రాష్ట్రీయం

గోదావరి, పెన్నా కలుపుతా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, జూన్ 3: నవ్యాంధ్రప్రదేశ్‌ను కరవురహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. నవనిర్మాణ దీక్షలో భాగంగా రెండవ రోజు ఆదివారం కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరిలో గ్రామసభ నిర్వహించి ‘నీరు-ప్రగతి, కరవు రహిత రాష్ట్రం’ అంశంపై గ్రామస్థులతో చర్చించారు. అలాగే గ్రామంలోని బీసీ, ఎస్సీ కాలనీల్లో ప్రజల ఇళ్లకు వెళ్లి వారితో కొద్దిసేపు మాట్లాడారు. అనంతరం బహిరంగ సభ వేదిక వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ఎక్కడైనా నీరుంటేనే ప్రగతి సాధ్యమని తాను గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే గుర్తించానన్నారు. ఆ రోజుల్లో ‘నీరు-మీరు’ కార్యక్రమం చేపట్టి ఇంకుడు గుంతలు తవ్వించే పనిని ప్రారంభించానని గుర్తుచేశారు. ఆ తర్వాత పదేళ్ల కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నీటి గురించి మరచిపోయి రాష్ట్రాన్ని కష్టాలపాలు చేశారని విమర్శించారు. తిరిగి తాను అధికారంలోకి వచ్చిన తర్వాత 2014 నుంచి నీటి సంరక్షణకే పెద్దపీట వేస్తున్నానన్నారు. ఇందులో భాగంగా దేశంలో కేంద్ర ప్రభుత్వంతో పాటు అనేక రాష్ట్ర ప్రభుత్వాలు నదుల అనుసంధానం గురించి మాట్లాడుతుంటే తాను కృష్ణా-గోదావరి నదులను అనుసంధానం చేసి చూపించి అందరికీ ఆదర్శంగా నిలిచానన్నారు. తద్వారా సుమారు 150 టీఎంసీల నీటిని గోదావరి నుంచి కృష్ణా డెల్టాకు తీసుకుపోయామన్నారు. గోదావరి జలాల ద్వారా కృష్ణాలో మిగిలిపోయిన 150 టీఎంసీలలో 145 టీఎంసీల నీటిని రాయలసీమకు అందించి ఇక్కడి కరవును పారదోలే ప్రయత్నం చేశామన్నారు. ఇక తాను గోదావరి-పెన్నా నదుల అనుసంధానంపై దృష్టి పెట్టానని సీఎం చంద్రబాబు వెల్లడించారు. ఆ పని పూర్తయిన వెంటనే గోదావరి-కృష్ణా-పెన్నా నదులను కూడా అనుసంధానించటం ద్వారా రాష్ట్రంలో ఏ మూలన ఓ ఎకరా భూమి ఉన్నా నీరందించడానికి ప్రతి వర్షపు చుక్కను, నదీ జలాలను, భూగర్భ జలాలను సద్వినియోగం చేసుకుంటామన్నారు. గత నాలుగేళ్లలో తమ ప్రభుత్వం కొత్తవి, పెండింగ్‌వి కలిపి 54 ప్రాజెక్టుల పనులు చేపట్టామన్నారు. ఇందులో 39 ప్రాజెక్టులు పూర్తికాగా, మరో 15 ప్రాజెక్టులు మాత్రం వివిధ దశల్లో ఉన్నాయని వివరించారు. ఇందులో భాగంగా చేపట్టిన పోలవరం ప్రాజెక్టును ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా 2019 డిసెంబర్
నాటికి పూర్తిచేసి తీరుతానని ధీమా వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పటికే 55 శాతం పనులు పూర్తికాగా, ప్రధానమైన డయాఫ్రం వాల్ నిర్మాణం చివరి దశకు చేరుకుందన్నారు. ఆ తర్వాత కాంక్రీట్, మట్టి పనులు మాత్రమే ఉంటాయని, వీటిని వీలైనంత త్వరగా పూర్తి చేసి అత్యధికంగా గోదావరి జలాలను కృష్ణా డెల్టాకు అందించే ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నట్లు తెలిపారు. పోలవరం ద్వారా మిగిలే ప్రతి చుక్క కృష్ణా జలాలను రాయలసీమకు అందించి ఇక్కడి కరవుకు శాశ్వత పరిష్కారం చూపిస్తానన్నారు. భూగర్భ జలాలను పెంచడం కోసం ‘పంట సంజీవని’ కార్యక్రమం ద్వారా 7.25 లక్షల పంట కుంటలను తవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, అందులో ఇప్పటికే 5 లక్షల పంట కుంటలను పూర్తి చేశామన్నారు. ఈ సందర్భంగా జొన్నగిరిలోనే పైలాన్‌ను ఆవిష్కరిస్తున్నట్లు వెల్లడించారు. గొలుసుకట్టు చెరువుల అభివృద్ధి, చెక్‌డ్యాంల నిర్మాణం లాంటి కార్యక్రమాలను పూర్తి చేస్తున్నామని, దీని వల్ల భూగర్భ జల నీటి మట్టం రాష్ట్రంలో సగటున 1.9 మీటర్ల మేర పెరిగిందన్నారు. దేశంలో ఎన్నో సమస్యలు ఉన్నాయని వాటిపై దృష్టి పెడుతూనే విభజన సమయంలో రాష్ట్రానికి ఇచ్చిన హామీలు గతంలో పొందుపరచిన అంశాలను అమలు చేయాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందన్నారు. ఈ విషయంపై గత నాలుగేళ్లుగా ఢిల్లీ చుట్టూ తిరిగి పలుమార్లు విన్నవించినా ఫలితం లేకపోవడంతో కేంద్రాన్ని నిలదీసి డిమాండ్ చేస్తూ ఆ ప్రభుత్వం నుంచి ఎన్‌డీఏ నుండి బయటకు వచ్చామన్నారు. దాంతో తనపై ఎదురుదాడికి దిగుతూ ఓ పక్క వైసీపీని, మరోపక్క జనసేనను వాడుకుంటూ రాష్ట్రాన్ని అస్థిరపరచాలని బీజేపీ కుట్రలు పన్నుతుందని మండిపడ్డారు. వైసీపీ నాయకులు తమ వ్యక్తిగత ప్రయోజనాల కోసం బీజేపీతో చేతులు కలిపి రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా కుట్రలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు ప్రత్యేక హోదా, రైల్వే జోన్ వంటి అంశాలపై తాము ధర్మపోరాట దీక్ష చేస్తే అలా చేయొద్దంటూ వైసీపీ తమపై పోరాటాన్ని ఉద్ధృతం చేసి నయవంచన దీక్ష పేరుతో కార్యక్రమాలు చేపట్టడం ఎంత వరకూ సమంజసం అని ప్రశ్నించారు. కొత్తగా రాజకీయాల్లోకి వచ్చి ప్రజా సమస్యలను తన దృష్టికి తీసుకొస్తూ వాటి పరిష్కారానికి కృషి చేస్తున్న పవన్‌కళ్యాణ్ అకస్మాత్తుగా తనపై ఎందుకు దాడి చేస్తున్నారో అర్థం కాని పరిస్థితి ఏర్పడిందన్నారు. ఇది చాలదన్నట్లు మరోవైపు తిరుమల తిరుపతి దేవస్థానంలో కొత్త కొత్త అనుమానాలను సృష్టించి ఎలాగైనా ఈ రాష్ట్రంలో అశాంతి, అలజడి సృష్టించి ప్రజల్లో అభద్రతా భావం కలిగించేందుకు బీజేపీ ప్రయత్నిస్తుందన్నారు. ఎవరు ఎలాంటి ప్రయత్నాలు చేసినా వాటిని సమర్థవంతంగా ఎదుర్కొంటామన్నారు. తమ పిచ్చి చేష్టలు మానుకోకపోతే బీజేపీ, వైసీపీ, జనసేనలకు ప్రజలే తగిన బుద్ధి చెబుతారని చంద్రబాబు హెచ్చరించారు. కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి, జల వనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, జిల్లా ఇన్‌చార్జి మంత్రి కాలవ శ్రీనివాసులు, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

చిత్రం..జొన్నగిరి చెరువులో జలహారతి ఇస్తున్న సీఎం చంద్రబాబు