అట్లా ఉండగా...
విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు
అక్టోబర్, 1966లో విశాఖపట్టణంలో ‘‘విశాఖ ఉక్కు - ఆంధ్రుల హక్కు’’ అన్న ఉద్యమం మొదలైంది. అప్పటికి దేశంలో నాలుగు ఉక్కు కర్మాగారాలు మాత్రం ఉన్నాయి. రూర్కెలా, భిలాయ్, ఆసన్ సోల్, బొకారో ఫ్యాక్టరీలు ఇంత పెద్ద దేశం అవసరాలకు సరిపోవు అన్న అభిప్రాయం ఏనాడో ఉంది.
1963లోనే నిపుణుల కమిటీ ‘‘వైజాగ్ ఉక్కు కర్మాగారం నిర్మాణానికి అనువైనది’’ అంటూ సిఫార్సు చేసినా కేంద్రం శీతకన్ను వేసింది. 1965లో కూడా కమిటీ వైజాగ్‌నే బలపరిచింది. 1966 అక్టోబర్ 15న గుంటూరు జిల్లా తాడికొండకు చెందిన, కాంగ్రెస్ నాయకుడు అమృతరావుగారు ‘నిరాహార దీక్ష’ మొదలుపెట్టాడు. ఐతే, ఇతని దీక్షకు మద్దతుగా పార్టీలకు అతీతంగా జనసంఘ్ పార్టీ నాయకులు, ప్రజా పార్టీ కార్యకర్తలు, ఒక విద్యార్థినీ కూడా నిరాహారదీక్షకు దిగారు. యూత్ కాంగ్రెస్ మద్దతూ ఉంది. విద్యార్థి సంఘాలు రంగంలోకి ఉగ్రంగా దూకాయి. గానీ కేంద్రం ‘‘ఈ ఉద్యమాన్నీ, నిరాహార దీక్షలకీ భయపడి ఉక్కు ఫాక్టరీలు స్థాపిస్తామా?’’ అంటూ ఢిల్లీ నాయకత్వ వేళాకోళం చేసిందని, యువజనం రగిలిపోయారు. పైగా ‘సేలం’లో పెట్టాలంటూ, కొమరాజ్ నాడార్‌గారు సూచించారు. హూస్టేట్‌లో కూడా కావాలని కేంద్రమై ఒక ఉద్యామాన్ని ప్రోత్సహించింది.
దీంతో కాంగ్రెస్ నాయకులే కేంద్రానికి గట్టి వార్నింగ్‌లు పంపించారు. అప్పటికే పదిహేను రోజులుగా నిరాహారదీక్షలో ఉన్న అమృతరావు - ఉక్కు ఫాక్టరీ నిర్మాణ ప్రకటన వస్తేనే గానీ, దీక్ష విరమించనని టెలిగ్రాములు పంపించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి గారు కూడా ఢిల్లీకి వెళ్లి వచ్చాడు. కేంద్రం ఒక ‘‘నిపుణుల కమిటీ వేశాం’’ అంటూ పక్కదారి పట్టించింది. కానీ ఉద్యమం మహోద్రేకంగా మారింది. కాలేజీలు, విశ్వవిద్యాలయాలూ, స్కూళ్లూ అన్నీ బంద్.
ఆనాటి పొట్టి శ్రీరాములుగారి ఆత్మాహుతి దృశ్యాలు తిరిగి కనబడ్డాయి. కె.బి.యన్. కళాశాల, లయోలా కాలేజీల ర్యాలీలను నేనే కవర్ చేశాను. ఢిల్లీకి, వైజాగ్‌కీ మధ్య ముఖ్యమంత్రి బ్రహ్మంగారు తిరిగారు. కేంద్రంలో మంత్రిగా ఉన్న నీలం సంజీవరెడ్డిగారు ఉక్కు శాఖను చూస్తూ ఉండి కూడా వైజాగ్ ప్రతిపాదనను ఉపేక్షించారని ఆంధ్రా జనం ‘అగ్గిరుద్రుడు’ అయిపోయింది. వైజాగ్‌లోనే కాదు తిరుపతి, గుంటూరు, బందర్, విజయవాడ, విజయనగరం, కర్నూలు లాంటి అన్ని ప్రధాన నగరాలలోనూ పోలీసు కాల్పులలో మొత్తం ముప్ఫై రెండు మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు.
గుంటూరులో నవంబర్ 1న ఆంధ్రప్రదేశ్ అవతరణ ఉత్సవాలకు బదులు భీషణ ఉక్కు ఉద్యమకాండ జరిగింది. నేను కవరేజీకి వెళ్లాను. ఉద్యమం విద్యార్థుల చేతిలో నుంచి అన్ని చోట్లా ‘సంఘ విద్రోహక శక్తులు’ అంటారే పత్రికల పరిభాషలో అల్లరి మూకల చేతుల్లోకి పోయింది. గ్రంథాలయాలు, మున్సిపల్ కార్యాలయాలు, రైలు స్టేషన్లు ఒకటేమిటి? అన్నీ ధ్వంసం అయిపోతూ ఉండగా పోలీసుల కాల్పులలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. బెజవాడలో వందలాది మంది అరెస్ట్. బంద్‌లకు, ఊరేగింపులకూ అనుమతి బంద్...
మొత్తానికి విద్యార్థుల చేతిలో నుంచి విధ్వంసక మూకల చేతులలోకి స్థితి జారిపోయింది. ఆంధ్రపత్రిక సెంటర్‌లో ఉన్న నీలం సంజీవరెడ్డిగారి కంచు విగ్రహం మీద జనుల ‘ఆగ్రహజ్వాల’ దాడి చేసింది. చూస్తూండగానే మిట్టమధ్యాహ్నం వేళకి జనాలు కంచువిగ్రహాన్ని నేలకి లాగి ధ్వంసం చేశారు. ఆ టైము మా, ఆంధ్రపత్రిక భవనం ఫస్ట్ ఫ్లోర్ బాల్కనీలో నుంచి మేము నిస్సహాయంగా చూస్తూండి పోయాము. ఆంధ్రపత్రికకీ, సంజీవరెడ్డిగారికీ పడదు. అందుకని ఈ విధ్వంసకాండని చూస్తూ, ఎంజాయ్ చేశారన్న ‘నీలాపనింద’ ఒకటి పడ్డది మామీద, గానీ, వాస్తవానికి అటువంటిది ఏమీ లేదు. రౌడీమూకలు విగ్రహాన్ని పెకిలించి, ముక్కలు చేసి, పక్కనే ఉన్న ఏలూరు కాల్వలో పడేశారు. పి.ఎస్.ఆర్.గారు ‘‘ఫైవ్ టౌన్ పోలీసు స్టేషన్‌కి వెళ్లగలిగితే వెళ్లు, వీరాజీ! ఈ విధ్వంస కాండ మనకొద్దులే!’’ అన్నాడు.
అట్లాగా, ఉన్న ‘అపప్రధ’ బాపుకునే ప్రయత్నంలో ఉన్న మేము (ఆంధ్రపత్రిక వారు) సంజీవరెడ్డి బొమ్మ విధ్వంసకాండని ‘ప్లేఅప్’ చెయ్యలేదు. విద్యార్థి సంఘాలు మేము కాదు, రౌడీ మూకలే చేశాయి అంటూ ఇచ్చిన ‘ఖండన’నే, వేస్తూ ఈ ‘దుశ్చర్య’ని నిరసించాము. నిందని బాపుకో చూశాము... నిజానికి అందులో నిజం లేదు.
ఆవిధంగా రాష్టమ్రంతటా మహోద్రేకంగా విధ్వంస కాండ సాగుతున్న దిశలో, ఈ విగ్రహ విధ్వంసకాండ అంత ప్రముఖం కాదు. వైజాగ్‌కి విమానాల ద్వారా సైన్యాల్ని తరలించారు. పోలీసు కాల్పులలో అక్కడ పది మంది పిల్లకాయల్తో సహా ప్రాణాలు కోల్పోయారు. ముఖ్యమంత్రి ప్రత్యేక విమానంలో వైజాగ్‌కు బయలుదేరిన వార్త అందింది. పర్సనల్‌గా నాకు ఈ ఉద్యమం మరపురాని విషాదాన్ని మిగిల్చింది. విశాఖలో ఉన్న మా చిన్న మేనత్త పూడిపెద్ది సత్యవతిగారి చిన్న కుమారుడు పది, పదమూడేళ్లవాడు ‘వేంకటరత్నం’ పోలీసు కాల్పుల్లో తీవ్రంగా గాయపడి ప్రాణాలు కోల్పోయాడు. ఆమె నాకు అత్యంత ప్రియమైన ఆత్మీయురాలు, గురువూ, స్నేహితుడూ కూడానూ.
‘రత్నం’ లాంటి కుర్రవాడు వేంకటరత్నం. కానీ, ఆ తల్లికి గర్భశోకం మిగిల్చాడు. ఆమె, ఆ విషాదం నుండి కోలుకోడానికి సంవత్సరాలు పట్టింది. అది ఒక మానని గాయమే అయింది నాకు...
*చిత్రం...చివరి దశలో దుర్గావిలాస్