శ్రీమదాంధ్ర వాల్మీకి రామాయణం

మారీచుడిని తోడు రమ్మని బలవంతంగా ఒప్పించిన రావణుడు (అరణ్యకాండ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రావణుడు మారీచుడితో నిష్ఠూరాలు పలుకుతూ ఇలా అన్నాడు. ‘ఓరీ! మారీచుడా! నినె్నవడురా ఈ కథలు చెప్పమని అడిగాడు? చవిటి నేలలో విత్తనాలు చల్లినట్లు నోరెండగా ఎందుకురా ఇలా వాగావు? రాముడు మనుష్యుడు. మూర్ఖుడు. పాపాత్ముడు. అలాంటి వాడిని నాతో సమానం అనుకొని యుద్ధానికి పోతానా? ఆ విషయంలో నేను అనుకున్నట్లు చేయడాన్ని నివారించగల శక్తి నీకున్నదా? నీతో అది అవుతుందని అనుకుంటున్నావా? ఒక ఆడదాని వ్యర్థ ప్రలాపాలను విని, రాజ్యాన్ని, తల్లిని, తండ్రిని, హిత సమూహాన్ని వదిలి అడవులకు వచ్చిన వాడెంత బుద్ధిహీనుడో? ఇలాంటి వాడిని నువ్వు గొప్పవాడంటున్నావే? నువ్వెంత బుద్ధిహీనుడివి? నువ్వు చూస్తుండగానే, నీ కళ్లెదుటే ఖరుడిని చంపినా రాముడి ప్రియ భార్య సీతను పట్టి తెస్తాను. నేను నిశ్చయించిన దాన్ని మార్చడం నీకు సాధ్యమా?’
‘ఇంద్రుడు, ఆయన దేవతా సమూహం అన్నీ కలిసినా, నా ప్రయత్నాలను కొంచెం కూడా అడ్డుకోలేరు. అలాంటిది నువ్వా నన్ను దిద్దేవాడివి? ఏమీ నీ అహంకారం? ఏది మంచో, ఏది చెడో అనే విషయం రాజు అడిగినప్పుడు మాత్రమే బతుకు మీద ఆశ గల మంత్రి చేతులు జోడించుకుని, వినయంగా తన మనస్సులో వున్నా సంగతి ఉపాయంగా చెప్పాలి. అది కూడా ఎలా చెప్పాలి? చెప్పే మాట ప్రభువుకు మేలు చేసేదిగా ఉండాలి. మెత్తటి మాటలు చెప్పాలి. పరుష పదజాలం వాడొద్దు, ప్రతికూలంగా చెప్పకూడదు. అనుకూలంగా చెప్పాలి. శుభకరమైన మాటలతో విషయాన్ని అలంకారంగా, రాజుకు ఇష్టం కలిగించేలా చెప్పాలి. గౌరవ యోగ్యుడైన రాజు మానం విడిచిన మాటలు అవెంత శుభకరమైనవైనా, ఎంత పెద్దవాడు చెప్పినా, పట్టించుకోడు. మారీచుడా! నీ తమ్ములందరూ చచ్చినా చావనీ! నీ చెల్లెలి ముక్కు చెవులు కోసినా కోయనీ! నాకేంటి? అని వూరికే ఇంట్లో కూర్చోమంటే ఆ అవమానాన్ని సహించి, మానం కోల్పోయి, నువ్వు చెప్పావని ఎలా ఊరుకుంటాను?’
‘రాజైన వాడికి వాసవుడి లాగా విక్రమం, అగ్నిలాగా దీక్షత, చంద్రుడి లాగా సంతోషకరత్వం, యముడిలాగా దండం, వరుణుడిలాగా ప్రసన్నత్వం ఉంది, ఆయా సమయాల్లో అవసరమైన విధంగా ఉపయోగిస్తే పూజ్యుడవుతాడు. బుద్ధిహీనుడా! నేనొక పని చేద్దామని నీ సహాయం కోరితే, అది రాచధర్మం అని తెలుసుకోకుండా, తెలివిలేక, ఏవేవో పనికిరాని మాటలు ఇంతసేపు చెప్పావు. ఈ విషయంలో కీడు - మేలు గురించి నినె్నవడురా అడిగింది? ఈ పనిలో నీ సహాయం కావాలిరా అంటే ఏదేదో వాగావెందుకు? నువ్వు నాకు చేయాల్సిన సహాయం గురించి చెప్తా విను. వెండి చుక్కలు కల బంగారు జింకగా మారు. రామాశ్రమం దగ్గర సీత ఎదురుగా సంచరించు. నీ వ్యవహారం చూసి నువ్వు నిజమైన జింక అని నమ్మి, ఆశ్చర్యపడి, సీతాదేవి నిన్ను పట్టుకొని రమ్మని మగాడిని పంపుతుంది. నువ్వు ఆ రాముడిని దూరంగా తీసుకుపోయి అక్కడ జానకీ! లక్ష్మణా! అని చనిపోయేవాడి గొంతుతో రాముడు గొంతులా అనిపించేట్లు బిగ్గరగా అరువు. అది రాముడి గొంతని నమ్మి సీత భయంతో రాముడిని చూసి రమ్మని లక్ష్మణుడిని పంపుతుంది.’
‘అన్న మీద ప్రేమతో లక్ష్మణుడు రాముడిని వెతకడానికి పోతాడు. ఆ రాజకుమారులు ఇరువురూ లేనప్పుడు రాముడి భార్యను అపహరించి భార్యగా చేసుకొని సుఖపడతాను. ఈ మాత్రం సహాయం నువ్వు చేసి నీ ఇష్టం వచ్చిన చోటుకు వెళ్లు. నీకు నా రాజ్యంలో సగమిస్తాను. పని పూర్తి కావడానికి నువ్వు ముందు పో. నీ వెనకాలే నేను రథం మీద వస్తాను. రాముడిని మోసం చేసి సీతను అపహరించి, యుద్ధమనేది లేకుండా సుఖంగా కొంచెం సేపట్లోనే ఇంటికి పోతాను. నువ్వు దీనిని చేయకపోతే నిన్ను ఇప్పుడే చంపుతాను. అలా కాకుండా నేను చెప్పింది నీకు అంగీకారమైతే నేను చెప్పినట్లే చేయి. అలా కాదని, నీకిష్టం లేదంటావా.. నీ చేత బలవంతంగానైనా చేయిస్తాను. తప్పదు కాబట్టి తెలివి తెచ్చుకో. రాజులను విరోధించి మాట్లాడేవారు సుఖపడతారా? నేను చెప్పినట్లు అక్కడికిపోతే చావడం సందేహం... తప్పించుకోవచ్చు కూడా. ఇక్కడ ఇలానే వాగుతుంటే నా చేతిలో నీవు చావు తథ్యం. అక్కడికి పోవడం మేలో, లేదా ఇక్కడ చావడం మేలో, ఆలోచించి తగిన విధంగా చేయి.’
రావణుడిలా రాజులాగా ఆజ్ఞాపించడం విన్న మారీచుడు, నిష్ఠూరంగా, ఆయన మాటలకు విరుద్ధంగా, ప్రతికూలమైన మాటలతో ఇలా జవాబిచ్చాడు. ‘కొడుకులతో, సేవకులతో, మంత్రులతో, స్నేహితులతో సహా అందరికీ కీడు కలిగించే ఈ దుష్ట కార్యాన్ని చేయమని నీకు చెప్పిన నీచుడెవడు? వాడు నీచుడు కాబట్టి తానూ చెడక నువ్వు చెడిపోయేట్లు చెప్పాడు నీకు. ఉత్తముడైతే ప్రత్యక్షంగానే నీతో విరోధించి వుండేవాడు. నువ్వు సుఖంగా ఉండడం చూడలేక పాడుపని చేయమని ఉపాయంగా చెప్పి, నీకు మృత్యుదేవత నోరు చూపించాడు. నిన్ను యుద్ధంలో జయించలేని నీ శత్రువులు, ఈ విధంగా నిన్ను బలవంతుడితో యుద్ధానికి దింపి, నీ చెడు కోరుకుంటున్నారు. అది నువ్వు తెలుసుకోలేక పోతున్నావు. నీకు మేలు చేసేవాడిలాగా నటిస్తూ, ఎవడో దుష్టుడు, నువ్వు చేయబోయే పాప కార్యంతో నువ్వే నశించాలని కోరుకుంటున్నాడు.’
‘నీకు వేగులెలాగూ లేరు. మంత్రులు కూడా లేరా? వాళ్లైనా నువ్వు చేసే పని తప్పని చెప్పలేదా? అలా నీ మేలుకోరి చెప్పని మంత్రులున్నా లాభం ఏమిటి? లేకున్నా ఏం లాభం? వారింకా బతికే వున్నారా? వక్రమార్గంలో పోయే రాజును సరిదిద్దని మంత్రులున్నా చచ్చినా ఒకటే. వాళ్లు బతికుంటే చివరికి కీడే కలుగుతుంది. రాజు సుగుణ సంపత్తి, నిర్మలమైన మనసు కలవాడైతే మంత్రులు ధర్మార్థకామాలు కలిగి ధర్మం చేస్తారు. ధనం సంపాదిస్తారు. కామాన్ని అనుభవిస్తారు. రాజలాంటి వాడు కాకపోతే, మంత్రులకు ధర్మార్థ కామాలుండవు. ప్రజలు దుఃఖపడతారు. రాజు బాగుంటే విజయం, ధర్మం, ప్రజలకు కలుగుతుంది. ఆ కారణానే, రాజు సర్వవేళల రక్షింపబడటానికి అర్హుడు. అలా కాకుండా రాజు క్రూర దండనం, ఇంద్రియ లోలత్వం, జన విరుద్ధత కలవాడైతే ప్రజలను ఎలా పాలిస్తాడు? ఇక మంత్రులు క్రూరమైన ఉపాయాలు చెప్తే రాజుతో వారు కూడా నశిస్తారు. భూజనులకు విరుద్ధమైన మనస్సు కలవాడై రాజు రాజ్యం ఏలుతే, లోకులు రాజువల్లే చెడిపోతారు. కాబట్టి రాజును సరైన మార్గంలో పెట్టాల్సిన విధి మంత్రులది, ప్రజలది. రాజలా వుండకపోతే వాడిని తొలగించి మరొకడిని రాజుగా చేయాలి. ప్రజల కొరకు రాజు కాని, రాజు కొరకు ప్రజలు కాదు.’
‘ఆకస్మికంగా, నిర్నిమిత్తంగా నాకు ఈ చెడ్డ కీడు కలిగిందని నేను దుఃఖపడటం లేదు. చెప్పినా తెలుసుకోలేక, సర్వసైన్యంతో సహా నువ్వు చెడిపోతున్నావే అని నీ కోసం బాధపడ్తున్నాను. నాకు కలగబోయే మరణానికి నేను శోకించడం లేదు. నన్ను చంపి రామచంద్రుడు వెంటనే నిన్నూ చంపుతాడు. ఇది నిజం. పరమ పాపాత్ముడవైన నీ చేతిలో చావడం కంటే, నీ శత్రువైన పరమ పుణ్యాత్ముడు రాముడి చేతిలో చస్తే ధన్యుడనవుతాను. నువ్వు చెప్పినట్లు నేను చేస్తే నాకెందుకు రాముడి వల్ల భయమంటావేమో? నువ్వు చెప్పిన వేషం వేసుకుని నేనెప్పుడైతే పోతానో, అప్పుడే రాముడు ఇది నా వంచన అని తెలుసుకుంటాడు. ఎప్పుడైతే వంచన అనీ, దుష్ట భావం వుందనీ భావిస్తాడో, అప్పుడే చంపక మానడు. నేను పోవడమంటే చావడమే! ఆయన కళ్లకు కనబడ్డ దాకే నా జీవితం. ఇక్కడ నేనొక్కడినే చస్తాను. నువ్వేమో సీతను అపహరించుకుని పోయి బంధువులతో సహా చస్తావు. ఇది నమ్ము. నన్ను చంపించి నువ్వు బతకడం కల్ల. సీతాదేవిని ఎత్తుకుపోతే అందరూ నాశనమే! నీ మేలు కోరి రావణా, నీకు హితమైన దాన్ని బోధిస్తుంటే నా మాటలు అలక్ష్యం చేస్తున్నావు. అయ్యో! నినే్నమి అనగలను? మృత్యువుకు వశపడి చావాల్సిన వాడు స్నేహితులు చెప్పే మంచి మాటలు వింటాడా?’
-సశేషం

పుస్తకం దొరుకు స్థలం: శ్రీ కోదండరామ సేవక ధర్మసమాజం, అంగలకుదురు, తెనాలి మండలం, గుంటూరు జిల్లా 7036558799 08644-230690

-వనం జ్వాలా నరసింహారావు 80081 370 12