శ్రీమదాంధ్ర వాల్మీకి రామాయణం

శ్రీమదాంధ్ర వాల్మీకి రామాయణం (వాసుదాసు వ్యాఖ్యానం)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కిష్కింధకాండ
*
సుగ్రీవాదులతో కలిసి
కిష్కింధకు పోయిన శ్రీరాముడు
*
ముందు లక్ష్మణుడు, వెనుక వల, నీల, తార, హనుమంతుడు రాగా రామచంద్రుడు బంగారు రేకులతో అలంకరించిన పెద్ద విల్లును, సూర్యకాంతికల బాణాలను చేతిలో ధరించి బయల్దేరాడు. మార్గమధ్యంలో పూల బరువుతో వంగిన చెట్లను, తేటనీటి నదులను, వ్యాకులపడే వృక్షాలను, వాటంగా ఉన్న పర్వత ప్రదేశాలను, కాంతివంతమైన కొలకులను, కనె్నలేళ్లను, హంసలను, బెగ్గురులను, వంచలాలను, నీటికోళ్లను, చక్రవాకాలను, విశేషంగా ధ్వనించే మడుగులను, లేతపచ్చిక మేస్తూ విహరించే జింకలను, కారుమబ్బుల్లా ఉన్న తటాకాలను, ఒంటరిగా తిరుగుతున్న ఏనుగులను చూసుకుంటూ, వేగంగా అడుగులు వేసుకుంటూ పోతూ, శ్రీరాముడు చెట్లగుంపులుగా ఉన్న ఒక వనాన్ని చూసి సుగ్రీవుడితో ఇలా అన్నాడు.
‘‘ఆకాశంలో వాన మబ్బులాగా, చాలా నల్లగా, నాలుగు పక్కలా వ్యాపించి, సుందరమైన అరటి చెట్లు రాసులు - రాసుల్లాగా ఉండి, మిక్కిలి సంతోషం కలిగిస్తున్న ఈ వనం విషయం చెప్పు.’’ జవాబుగా, నడక సాగిస్తూనే, సుగ్రీవుడు చెప్పాడిలా రాముడికి ఆ తోట కథను.
‘‘సప్తజనులనే పేరు కల ఋషీశ్వరులు ఏడుగురు నేల మీద తల మోపి ఇక్కడ తపస్సు చేస్తూ, ఏడు రోజులకు ఒకసారి గాలిని మాత్రమే ఆహారంగా తీసుకుంటూ, నీళ్లలో ఉంటూ, ఏడు వందల సంవత్సరాలు మహానిష్టగా ఘోర తపస్సు చేసి, దేహంతో స్వర్గానికి పోయారు. వాళ్ల తపోమహిమ వల్ల ప్రాకారంలాగా చుట్టబడిన చెట్లున్న ఈ వనాన్ని దేవతలు కానీ, రాక్షసులు కానీ, చూడడానికైనా భయపడతారు. ఈ వనంలోకి పక్షులు, అడవి మృగాలూ ప్రవేశించలేవు. ఒకవేళ ప్రవేశిస్తే కలవరపాటుతో ఇక్కడ ఎనే్నళ్లయినా తిరగాల్సిందే కానీ, బయటకు పోలేవు. ఇక్కడ ఆభరణ ధ్వనులు, సంతోషకరమైన గీతాలు, వాద్యాల - తూర్యాల ధ్వనులు, వారి సల్లాపాలు వినపడతాయి. దేవతా సంబంధమైన పరిమళ వాయువు వీస్తుంది. అక్కడ చూడు... త్రేరాగ్నులు వెలుగుతున్నాయి. గాలి వల్ల ఎగురుతున్న పొగ గుంపు చెట్ల కొమ్మల మీద ఎర్రటి కాంతితో మెరుస్తున్నది. పొగతో కప్పబడిన పై భాగాలతో ఈ అడవిలోని వృక్షాలన్నీ మేఘాల కాంతితో కప్పబడిన వైడూర్య పర్వతాల్లాగా ఉన్నాయి. రామచంద్రా! నువ్వు తమ్ముడితో సహా మునీశ్వరులకు నమస్కారం చేయి. ఈ మునులకు మొక్కిన వారికి వ్యాధులు అంటవు.’’
సుగ్రీవుడిలా చెప్పగా రామచంద్రమూర్తి లక్ష్మణుడితో కలిసి నమస్కారం చేసి, త్వరగా ఆ ప్రదేశాన్ని దాటిపోయాడు. ఆ తరువాత వాలిని సంహరించాలన్న ఆసక్తితో ఉన్న శ్రీరాముడు వాలి పాలించే కిష్కింధను చూశాడు. ఈ విధంగా అందరూ వాలి పాలించే నగరానికి సమీపంలో దట్టమైన అరణ్య ప్రదేశంలో చెట్ల గుంపులున్న ఒక మరుగైన స్థలంలో నిలబడ్డారు.
సుగ్రీవుడి భయం పోవడానికి ఉత్సాహపు మాటలు చెప్పిన శ్రీరాముడు
సుగ్రీవుడు అమితమైన రోషంతో తన మెడ ఎత్తి, నలుదిక్కులా చూసి, గాలివాన వచ్చినప్పుడు మేఘాలు ఎలా గర్జిస్తాయో అలా సింహనాదం చేశాడు. ఆ తరువాత కార్యసాధనలో అత్యంత సమర్థుడైన రామచంద్రమూర్తికి వానరుల వలతో చుట్టబడి, యంత్రాలతో రక్షించబడుతున్న కిష్కింధా నగరాన్ని చూపిస్తూ, అక్కడకి చేరుకున్నామని అంటాడు. రామచంద్రమూర్తి తనకు చెప్పిన మాట సఫలం చేయడానికి తగిన సమయం వచ్చిందని కూడా చెప్పాడు.
సుగ్రీవుడి మాటలకు జవాబుగా రామచంద్రమూర్తి, ‘‘సుగ్రీవా!నీ మెడలో లక్ష్మణుడు వేసిన గజపుష్ప మాలికతో నువ్వు నక్షత్రాలతో చుట్టబడిన నిండు చంద్రుడిలాగా ప్రకాశిస్తున్నావు. పగలు చుక్కలతో కూడిన సూర్యుడు ఎలా రాష్ట్ర ప్రభువును వధిస్తాడో అలాగే నువ్వు కూడా పుష్పమాలికతో వెలుగుతూ వాలిని చంపుతావు. భయపడవద్దు. వాలి వల్ల నీకు కలిగిన భయాన్ని ఒక్క బాణంతో తొలగిస్తాను. నిన్ను, తన సోదరుడిని బాధించే వాలిని నాకు కనబడేట్లు చేయి చాలు. అంతటితో వాలి చచ్చాడని నమ్ము. ఈ మాటలతో ప్రయోజనం లేదు. వాలి మళ్లీ నాకు కనబడి, జీవిస్తే, అప్పుడు నన్ను నిందించు. అప్పటిదాకా నువ్వు నన్ను నిందించడం ధర్మం కాదు. ఇంతకు ముందు ఏడు మద్దిచెట్లను ఒకేఒక్క బాణంతో నేలకూల్చడం నీ కళ్లారా చూశావు కదా? వాలి కూడా ఇప్పుడు అలాగే చంపబడుతాడు. నన్ను నమ్ము. నాకు ఎన్ని ఆపదలొచ్చినా ఉత్తమ ధర్మాన్ని విడవడానికి నా మనసు అంగీకరించదు. కాబట్టి, ఇంతకు ముందు నేను అసత్యం ఆడనూ లేదు... ఇక ముందు ఆడేదీ లేదు. ఇది నిజం. నీకు భయం వల్ల కలిగిన తొట్రుపాటును వదిలిపెట్టు. నా ప్రతిజ్ఞ నేను నెరవేరుస్తాను. నీ మనసులోని భయం, అనుమానం వదిలిపెట్టు. నా ప్రతిజ్ఞ నేను నెరవేరుస్తాను. నీ మనసులోని భయం, అనుమానం వదిలిపెట్టు. ఎలాంటి సింహనాదం నువ్వు చేస్తే, కోపంతో మండిపడుతూ, వాలి యుద్ధానికి వస్తాడో, అలాంటి సింహనాదం చేయి’’ అని అంటాడు.
వాలిని యుద్ధానికి పిలవడానికి సింహనాదం చేసిన సుగ్రీవుడు
ఇలా రామచంద్రమూర్తి స్పష్టంగా తనకు చెప్పిన మాటలు విన్న సుగ్రీవుడు, ఉరుములాగా గర్జిస్తూ, తన కంఠధ్వనిని దిక్కులు పిక్కటిల్లేట్లు చేశాడు. గుండెలు పగిలేలా సుగ్రీవుడు చేసిన సింహనాదాన్ని, ఆయన కఠోరమైన కంఠధ్వనిని విన్న ఆవులు, వానరులు దిక్కుతోచక పరుగెత్తాయి. మృగాలూ పరుగెత్తాయి. పక్షులు ఆకాశాన్నుండి నేల కూలాయి. మేఘం ఉరుములాగా సుగ్రీవుడి కంఠధ్వని క్షణ క్షణం పెరగసాగింది. అది పెద్ద గాలితో లేచిన అలల సముద్ర ధ్వనిని పోలి ఉంది.
-సశేషం
*
-వనం జ్వాలా నరసింహారావు
80081 370 12
*
పుస్తకం దొరుకు స్థలం: శ్రీ కోదండరామ సేవక ధర్మసమాజం, అంగలకుదురు, తెనాలి మండలం, గుంటూరు జిల్లా 7036558799 08644-230690