రాష్ట్రీయం

స్థానిక పోరు లేనట్టే!?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 30: తెలంగాణలో గ్రామ పంచాయతీలకు సకాలంలో ఎన్నికలు జరుగుతాయా? కొద్దికాలంగా రాష్ట్రంలో చర్చనీయాంశ అంశమిది. నిజానికి టెర్మ్ ప్రకారం ఎన్నికలు నిర్వహించే ఆలోచనవుంటే, ఈ పాటికి ఎన్నికల ఏర్పాట్లు, హడావుడి కనిపించి ఉండేది. కాని పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఎలాంటి హడావుడి ఇప్పటి వరకు లేకపోవడంతో ఇప్పట్లో ఎన్నికలు జరుగుతాయా? అన్న అనుమానం బలపడుతోంది. సర్పంచ్ స్థానాలతో పాటు వార్డుసభ్యుల స్థానాల రిజర్వేషన్ (ఎస్సీ, ఎస్టీ, బీసీ)కి సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటనా వెలువడలేదు. రిజర్వేషన్ విధానం ఖారారు కాకుండా ఎన్నికలు జరిగే ప్రసక్తే లేదు. ప్రస్తుత సర్పంచ్‌లు, వార్డుసభ్యుల పదవీ గడువు 2018 ఆగస్టుతో ముగుస్తోంది. నెలరోజుల ముందు (జూలైలో) ఎన్నికలు జరిగితే, పాత పాలక మండలి గడువు పూర్తికాగానే కొత్త పాలక మండళ్లు బాధ్యతలు స్వీకరించేందుకు వీలవుతుంది. అంటే 2018 జూలైలోగా ఎన్నికలు జరగాల్సి ఉంది. ఎన్నికలు నిర్వహించాలంటే రాష్ట్ర ఎన్నికల సంఘం (స్టేట్ ఎలక్షన్ కమిషన్) కనీసం రెండు నెలల ముందే ఎన్నికల ఏర్పాట్లు, నోటిఫికేషన్ జారీ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం రిటైర్డ్ ఐఏఎస్ అధికారి వి. నాగిరెడ్డి కమిషనర్‌గా ఉన్న రాష్ట్ర ఎన్నికల సంఘం ఏ క్షణంలోనైనా ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం ఉండటంతో ప్రభుత్వం ముందు జాగ్రత్త పడింది. ప్రభుత్వాన్ని (రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి) సంప్రదించకుండా ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయవద్దని ఎన్నికల సంఘానికి ప్రభుత్వం ఇటీవలే లేఖ రాసింది. ఒకవేళ ఎన్నికలు నిర్వహించాలంటే రాష్ట్ర ప్రభుత్వ సహాయ, సహకారాలు లేకుండా ఎన్నికలు నిర్వహించడం ఈసీకి సాధ్యం కాదని స్పష్టం చేశారు. ఎన్నికల నిర్వహణకు అవసరమైన పోలింగ్, రక్షణ (పోలీసు) సిబ్బందిని సమకూర్చడం, నిధులు కేటాయింపు, ఇతరత్రా వౌలిక సదుపాయాల వంటి అంశాలు రాష్ట్ర ప్రభుత్వ బాధ్యతంటూ గుర్తు చేస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) గ్రామ పంచాయతీ ఎన్నికలు సకాలంలో నిర్వహించేందుకు సిద్ధంగా ఉందా? అన్నది చర్చనీయాంశం. పంచాయతీ రాజ్ చట్టంలో ఇటీవల చేసిన మార్పులపైనా బలమైన చర్చే సాగుతోంది. గ్రామ పంచాయతీ సర్పంచ్ పోస్టుకు ఎన్నికలు గతంలో నేరుగా జరిగేవి. అంటే ఆయా గ్రామాల ప్రజలు తమకు ఎవరు సర్పంచ్‌గా ఉంటారో నేరుగా ఓటు వేసి గెలిపించేవారు. ఇది ప్రత్యక్ష ఎన్నికల విధానం. చట్టంలో చేసిన మార్పుతో ప్రజలు ఈ హక్కును కోల్పోయారు. గ్రామ పంచాయతీ సభ్యులే సర్పంచ్‌ను ఎన్నుకోవాలంటూ చట్టాన్ని రూపొందించారు. అంటే పరోక్ష విధానం తీసుకువచ్చారు. ప్రజలు ఎన్నుకునే వార్డు సభ్యులే కాకుండా ప్రభుత్వం మరో ముగ్గురిని వార్డు సభ్యులుగా నామినేట్ చేస్తుంది. రాష్టవ్య్రాప్తంగా ఉన్న గ్రామ పంచాయతీ సర్పంచ్‌లలో మెజారిటీ సంఖ్య తెరాస పార్టీకి చెందిన వారే ఉండాలన్న ఉద్దేశంతో పరోక్ష ఎన్నికలకు వెళుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. పైగా 2019 ప్రారంభంలో శాసనసభ, లోక్‌సభలకు సాధారణ ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలో గ్రామ పంచాయతీ ఎన్నికలు ఇప్పుడు జరిగితే తెరాసకు ఇవి ‘సెమీఫైనల్స్’గా ఉంటాయని అంతా భావిస్తున్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికలు రాజకీయ పార్టీలకు అతీతంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. గ్రామాల్లో ప్రజాప్రతినిధులంతా ఏదో ఒక పార్టీలో కొనసాగుతూనే ఉంటారు. సర్పంచ్‌గా ఎన్నికయ్యే వ్యక్తి ఏ రాజకీయ పార్టీకి చెందని వాడయ్యే అవకాశం ఏకోశానా లేదు. పంచాయతీ ఎన్నికలు జరిగిన రోజే లెక్కలు వేసి ఎన్ని పంచాయతీల్లో తెరాస విజయం సాధించిందో మీడియానే ప్రకటించేస్తుంది. రాజకీయ పార్టీలు కూడా తమ పార్టీకి ఎన్ని సర్పంచ్ స్థానాలు, ఎన్ని వార్డు సభ్యుల స్థానాలు లభించాయో వెల్లడిస్తాయి. వచ్చే ఏడు సాధారణ ఎన్నికలు జరిగే నేపథ్యంలో తెరాస గ్రామపంచాయతీ ఎన్నికలకు ఇప్పడే వెళ్లేందుకు ఆలోచించడం లేదని తెలిసింది. అందుకే సర్పంచ్‌ల గడువు ముగిస్తే ప్రత్యేక అధికారులను నియమించేందుకు ఏర్పాట్లు చేస్తోందని సమాచారం. ఈ పరిస్థితిలో గ్రామ పంచాయతీ ఎన్నికలపై ఇప్పటివరకు ఎలాంటి స్పష్టత రాలేదు. భారత రాజ్యాంగానికి జరిగిన 73వ సవరణ ప్రకారం ప్రతి ఐదేళ్లకు ఒకసారి స్థానిక సంస్థలకు ఎన్నికలు జరగాలి. రాజ్యాంగానికి విలువ ఇచ్చేట్టయితే పంచాయతీ ఎన్నికలు వెంటనే చేపట్టాల్సి ఉంటుంది.