రాష్ట్రీయం

ఆశలు..అత్తిపత్తే...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 5: తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల్లో పత్తిరైతులు ప్రైవేట్ విత్తనోత్పత్తి సంస్థల చేతుల్లో నలిగిపోతున్నారు. పత్తిపంటపై బహుళజాతి విత్తనోత్పత్తి సంస్థ అయిన ‘మోన్‌శాంటో’ (అమెరికా సంస్థ) ఏకచ్ఛత్రాధిపత్యం చలాయిస్తోంది. మోన్‌శాంటో ముందు భారతీయ వ్యవసాయ శాస్తవ్రేత్తలు మోకరిల్లుతున్నారు. వరి, మొక్కజొన్న తదితర పంటలపై విస్తృత పరిశోధన చేస్తూ కొత్త తరహా విత్తనాలను విడుదల చేస్తున్న సేద్యం వర్సిటీ, అనుబంధ సంస్థలు పత్తిలో మాత్రం ఒక్కటంటే ఒక్క నాణ్యమైన, పురుగును తట్టుకునే శక్తికలిగిన సీడ్‌ను విడుదల చేయలేకపోయాయి.
మోన్‌శాంటో విడుదల చేసిన బిటి-2 (బిజి-2) పత్తి మినహా మరోరకమైన పత్తి రైతులకు అందుబాటులోకి రాలేదు. 2017 వానాకాలం సీజన్‌లో బిటి-2 పత్తివిత్తనాలు నిర్దేశిత గులాబిరంగు పురుగును తట్టుకోలేకపోయి లక్షలాది ఎకరాల్లో పంట నాశనమైంది. అనధికారిక సమాచారం ప్రకారం తెలంగాణలో దాదాపు 10,000 కోట్ల రూపాయల విలువైన పత్తిపంటను గత ఏడాది రైతులు కోల్పోయారు. సీజన్‌లో పత్తి బాగా పండితే రైతుల చేతికి 16 వేల కోట్ల రూపాయల నుండి 20 వేల కోట్ల రూపాయల వరకు చేరతాయి. బిటి-2 పత్తిపంట గులాబిరంగు పురుగు సోకి పూర్తిగా నష్టపోయాయి. గత ఏడాది పత్తిపంట దిగుబడి గణనీయంగా తగ్గడంతో రైతులకు అందాల్సిన మొత్తంలో సగానికి సగం ఆదాయం తగ్గిపోయింది.
తెలంగాణలోని వ్యవసాయ వర్శిటీకానీ, ఇతర రాష్ట్రాల్లోని వర్శిటీలుకాని మోన్‌శాంటో జారీ చేసిన బిటి-2 లేదా బిటి-3 లకు ప్రత్యామ్నాయంగా కొత్తతరహా పత్తివిత్తనాలు విడుదల చేయలేకపోయి. ధీటైన పత్తివిత్తనాన్ని రూపొందించడంలో ఇప్పటి వరకు వ్యవసాయ వర్శిటీలు విజయం సాధించకపోవడం పెద్దలోటుగా చెప్పుకోవచ్చు. ఈ యూనివర్సిటీలు వరిలో వందలాది రకాలు, మొక్కజొన్నలో పదుల రకాలు, ఇతరత్రా ఆహార పంటల్లో పదుల రకాల హైబ్రిడ్ లేదా ఇతర ఆధునిక విత్తనాలను విడుదల చేస్తున్నప్పటికీ, పత్తి విషయంలో మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు ప్రవర్తిస్తున్నాయి. మోన్‌శాంటో అందిస్తున్న బిటి కాటన్ సాంకేతిక పరిజ్ఞానాన్ని నూజివీడు, తులసి, రాశి, మహికో తదితర విత్తనోత్పత్తి సంస్థలు వినియోగించుకుని తమ సొంత హైబ్రిడ్ ద్వారా బిటి-2 రకం పత్తివిత్తనాన్ని రూపొందించి విక్రయిస్తున్నాయి. మోన్‌శాంటో ఇచ్చే సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటున్నందువల్ల మోన్‌శాంటోకు ఈ సంస్థలు ఏటా వందలాది కోట్లు ‘కప్పం’ (ట్రైట్ వ్యాల్యూ లేదా రాయల్టీ)గా చెల్లిస్తున్నాయి. భారతీయ పత్తికంపెనీలు 2018కి రూపొందించిన బిటి-2 పత్తి విత్తనాలకు ఈసారి ధర 740 రూపాయలుగా నిర్ణయించారు. ఒక ప్యాకేట్‌లో ఉండే 450 గ్రాముల బిటి-2 పత్తితో పాటు, 120 గ్రాముల నాన్-బిటి (రెఫ్యూజీ) విత్తనాలు కూడా ఉంటాయి. భారతీయ వర్శిటీలు బిటి కాటన్‌ను రూపొందించగలగితే ఒక పాకెట్ ధర 300 నుండి 400 రూపాయల మధ్య విక్రయించేందుకు వీలవుతుంది. అందుకే రైతుల సంక్షేమాన్ని, సామాజిక అవసరాలను దృష్టిలో ఉంచుకుని మన సేద్యం వర్శిటీలు పత్తిపై పరిశోధన చేస్తే బాగుంటుందన్న అభిప్రాయం వెల్లడవుతోంది.
దిక్కులేక వేస్తున్నాం: రైతు
ప్రైవేట్ సంస్థలు అమ్ముతున్న బిటి-2 పత్తివిత్తనాన్ని 2018 వానాకాలం సీజన్‌లో వేసేందుకు కొనుకోలు చేయడం మినహా మాకు (రైతులకు) మరో దిక్కులేదని వరంగల్‌కు చెందిన రైతు కే. లక్ష్మారెడ్డి తెలిపారు. గత ఏడాది బిటి-2 వేయగా, గులాబీరంగు పురుగు సోకి పంట చేతికిరాక తీవ్రంగా నష్టపోయానని ఆంధ్రభూమి ప్రతినిధితో చెప్పారు. వాస్తవానికి బిటి-2 పత్తికి గులాబీరంగు పురుగు సోకకూడదన్నారు. ప్రభుత్వం తరఫున బిటి రకాలు విడుదల కాకపోవడాన్ని ప్రైవేట్ సంస్థలు అడ్వాంటేజ్‌గా తీసుకుంటూ, రైతులను దోపిడీ చేస్తున్నాయని ఆయన వివరించారు.
సొంత విత్తనం వస్తుంది: సుదర్శన్
తెలంగాణ రైతులకు ఉపయోగపడే హైబ్రిడ్ సొంత పత్తివిత్తనం 3-4 ఏళ్లలో వస్తుందని తెలంగాణ వ్యవసాయ వర్శిటీ కాటన్ సీడ్ ప్రిన్సిపాల్ సైంటిస్ట్ డాక్టర్ సుదర్శన్ తెలిపారు. పత్తిపంటపై పరిశోధన జరుగుతోందన్నారు.
సబ్సిడీ ఇవ్వం: కేశవులు
పత్తిపంట వాణిజ్య పంట కావడంతో దీనికి సబ్సిడీ ఇవ్వబోమని తెలంగాణ రాష్ట్ర విత్తన ధృవీకరణ సంస్థ డైరెక్టర్ డాక్టర్ కే. కేశవులు తెలిపారు. ఆంధ్రభూమి ప్రతినిధితో మాట్లాడుతూ, ఇతర ఆహార పంటల విత్తనాలకు సబ్సిడీ ఇస్తున్నామని అయితే పత్తిపంటకు మాత్రం సబ్సిడీ ఇవ్వడం లేదన్నారు.
భవిష్యత్తులో అందిస్తాం: కొండబాల
పత్తి విత్తనాలను త్వరలోనే తమ సంస్థ ద్వారా వియ్రిస్తామని తెలంగాణ రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు తెలిపారు. ఆంధ్రభూమి ప్రతినిధితో మాట్లాడుతూ తమ సంస్థ ఈ ఏడాదే మొక్కజొన్న విత్తనాన్ని విక్రయించడం ప్రారంభించిందన్నారు. తర్వాత పత్తివిత్తనం విక్రయించే అంశాన్నీ పరిశీలిస్తామన్నారు.