స్మృతి లయలు
అర్ధరాత్రి అస్తమించిన మన ‘సూర్యుడు’!-98
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
అరవై అయిధు జనవరి ఇరవై మూడు నుంచి జనవరి పది అర్ధరాత్రికి బెజవాడ ఎడిషన్‌కి ఏడాదవుతోంది. ఎవడి మటుక్కి వాడే సెలబ్రేట్ చేసుకోవాల్సిందేననుకోండి. కానీ జనవరి పది అర్ధరాత్రి ఒక పిడుగు పడ్డట్లయింది. ప్రధానమంత్రి లాల్‌బహదూర్ శాస్ర్తీగారు పరాయిగడ్డ తాష్కంట్‌లో గుండెపోటుతో రాత్రి ఒంటి గంటా రెండు నిమిషాలకు అంతిమ శ్వాస వదిలారు. ఉలిక్కి పడ్డంది దేశం. పత్రికల కార్యాలయాల్లో పి.టి.ఐ. ప్రింటర్లు గణగణ ‘‘స్నాప్.. స్నాప్.. స్నాప్’’ అంటూ హెచ్చరించాయి. ఆ వేళకే మార్నింగ్ ఎడిషన్స్ ముగించి నిశాచరులం అంతా కొంపలు చేరుకున్నాం గానీ, ఆఫీసు నుంచి రెండున్నర గంటల వేళ తలుపు టకా టకా కొడుతూ.. పిలువు వచ్చింది.
ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా బెజవాడ మానేజర్ శ్రీనివాసన్ పత్రికల ఇన్చార్జిలకు టెలిఫోన్లు చేసే సరికి యంత్రాంగం అంతా కదిలింది. దగ్గరలో ఉన్న వాళ్లం పరుగులు తీశాం. దొరికిన వర్కర్లను, ఆఫీసులో ఇంకా కునుకు తీస్తున్న వర్కర్లను సమీకరించి ఆకస్మిక, అత్యంత విషాద వార్తను రాయడం, చేయడం పేజీలకెక్కించడం ఆ పేజీని రోటరీకి ఎక్కించడం అన్నీ హృదయ భారంతో చేశాం.. శాస్ర్తీగారు వెళ్లిపోయారు. ఆయన గురించి రాయాలంటే, మాకు రిఫరెన్స్ సెక్షన్ ఏముంది? తలకాయ తప్ప.
నాకు శాస్ర్తీగారంటే అమితమైన ఇష్టం. సమర వీరుడే కాదు. శాంతిదూత కూడా ఆయన! పద్దెనిమిది నెలల స్వల్పకాలంలోనే పద్దెనిమిది సంవత్సరాలు నెహ్రూగారు సాగించిన పాలనను మైమరపించిన స్థితప్రజ్ఞుడు. ‘కన్నీటి’తో రాయాలనిపించింది. ఈ వార్తని నాకు అటు ప్రకాశరావుగారికి టెలిగ్రాములు అనువదించి అందిస్తూనే, కాగితం మీద కలం పెట్టాను. నా సూచనకి తలూపాడు ఆయన.
మా ఆశ ఇలా తెల్లారిందా?
మా ‘లాల్’ ఇలా జరాపోయాడా?
తెల్లారితే సూర్యుడొస్తాడనుకున్నాం. తాష్కంట్ నుంచి మా శాస్ర్తీ నూతనార్కుడై ప్రభవిస్తాడనుకున్నాం భగవంతుడా, శాంతిమాత కడుపు మాడుతుంది అనుకోలేదు..
నిద్దరోయే నలభై ఐదు కోట్ల పసిపాపల ‘కల’ ఇలా భగ్నం అవుతుందనుకోలేదు.
మంచివాడు. తియ్యని వాడు. వెన్నలాంటి వాడు. వజ్ర కఠిన సంకల్పుడు. మనసుల్ని గెలిచినవాడు. మనుషుల మధ్య దూరాన్ని కలిపిన వాడు. ‘‘మా వాడు...మా వాడు’’ అనుచూ మేము గర్వించువాడు. తొలిదీపం వెలిగించిన మలి దీపం అతగాడు. గుండెల్లో పోటు పొడిచాడు. ప్రగతి పథానికి గండి కొట్టాడు. వెచ్చని వేకువ వేళ అలసిపోయానన్నాడు దేవుడా! తెల్లారి సూర్యుడు ఈవేళ ఇలా ఉదయించాడేమిరా భగవాన్! శాంతిపావురాలను పెంచడం, మంచికి ముగ్గులు పెట్టడం బాధ్యత ‘వెల’ ఇంత ఎక్కువా? దాని బరువు ఇంత మోతా? చైనా పొడిచిన వెన్నుపోటు నాడొక జ్యోతిని ఆర్పేసింది. పాక్ పొడిచిన గుండెపోటు నేడొక అమూల్య రత్నాన్ని వెలకోరింది! భగవంతుడా! కసాయి వాడా! వేరార్యూ? జీవనస్రవంతిని తాష్కంట్కు ఎక్కించిన వాడా! తలవంచని ధీరపుత్రుణ్ని ఎత్తుకు పోయావా!
మా ఆశ ఇలా తెల్లారిందా?! మా లాల్ ఇలా జారిపోయాడా?! అంటూ నేను రాసింది మొదటి పుటలోనే టాప్‌లో వేశాం. రెండు పేజీలు చేసి, అర్జెంట్‌గా సూర్యోదయానికి ముందే పత్రికని ‘బయటికి’కి పంపించగలిగాము.
‘‘ఇక సాయంకాలం సంచికకి తర్వాత’’ అనుకుంటూ బయటికి వచ్చాము. అదే డ్యూటీకి వచ్చిన మా వేంకటేశ్వరరావుగారు నా మీద, నాటి మద్రాసు సంఘటన, నాటి కలహం తర్వాత ఇంకా కోపంగానే ఉన్నా. ‘‘ఇలా రా!’’ అని పిలిచి న్యూ ఇండియా హోటల్ దాకా తీసుకుపోయి తాజ్‌మహల్ హోటల్లో ‘టీ’ తెప్పించి ‘‘తాగండి’’. అన్నాడు మీ ‘ఎలిజీ’కి , నా మెప్పు ఇది. నా సంతోషం ఇది. టీ తాగండి. మీ మీద కోపం పోయింది నాకిప్పుడు’’, అన్నారు సగర్వంగా.
‘‘స్పాన్టీనియిటీ గొప్పగా ఉంది మీకు’’ అన్న ఆయన మాటలు.. నాకింకా జ్ఞాపకం ఉంది... వికసించిందాయన మోము.
బయటికి వచ్చాం. అంతటా లాల్బహదూర్శాస్ర్తీగారే. అందరి హృదయాలూ భారంగా ఉన్నాయి. అంతలో అట్నుంచి ‘‘ప్రభ’’ ఎడిటర్ నీలంరాజు వేంకట శేషయ్యగారు బయటికి వస్తూ నా నమస్కారం అందుకున్నాడు. వాళ్లూ ‘ప్రభ’ చేసి వదిలారప్పుడే. ఇలా భుజంమీద చెయ్యివేసి ‘‘నానా తంటాలూ పడి సంపాదకీయం అల్లాము. తృప్తి కలుగలేదు గానీ నువ్వు ఉద్వేగంగా రాసిన పొయిట్రీ ‘తినేసింది’! ఆ మహనీయునికి సరి అయిన ‘నివాళి’ వీరాజీ! నువ్వు రాసిన పొయిట్రీనే!’’ అన్నారు. అట్లా, నా భుజం మీద చెయ్యి ఉంచే ముందుకు నడిచారాయన. ఆయన ఎప్పుడూ మడికట్టుకున్నట్లే సాటుగా ఉంటారు. సంకోచంగానే పక్కన నడిచాను. కాంగ్రెస్ ఆఫీస్ రోడ్డు వరుస సందుల్లో ‘బెస్ట్ ప్రెస్’ అని బాపు, శంకర్ల ప్రెస్ కింద పైన అంతస్తులో నీలంరాజు వారు ఉంటున్నారు. నేనూ (నా వెంట మా తమ్ముడు కూడా ఉన్నాడు) వారి ఇంటి మెట్ల వద్ద ‘‘శలవు తీసుకుంటాం సార్’’! అన్నాము.
పైకి రాండి. కాఫీ తాగి పోదురు’’ అంటూ తీసుకుపోయి కూర్చోబెట్టారు. ‘‘తక్షణం రాసేదే వార్త వెంటనే రికార్డు చేయగలిగితేనే ఉద్వేగం. వ్యాసం, పొయిట్రీ ఏదైనా... అంటూ, నాకు ఇలా ఎడిటోరియల్స్ రాయడం కృషి చేసే వాళ్లు కావాలి, సుబ్బారావ్!’’ అంటూ తమ్ముడి వేపు తిరిగారు. ‘‘అన్నయ్య వస్తానంటే వెల్కమ్’’, అని కూడా అన్నారు.
నాకు ‘షాక్’ లాగా తగిలింది... నమ్మలేకపోయాను.
కొంత చర్చ అనుకోకుండానే జరిగింది. ఆయన వాత్సల్యానికి ‘్ఫదా’ అయ్యాను.
‘‘కాకపోతే, నేను వెంటనే చీఫ్ సబ్, అసిస్టెంట్ ఎడిటర్ లాంటి పోస్టులు ఇప్పించలేను. జాయిన్ అయితే, త్వరలోనే అదీ సాధ్యమే’’ అన్నారు.
‘‘రాధాకృష్ణగారు ఏమంటారో?’’ అంటున్న నో లౌడ్ థింకింగ్ మాటల రూపంలో బయటికీ వచ్చేసింది.
‘‘నేనూ పత్రిక వాణ్నే. రాధాకృష్ణని చిన్నప్పటినుంచీ ఎరుగుదును. సరే...’’ అని లేస్తూ ‘‘ఆలోచించండి’’ అంటూ, మా ఇద్దరి భుజం తట్టి, లోపలకి నడిచారు. ఏమి సన్నివేశం!!
మా తమ్ముడు సుబ్బారావుశాస్ర్తీకి, అన్ని విధాలా ఆయనే కొండంత అండ. ‘చిత్రజగత్తు’ అన్న పాకెట్ కార్టూన్ (ప్రభలో) ఇచ్చిందీ ఆయనే. గొప్ప ఎడిటర్... ఆధ్యాత్మిక మూర్తి.
ఔను! ఒకనాడాయన ఆంధ్రపత్రికకి ‘‘యుద్ధ విలేకరిగా’’ అద్వితీయుడు. ద్వితీయ ప్రపంచ సంగ్రామ వేళ సింగపూర్‌కి పంపించబడ్డారు’’ అలాగని కూడా నేను విన్నాను. మేం తిరిగి మా గాంధీనగర్ ఇంటికి వెళ్లిపోయాం. శరీరాన్ని నీరసంగా మనస్సుని ఉద్వేగంగా ఈడ్చుకుంటూ!...
1960ల నాటికి పత్రికల స్థితి నెమరు వేసుకుంటే ఇలా ఉంటుంది. వార్తా పత్రిక 1780లోనే పుట్టినా దాని మనుగడ అంతా సమాచార సదుపాయాల మీదా కమ్యూనికేషన్ల పెరుగుదల మీదా ఆధారపడి ఉండేదే కదా! తపాలాసేవ 1837 దాకా లేదు. అయితే, రైలు బండీ 1853లోనే, బ్రిటీష్ వాడి ధర్మమా అని, వచ్చింది. బస్సు 1062లోనూ,విమానం 1932లోనూ అవతరించాయి. కాకపోతే 1881 నాటికే టెలిఫోన్ జనాలని, అమితంగా ఆకర్షించింది. రేడియో కూడా 1827 దాకా లేదు. అందువల్ల పందొమ్మిదో శతాబ్దం మన దేశ ఆధునిక చరిత్రలో అత్యంత ఉజ్వలమయింది. 1890లో సైకిలు మామూలు మనిషికి ‘‘చక్రాలు’’ అందించింది. 1896లోనే వచ్చినా రేడియో 1920కి 1940లకే మధ్య మాత్రమే, దాని (రేడియో) వ్యాప్తి. 1959లో, టెలివిషన్ వచ్చే దాకా నిలకడగా వార్తలందించే ఆధునిక సదుపాయం పత్రికలే.
ఈ సదుపాయాలన్నీ ఎక్కువగా బొంబాయి నుంచే మనకి అందేవి కనుక ఆంధ్రపత్రిక ఒక్కటే కాదు మన సినిమాలు కూడా అక్కడే తయారయ్యేవి. నాడు పత్రికా రచయితలో రచయిత, సృజనాత్మక రచయితతో పాటు సంఘసంస్కారి, మేధావి కూడా. (కొంతవరకు) దాగి ఉండాల్సి వచ్చేది. ఆ దశ నుంచి ‘మా దశ’ వేళకి కూడా మూల మూలలకీ వార్తా పత్రిక చేరడం ఒక యజ్ఞంలాంటిదే అయ్యింది. అయితే, లక్కీగా నాడు ఈ ‘్ఛనెల్స్’ బెడదలేదు. కాబట్టి (మేం) రాసింది ‘రాతా, చెప్పింది ‘ఆట’గా సాగింది.
బెజవాడ నుంచి వెళ్లినా, మద్రాసు నుంచి వచ్చినా విజయనగరం ఒకటీ దూరం అయింది. పత్రిక ఒక్కసారే అదే మెయిల్లో చేరవలసి వచ్చేది. కాకపోతే, రాత్రి పొద్దుపోయె దాకా అందిన వార్తలు ‘అప్పుడు’’ అందిస్తున్నారు. అంచేత ‘‘పత్రిక’ ఇంకా ముందుగానే బెజవాడ చేరుకున్న పత్రికల సరసన పోటీ ఇచ్చే స్థితికి వచ్చింది. కానీ, గ్రామీణ వార్తలు (మఫిసిల్ న్యూస్) అందడం ఎట్లా?... మేను ‘స్వ.వి’. అన్నా, ప్రభవారు (మనవిలేకరి) ‘మ.వి’’ అన్నా, ఏమన్నా సరే ‘టపా’లోనే రావాలి. ఎక్కువగా ‘మోర్స్‌కోడ్’ టెలిగ్రాము తెచ్చుకోలేము. టెలిగ్రాఫ్ ఆఫీసులుంటే కేవలం ‘‘యాభై’’ మాటలకే పరిమితమై వచ్చేవి. 1972 ఆగస్టు దాకా ‘పిన్ కోడ్’ లేదు. ఉత్తరాల సార్టింగ్లో యాతన, జాగు ఉండేది. అటువంటి స్థితిలో ‘‘ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా’’ ఒక వరం. మా (వేళకి) యునైటెడ్ న్యూస్ సర్వీస్ ఆఫ్ ఇండియా (సి.టి.ఐ.యన్.ఐ) అనే టెలిప్రింటర్ సదుపాయం కూడా వచ్చేసింది. ఐతే వార్తలు ఇవ్వడమే పత్రిక ప్రధానంగా చేయాల్సిన పని. ఆ తరువాత ‘పిడికెడు మీద ఏం పెట్టినా స్వయంపాకమే’’ అన్నట్లు మిగతా శీర్షికలు అన్నీ వచ్చాయి. అయితే లేఖలు మాత్రం మస్టు.
1960 తర్వాత మా వేళకి ట్రాన్సిస్టర్ రేడియోలు దిగడ్డాయి. ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ రంగంలో ఇది ఒక విప్లవమే గానీ, మాకు కార్యాలయాలలో ఆధునిక నిఘంటువులు, బుల్లి రేడియోలూ గట్రా లేవు అందుబాటులో. పత్రికలో సబ్ ఎడిటర్ అంటే గురికి బెత్తెడు దూరంగా ఇంగ్లీషులో వచ్చే టెలిగ్రాముల్ని అనువదించి, చేతులు దులుపుకుని పోయేవాడే అన్న అభిప్రాయం ఉండేది జనంలో. కానీ, నా మట్టుకి నాకు అలా అనిపించేది కాదు. సాయంకాలం రిపోర్టింగ్, ఆదివారాలు మీటింగులు ఇవన్నీ ‘స్వయంరాజ్- స్వయం మంత్రీ’ అన్నట్లుగా, మేమే చేసుకుపోయేవాళ్లం.
పెద్దలకు కలుగుతున్న తృప్తి చూశాక, ఒక ‘‘డౌట్’’ (సందేహం) పోయింది నాకు. ఏదో ఓ బడిపంతులు జాబ్ చేస్తూ బోలెడు లీజర్ ఉంటుంది కాబట్టి రచయితగా సెటిల్ అవ్వాలనే సందిగ్ధావస్థ తొలగిపోయింది. ‘‘వర్కింగ్ జర్నలిస్ట్‌గానే’’ ‘ఆరోహణ’ కార్యక్రమం చేపట్టాలి’’ అనుకొన్నాను. ఒక ‘‘పనిపిచ్చి’’ పట్టింది.
‘‘కమ్వాట్మే’’ అన్న జవహర్‌లాల్‌గారి ఊతపదం నాకు కూడా అలవాటయింది. అట్లా..! ‘‘కమ్వాట్మే’’ డైరీ చాకిరీకి అంకితం అయిపోవాలి’’.
(ఇంకా బోలెడుంది)