రాష్ట్రీయం

కలిసిరానిది చంద్రబాబే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, జూన్ 3: రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించటమే తన లక్ష్యమని, అందుకే తమ పార్టీ ఎంపీలు ఏనాడో రాజీనామా చేశారని వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. అయితే అప్ప ట్లో చంద్రబాబు కూడా కలిసివచ్చి టీడీపీ ఎంపీలతో కూడా రాజీనామా చేయించి వుంటే కేంద్రం దిగివచ్చేదని, రాష్ట్రానికి హోదా ఇచ్చి ఉండేదని, అలాకాకుండా అప్పుడు కలిసిరాకుండా ఇప్పుడు వైసీపీ ఎంపీల రాజీనామాలు ఆమోదింప చేసుకుని ఎన్నికలకు రావాలని బాబు చెప్పుకోవటం అసంబద్ధంగా ఉందన్నారు. ఆ సమయంలో కలిసిరాకుండా ప్రజలను మోసం చేసిన చంద్రబాబు ఈరోజు కర్నూలులో తమ పార్టీ ఎంపీల రాజీనామాలపై మాట్లాడారని ఆక్షేపించారు. ప్రజాసంకల్పయాత్ర కొనసాగింపులో భాగంగా పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండలో ఆదివారం సాయంత్రం జరిగిన భారీ బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ఈసందర్భంగా కర్నూలులో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ వైసీపీ ఎంపీలు రాజీనామా చేసినప్పుడు కలిసిరాకుండా దానికి మించి తమ పార్టీకి చెందిన 23మంది ఎమ్మెల్యేలను సంతలో పశువుల్లా కొనుగోలు చేయటమే కాకుండా వారిలో నలుగుర్ని మంత్రులుగా కూడా చేశారన్నారు. దీనికి చంద్రబాబు సిగ్గుపడాలన్నారు. జూన్ 2న జరిగిన నవనిర్మాణ దీక్షలో చంద్రబాబు అసంబద్ధ ప్రమాణాలు
చేయించారని, అయన చెపుతున్నవన్నీ అబద్ధాలేనని పేర్కొన్నారు. పచ్చని పశ్చిమగోదావరి జిల్లాలో కూడా రైతులు వలస పోయే పరిస్థితి నాలుగేళ్ల చంద్రబాబు పాలనలో ఏర్పడిందని పేర్కొన్నారు. రాయలసీమకు వెడితే డెల్టాలో బంగారం పండిస్తున్నారని చంద్రబాబు చెపుతుంటారని, ఇక్కడకు వచ్చి రాయలసీమలో పంటలు బ్రహ్మండంగా పండిస్తున్నారని చెపుతుంటారని, అలా అక్కడ గ్యాస్ ఇక్కడ, ఇక్కడ గ్యాస్ అక్కడ కొడతారని ఎద్దేవా చేశారు. దాళ్వా పంటకు నీరు రావటం లేదని, అరకొర నీటిని వంతులవారీగా వదులుతున్నారని, దానివల్ల పంటలు దెబ్బతింటున్నాయని రైతులు వాపోతుంటే బాధ కలుగుతోందన్నారు. నాలుగేళ్లలో చంద్రబాబు ఒక్క పంటకైనా గిట్టుబాటుధర అందించారా అని ప్రశ్నించారు. అంతేకాకుండా ఇక్కడ దీర్ఘకాలంగా గోదావరిపై వశిష్ట వారధి పెండింగ్‌లో ఉండిపోయిందని, అయినా ఇక్కడ మంత్రి పట్టించుకోవటం లేదని ధ్వజమెత్తారు. అంతేకాకుండా చాలాగ్రామాల్లో మంచినీటి వసతి కూడా లేకుండాపోయిందని, కలుషిత నీరు ఇక్కడి ప్రజలు తాగాల్సి వస్తోందని, జిల్లాలో 15 నియోజకవర్గాల్లో టీడీపీని గెలిపించినందుకు జిల్లా ప్రజలకు చంద్రబాబు నీటికి బదులు చెరుకురసం ఇస్తున్నారంటూ వ్యాఖ్యానించారు. జిల్లాలో ఎన్ని సమస్యలున్నా చంద్రబాబు పట్టించుకోరని, వారి నాయకులది కూడా అదే పరిస్థితి అని చెప్పారు. అయినా దోపిడి మాత్రం యథేచ్ఛగా సాగిస్తున్నారని ఆరోపించారు. స్థానికంగా ఉన్న రెండు రీచ్‌ల నుంచి నాలుగేళ్లలో దాదాపు 300 కోట్ల రూపాయల విలువైన ఇసుకను తరలించారన్న ఆయన అందులో కలెక్టరు, ఎమ్మెల్యేలు, చినబాబు, ఆ తర్వాత పెదబాబు ఏ స్థాయిలో వాటాలు అందుకున్నారో అర్ధమవుతుందన్నారు. ఇంత దారుణమైన పాలన సాగుతుండగా పత్రికల్లో మాత్రం చంద్రబాబు రాష్ట్రాన్ని నెంబర్‌ఒన్ చేస్తానని ప్రకటనలు ఇచ్చారని, ఏ విషయంలో రాష్ట్రం నెంబర్‌వన్ అన్న చెప్పాలని ఆయన నిలదీశారు. బాబు పాలన మరో ఆరు, ఎనిమిది నెలల్లో అయిపోతుందని, అలాంటప్పుడు 2022, 2050 గురించి ఎలా మాట్లాడతారని ప్రశ్నించారు. ప్రత్యేకహోదాను అమ్మేయకుండా ఉండి ఉంటే రాష్ట్రం దేశంలోనే అత్యున్నత స్థానంలో ఉండేదన్నారు. ఇప్పుడున్న పరిస్థితి చూస్తే మాత్రం అత్యాచారాలు, రాజ్యాంగ ఉల్లంఘనలు, పార్టీ ఫిరాయింపుల ప్రోత్సాహం, రైతులపై అప్పులు పెంచటం, రాష్ట్రం అప్పులుపెంచటం విషయాల్లో చంద్రబాబు నెంబర్‌వన్‌గా నిలిచారన్నారు. మద్యం అమ్మకాల్లో ఎపి నెంబర్‌వన్‌గా ఉందన్నారు. చంద్రబాబు వయస్సు ఇప్పటికే 70 ఏళ్లు అని, మరీ ఆయన 2050 గురించి మాట్లాడుతుంటే ఆశ్చర్యం కలుగుతోందన్నారు. మా ఎంపీలు రాజీనామా చేసిన సమయంలో టీడీపీకి చెందిన 20మంది ఎంపీలు రాజీనామా చేసి ఉంటే రాష్ట్రానికి హోదా వచ్చేదని, అలా జరగకుండా ఉండటానికి చంద్రబాబు కారణం కాదా అని ఆయన ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుకు బుద్ధి చెప్పాలని ఆయన కోరారు.

చిత్రం..పెనుగొండ సభలో ప్రజలకు అభివాదం చేస్తున్న వైకాపా నేత జగన్