ఆంధ్రప్రదేశ్‌

రూ. 200 కోట్ల బకాయిలు చెల్లించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లోని చిన్న దేవాలయాల అర్చకుల సంక్షేమం, వేతనాల కోసం తిరుమల తిరుపతి దేవస్థానాలు (తితిదే) బకాయిపడ్డ 200 కోట్ల రూపాయలు వెంటనే విడుదల చేయాలని ఎపి అర్చక సమాఖ్య ప్రధాన కార్యదర్శి అగ్నిహోత్రం ఆత్రేయబాబు, కార్యదర్శి పెద్దింటి రాంబాబు డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం ఇక్కడ ఒక ప్రకటన విడుదల చేస్తూ, చిన్న ఆలయాల్లో పనిచేసే అర్చకులకు వేతనాలు చెల్లించేందుకు, విద్య, వైద్యం, గృహనిర్మాణం తదితర సంక్షేమ కార్యక్రమాల కోసం ఏర్పాటైన నిధికి ప్రభుత్వం తన వాటాగా 100 కోట్ల రూపాయలు విడుదల చేసిందన్నారు. చట్టం ప్రకారం తితిదేవస్థానాల పాలక మండలి 200 కోట్ల రూపాయలు విడుదల చేయాల్సి ఉందన్నారు. పేద అర్చకుల కోసం తితిదే తన వాటాను విడుదల చేయకపోవడం పట్ల వారు ఆవేదన వ్యక్తం చేశారు. 2016 మార్చి 31 లోగా ఈ బకాయిలను విడుదల చేయకపోతే, తితిదే పాలక మండలి సమావేశం ముందు నిరసన తెలియచేస్తామని ఆత్రేయ బాబు, రాంబాబు హెచ్చరించారు.

పోలీసులపైకి రాళ్లు
రువ్విన ఎర్రకూలీలు

అయిదుగురికి గాయాలు
ఆరుగురు కూలీల అరెస్టు

ఆంధ్రభూమి బ్యూరో
తిరుపతి, ఫిబ్రవరి 24: తిరుపతి శివారు మంగళం సమీపంలో ఉన్న రిక్షాకాలనీ పరిసరాల్లోని అటవీప్రాంతాల్లో కూంబింగ్ చేస్తున్న టాస్క్ఫోర్స్ పోలీసులపై ఎర్రకూలీలు బుధవారం రాళ్లు రువ్వారు. ఈ సంఘటనలో ఐదుగురు పోలీసులు గాయపడ్డారు. ఐనప్పటికి పోలీసులు వారిని వెంటాడగా ఆరుగురు పట్టుబడ్డారు. మరో 14మంది అడవిలోకి పారిపోయారు. పారిపోయిన వారి కోసం కూంబింగ్ ముమ్మరం చేశారు. కాగా పట్టుబడ్డ వారిలోతిరువణ్ణామలైకి చెందిన ఎస్.జె.రాజ(45), వి.గోపాల్ (47), కె.శేఖర్ (47), జి. ఆనంద్(19), ఎ.వెంకటేష్(35), ఆర్ముగం(33) ఉన్నారు. వీరి నుంచి 5 బియ్యం బస్తాలను, గొడ్డళ్ళు, రంపాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీరు ఎర్రచందనం చెట్లు నరకడానికి అడవిలో ప్రవేశించిన సమయంలోనే ఈసంఘటన చోటుచేసుకుంది.

ఎసి బోగి కింద మంటలు

ఎక్స్‌ప్రెస్ రైలుకు తృటిలో తప్పిన ముప్పు

గూడూరు, ఫిబ్రవరి 24: నెల్లూరు జిల్లా గూడూరు రైల్వే స్టేషన్ సమీపంలో బుధవారం రాత్రి 7 గంటల సమయంలో వారాంతపు ప్రత్యేక ఎక్స్‌ప్రెస్ రైలు ఎసి బోగి కింద మంటలు చెలరేగాయి. దీంతో ప్రయాణికులు గమనించి డ్రైవర్‌కు, గార్డుకు సమాచారం అందించడంతో గూడూరు రైల్వే స్టేషన్ 3వ ప్లాట్ ఫారం మీద రైలును ఆపారు.
సంబంధిత విద్యుత్ శాఖ సిబ్బంది వెంటనే మంటలను అదుపు చేశారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ మంటలు వ్యాపించాయని భావిస్తున్నారు. ప్రయాణికులు అప్రమత్తం అవడంతో తృటిలో పెద్ద ప్రమాదం తప్పింది. యశ్వంతపూర్ నుండి హౌరాకు వెళ్లే వారాంతపు ప్రత్యేక రైలు గూడూరు సమీపంలోకి రాగానే రైలు చక్రాల కింద మంటలు వ్యాపించడంతో వెంటనే ప్రయాణికులు గమనించి డ్రైవర్‌ను అప్రమత్తం చేశారు. గూడూరులో రైలును నిలిపి వేశారు. వెంటనే సిబ్బంది మరమ్మతులు చేసిన అనంతరం తిరిగి పంపేయడంతో రైలు ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.

రైలు చక్రాల వద్ద మంటలు రావడంతో
గూడూరు రైల్వేస్టేషన్‌లో ప్లాట్‌ఫారంపై దిగేసిన ప్రయాణికులు

విద్యుత్ శాఖ ఎఇ
ఇళ్లల్లో ఏసిబి సోదాలు

కోటిన్నర అక్రమ ఆస్తుల గుర్తింపు
మార్కెట్ విలువ రూ.7కోట్లకు పైమాటే
కాల్‌మనీ వ్యాపారంలోనూ దిట్ట

విజయవాడ (క్రైం), ఫిబ్రవరి 24: విద్యుత్ శాఖ అసిస్టెంట్ ఇంజనీరు అక్రమ ఆస్తులపై అవినీతి నిరోధక శాఖాధికారులు బుధవారం సోదాలు నిర్వహించారు. విజయవాడ, కృష్ణా జిల్లా పరిసరాల్లో పలుచోట్ల ఇళ్లలో ఏకకాలంలో అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో ప్రభుత్వ లెక్కల ప్రకారం సుమారు కోటిన్నర విలువ చేసే ఆదాయానికి మించి ఆస్తులను ఆయన కూడబెట్టినట్లు గుర్తించారు. వీటి విలువ మార్కెట్ ధర ప్రకారం సుమారు రూ.7కోట్ల వరకు ఉంటుందని అంచనా. కాగా సదరు అధికారి కాల్‌మనీ వ్యాపారం చేస్తున్నట్లు సోదాల్లో వెలుగుచూసింది. ఇతనికి చెందిన ఓ బొలేరో వాహనాన్ని విద్యుత్ శాఖలోనే అద్దెకు తిప్పుతూ సొమ్ము చేసుకుంటున్నట్లు వెల్లడైంది. కృష్ణా జిల్లా గుడివాడ సమీపంలోని దోసపాడుకు చెందిన బోడపాటి వెంకట్రావ్ ప్రస్తుతం అసిస్టెంట్ ఇంజనీరుగా విజయవాడ మధురానగర్ ఏపిఎస్‌పిడిసిఎల్ ఆపరేషన్స్ సబ్‌స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్నాడు. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టినట్లు వచ్చిన ఫిర్యాదులపై కేసు నమోదు చేసిన ఏసిబి అధికారులు డిఎస్పీ నేతృత్వంలో గుడివాడ, దోసపాడు, మధురానగర్‌లోని సబ్‌స్టేషన్ కార్యాలయం, ఆయన నివాసముంటున్న మాచవరం డౌన్‌లోని అపార్ట్‌మెంట్‌లపై ఏకకాలంలో దాడులు నిర్వహించారు. గొల్లపూడిలో త్రిబుల్ బెడ్‌రూం ఇల్లు ఒకటి, దోసపాడులో నాలుగు ఎకరాల వ్యవసాయ భూమి, మూడు ఇళ్లస్థలాలు, ఒక షిఫ్టు కారు, ఒక బొలేరో వాహనం, ఒక బుల్లెట్, మరో మోటారు బైక్, అరకిలో బంగారం, కాల్‌మనీ వ్యాపారానికి సంబంధించి 36ఖాళీ పత్రాలు, 42లక్షల విలువైన నాలుగు ఒరిజినల్ టైటిల్ డీడ్ ఆస్తుల పత్రాలు గుర్తించారు. ఈ ఆస్తులన్నీ ఇతనితో పాటు భార్య, కుమార్తె పేరుతో ఉన్నట్లు గుర్తించారు. నిందితుడిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చనున్నట్లు డిఎస్పీ గోపాలకృష్ణ వివరించారు.

యడ్లపాడులో భారీ అగ్నిప్రమాదం

కోల్డ్ స్టోరేజ్‌లో 35 వేల మిర్చి టిక్కీలు ఆహుతి నష్టం అంచనా రూ.14 కోట్లు

యడ్లపాడు, ఫిబ్రవరి 24: గుంటూరు జిల్లా యడ్లపాడులోని సిఆర్ కోల్డ్‌స్టోరేజ్‌లో బుధవారం జరిగిన అగ్నిప్రమాదంలో 35 వేల మిర్చిటిక్కీలు అగ్నికి ఆహుతయ్యాయి. ప్రాథమిక అంచనా ప్రకారం 14 కోట్ల రూపాయలకు పైగా నష్టం వాటిల్లినట్లు సమాచారం. అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించినా మంటలు అదుపులోకి రాలేదు. బుధవారం సాయంత్రానికి కూడా అగ్నిమాపక సిబ్బంది తమ ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉన్నారు. వేలాది మంది సాక్షిగా కోరలుచాచిన అగ్నిజ్వాలలు కోల్డ్‌స్టోరేజ్ మొత్తాన్ని దగ్ధంచేశాయి. ఈ ప్రమాదంలో నష్టం దాదాపు 14 కోట్ల రూపాయల వరకు ఉండవచ్చని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ఇందులో ఐటిసి వారికి చెందిన 30 వేల టిక్కీలు ఉన్నట్లు ఆ సంస్థ జిఎం వెంకటరామిరెడ్డి తెలిపారు. మిగిలిన 5 వేల టిక్కీలు రైతులకు చెందినవని కోల్డ్‌స్టోరేజ్ యజమాని కె రమేష్‌చంద్ర తెలిపారు. చిలకలూరిపేట, నరసరావుపేట, గుంటూరు, తెనాలి, ప్రాంతాల నుండి వచ్చిన అగ్నిమాపక యంత్రాలకు తోడు గ్రామీణ రక్షిత మంచినీటి సరఫరా వ్యవస్థకు చెందిన 18 వాటర్‌ట్యాంకర్లు కోల్డ్‌స్టోరేజ్‌లో మంటలు ఆర్పేందుకు కృషి చేస్తున్నాయి. అగ్నిమాపకశాఖ జిల్లా అధికారి జిలాని, ఎఎఫ్‌ఒ రత్నబాబు, చిలకలూరిపేట సిఐ దిలీప్‌కుమార్, యడ్లపాడు ఎస్‌ఐ ఉమామహేశ్వరరావు, నాదెండ్ల ఎస్‌ఐ సుబ్బానాయుడు, పోలీసు సిబ్బంది కోల్డ్‌స్టోరేజ్ వద్దకు వచ్చిన వందలాది మంది రైతులను అదుపుచేశారు. మొత్తం మిర్చి టిక్కీలకు వేర్వేరు కంపెనీల వారికి ఇన్స్యూరెన్స్ చేసినట్లు కోల్డ్‌స్టోరేజీ యజమాని తెలిపారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు.
నేనే చెల్లిస్తా...
కోల్డ్‌స్టోరేజ్‌లో దగ్ధమైన రైతుల మిర్చి టిక్కీలకు ఈ రోజు మార్కెట్ ధర ప్రకారం మొత్తం తానే చెల్లిస్తానని, రైతులు ఆందోళన చెందాల్సిన పనిలేదని కోల్డ్‌స్టోరేజ్ యజమాని కె రమేష్‌చంద్ర హామీ ఇచ్చారు. కోల్డ్‌స్టోరేజ్‌లో అగ్నిప్రమాదం విషయం తెలుసుకున్న రైతులు పెద్దసంఖ్యలో కోల్డ్‌స్టోరేజ్ వద్దకు రావడంతో బుధవారం ఉదయం కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అయితే పోలీసుల జోక్యంతో, కోల్డ్‌స్టోరేజ్ యజమాని హామీతో రైతులు శాంతించారు.

తగలబడుతున్న మిర్చి కోల్డ్ స్టోరేజీ