రాష్ట్రీయం

విదేశాల్లోనూ విస్తృతంగా చర్చించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 28: భారతదేశ రాజకీయల్లో గుణాత్మక మార్పుకోసం ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తున్నామని, ఈ అంశంపై తెలంగాణకు చెందిన ఎన్నారైలు ఆయా దేశాల్లో తెలుగువారు, భారతీయులతో చర్చించాలని సీఎం కే. చంద్రశేఖరరావు కోరారు. వివిధ దేశాలకు చెందిన ఎన్నారై ప్రతినిధులతో ప్రగతి భవన్‌లో శనివారం సమావేశమయ్యారు. అందరితో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ భాతరదేశ ప్రజల అజండా రూపొందించడంలో తెలంగాణ నాయకత్వం చేస్తోన్న కృషిని విదేశాల్లోని భారతీయులకు వివరించాలని కోరారు. తెలంగాణ బిడ్డలుగా ఉద్యమానికి ఎలాంటి సహకారం అందించారో, నేడు భారతదేశ బిడ్డలుగా దేశ భవిష్యత్తు కోసం జరుగుతున్న ప్రయత్నాల్లో భాగస్వాములు కావాలని పిలుపు ఇచ్చారు. ప్రపంచంలోని వివిధ దేశాల్లో నివసిస్తున్న తెలంగాణ బిడ్డల సంక్షేమం కోసం 100 కోట్ల రూపాయలు రాష్ట్ర బడ్జెట్‌లో కేటాయించామని కేసీఆర్ గుర్తు చేశారు. ఎన్నారైల సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక సెల్ ఏర్పాటు చేస్తున్నామని, 50 కోట్ల రూపాయలు ఇస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. ఎన్నారైల సమస్యలపై అధ్యయనం చేసి, ప్రత్యేక సెల్ ఏర్పాటు తదితర అంశాలపై కార్యాచరణ రూపొందించాలని సమావేశంలో పాల్గొన్న మంత్రి కే. తారకరామారావు, ఎంపీ కవితను సీఎం కోరారు. అసాధ్యమనుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని సాధించామని, అద్భుతమైన ప్రగతి సాధిస్తున్నామని సీఎం ఎన్నారైలకు వివరించారు. కేవలం నాలుగేళ్లలోనే తెలంగాణ దేశంలోనే నెంబర్‌వన్‌గా నిలిచిందన్నారు. దేశ పరిస్థితి బాగాలేదని, ఇతర దేశాలతో పోలిస్తే చాలా వెనుకబడి ఉన్నామన్నారు. దేశంలో 70 వేల టీఎంసీ జలాలు అందుబాటులో ఉందని, ఇందులో 40 వేల టీఎంసీ నీటిని వాడుకుంటే 40 వేల కోట్ల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. ఈ పనిని కేంద్రంలో అధికారంలో ఉన్న రాజకీయ పార్టీలు చేయలేకపోయాయన్నారు. అలాగే కేంద్ర బడ్జెట్ 24.47 లక్షల కోట్ల రూపాయలుగా ఉండగా, ఇందులో 8.70 లక్షలకోట్లు అప్పుల కిస్తీలకు పోతోందని, 10 లక్షల కోట్లు ఉద్యోగుల జీతభత్యాలకు పోతోందన్నారు. ఐదారు లక్షల కోట్లు కేంద్ర ప్రాయోజిత పథకాలకు పోతోందని, మరో రెండు మూడు లక్షల కోట్ల రూపాయలు ఉంటే 120 కోట్ల జనాభా సంక్షేమానికి సరిపోతుందా? అంటూ కేసీఆర్ ప్రశ్నించారు. దేశంలో అనేక సమస్యలున్నాయని, వీటిని పరిష్కరించేందుకు ప్రయత్నాలు జరగడం లేదని వాపోయారు. భారత్‌ను ఆనుకుని ఉన్న చైనా ప్రబలమైన ఆర్థిక శక్తిగా నిలుస్తోందని, మనమెందుకు ఆ విధంగా మారడం లేదో ఆలోచించాలన్నారు. అనేక అంశాల్లో మన దేశం వెనుకబడి ఉందని, ఇందుకు కారణం ఇప్పటి వరకు ఎక్కువ కాలం అధికారంలో ఉన్న కాంగ్రెస్, బీజేపీలేనని పేర్కొన్నారు.
ఇప్పటికీ నరేంద్రమోదీపై ప్రజలకు కోపం వస్తే రాహుల్ గాంధీ ప్రధాని అవుతారు, దాని వల్ల దేశానికి ఏం మేలు జరుగుతుంది, ఎలాంటి మార్పు సాధ్యమవుతుందని ప్రశ్నించారు. దేశం పరిస్థితి పూర్తిగా మారాలంటే ప్రజల అజండా తయారు కావాలన్నారు. ఈ దేశానికి ఏం కావాలో, దేశం ఏ విధంగా అభివృద్ధి సాధించాలో, ఎలాంటి మార్గదర్శకం అవసరమో ఆలోచిస్తున్నానని తెలిపారు. అన్ని కోణాల్లో ఆలోచించి దేశ ప్రజల కోసం అజండా రూపొందిస్తామన్నారు. వివిధ రాజకీయ పార్టీలు సహకరిస్తే దేశంలో గుణాత్మక మార్పు వస్తుందన్నారు. దేశంలో మార్పు కోసం భారత పౌరుడిగా ప్రయత్నం ప్రారంభించానని స్పష్టం చేశారు. దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పుకోసం జరుగుతున్న ప్రయత్నాలపై విదేశాల్లో చర్చ జరపాలని కేసీఆర్ ఎన్‌ఆర్‌ఐలకు సూచించారు. ఈ సమావేశంలో మంత్రులు కేటీఆర్, నాయిని నర్సింహారెడ్డి, ఎన్‌ఆర్‌ఐ సమన్వయకర్త రమేష్ బిగాల, ఎంపీ కవిత, ఎమ్మెల్యేలు ఎర్రబెల్లి దయాకర్‌రావు, గణేష్ గుప్తా, శ్రీనివాస్ గౌడ్, ప్రశాంతరెడ్డి తదితరులు పాల్గొన్నారు.