ఆంధ్రప్రదేశ్‌

పర్యాటకమే ప్రాణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హిందూపురం: రాష్ట్రంలో పర్యాటకరంగ పురోభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నట్టు సిఎం చంద్రబాబు పేర్కొన్నారు. అభివృద్ధి, సంక్షేమంతోపాటు పర్యాటక రంగం పురోభివృద్ధి అవసరమన్నారు. ప్రభుత్వం పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసేందుకు కంకణం కట్టుకుందన్నారు. అనంతపురం జిల్లా లేపాక్షిలో శనివారం రాత్రి నంది ఉత్సవాలను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అధ్యక్షతన జరిగిన భారీ బహిరంగ సభలో సిఎం మాట్లాడుతూ లేపాక్షి విశిష్టతను ఈ ఉత్సవాల ద్వారా ప్రపంచానికి చాటిచెబుతామన్నారు. కరవు కాటకాలతో తల్లడిల్లుతున్న అనంతపురం జిల్లాలో లేపాక్షితోపాటు పెనుకొండ, తిమ్మమ్మ మర్రిమాను, పుట్టపర్తి తదితర పర్యాటక కేంద్రాలు ఉన్నాయన్నారు. లేపాక్షికి పూర్వ వైభవం తెస్తామన్నారు. జిల్లాలో పర్యాటక రంగ అభివృద్ధికి తక్షణమే రూ.25 కోట్లు మంజూరు చేస్తున్నట్టు హర్షధ్వానాల మధ్య సిఎం ప్రకటించారు. పర్యాటక రంగ అభివృద్ధి ద్వారా హోటళ్లు, రహదారుల విస్తరణవంటి వౌలిక సదుపాయాలు మెరుగుపడే అవకాశాలు ఉన్నాయన్నారు. కూచిపూడి అభివృద్ధికి 100 కోట్లతో నాట్యారామం నిర్మిస్తున్నట్టు సిఎం చెప్పారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేకున్నా పర్యాటక రంగ అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. విశాఖ, అరకు, గండికోట, కాకినాడల్లో పెద్దఎత్తున ఉత్సవాలు నిర్వహించామన్నారు. లేపాక్షిలో రెండు రోజులపాటు వైభవంగా నంది ఉత్సవాలను నిర్వహించేందుకు రూ.4.60 కోట్లు మంజూరు చేసినట్టు చెప్పారు.
గతంలో రతనాలసీమగా పేరుగాంచిన రాయలసీమ వర్షాభావ పరిస్థితుల వల్ల అన్ని విధాలా వెనుకబడిందన్నారు. అయితే రాయలసీమకు పూర్వ వైభవాన్ని తీసుకొచ్చేందుకు అహర్నిశలూ శ్రమిస్తానన్నారు. ఇందులో భాగంగా వ్యవసాయ భూములు అధికంగా ఉన్న రాయలసీమలో పండ్ల తోటల పెంపకానికి అవసరమైన నిధులు మంజూరు చేస్తామన్నారు. రాయలసీమను పండ్లతోటల హబ్‌గా తీర్చిదిద్దేందుకు తెలుగుదేశం ప్రభుత్వం కంకణం కట్టుకుందని అన్నారు. హంద్రీ-నీవా సుజల స్రవంతి పథకాన్ని ఏడాదిలోగా పూర్తిచేసి ప్రతి చెరువుకు నీరందిస్తామన్నారు. హంద్రీనీవా పూర్తయితే అనంతపురంతోపాటు కర్నూలు, కడప, చిత్తూరు జిల్లాలు సస్యశ్యామలం అవుతాయన్నారు. గతంలో మహానేత ఎన్టీఆర్ హయాంలో తెలుగుదేశం ప్రభుత్వం హంద్రీనీవా, గాలేరు, తెలుగుగంగ ప్రాజెక్టుల నిర్మాణానికి కృషి చేసిందన్నారు. అయితే కొన్ని కారణాల వల్ల గత పాలకులు వాటిని విస్మరించారన్నారు. పెండింగ్ ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తిచేసే బాధ్యత తాను తీసుకుంటానన్నారు. కర్నాటక ప్రభుత్వం సైతం హెచ్‌ఎల్‌సి ఆధునీకరణకు సహకరిస్తోందన్నారు. హంద్రీనీవా, హెచ్‌ఎల్‌సిలు పూర్తయితే రాయలసీమ మళ్లీ రతనాల సీమగా తయారవుతుందన్నారు. మంచి కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్న తెదేపా ప్రభుత్వానికి అన్ని విధాలా అండగా నిలవాలని చంద్రబాబు కోరారు. అనవసరంగా రాష్ట్రంలో ప్రజల నడుమ చిచ్చుపెడుతున్న పార్టీలకు గుణపాఠం చెప్పాలన్నారు. రాష్ట్ర విభజన సక్రమంగా జరగకపోవడం, హేతుబద్దీకరణ లేకపోవడం, రాజధాని కూడా లేకపోవడం తదితర కారణాలతో ఇబ్బందుల్లో ఉన్న నవ్యాంధ్రప్రదేశ్‌ను 2029 నాటికి ప్రపంచంలోనే అగ్రగామిగా నిలబెట్టడమే తెదేపా ప్రభుత్వ ధ్యేయమన్నారు. ఆగస్టు 12 నుండి జరిగే కృష్ణా పుష్కరాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తామని చంద్రబాబు తెలిపారు. లేపాక్షి నంది ఉత్సవాలను వైభవోపేతంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకున్న ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణను సిఎం చంద్రబాబు ప్రశంసించారు. కార్యక్రమంలో కేంద్ర మంత్రి అశోకగజపతిరాజు, అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు, మంత్రులు పల్లె రఘునాథరెడ్డి, పరిటాల సునీత, ఎంపి నిమ్మల కిష్టప్ప, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

చిత్రం... లేపాక్షి నంది ఉత్సవాల్లో జ్యోతి ప్రజ్వలన చేస్తున్న సిఎం చంద్రబాబు