రాష్ట్రీయం

తాతలనాటి ‘క్షేత్ర’ పోరాటం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగారెడ్డి: తాత, ముత్తాతల నుండి తరగని పంట దిగుబడులతో కుటుంబాలను పోషించుకుంటున్న ఆ గ్రామ రైతుల పాలిట ‘మల్లన్న సాగర్’ రిజర్వాయర్ నిర్మాణం గుదిబండగా మారింది. ‘తాతలనాటి క్షేత్రముల తెగనమ్మి, దోసిళ్లతో తెచ్చి పోసినానూ’ అన్న పద్యం పౌరాణిక నాటకాల్లో సుప్రసిద్ధ చింతామణిలో స్ర్తిలోలుడు తన బలహీనతను వెళ్లగక్కుకుంటాడు. ఇక్కడ మాత్రం అలాంటి వ్యసనాలకు బానిసలు కాకుండా సుఖమయ బతుకులు బతుకుతున్న పల్లెప్రజలు అలాంటి వెతలనే ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నారు. వారసత్వ సంపదను ఆదరువుగా చేసుకుని జీవిస్తున్న ఆ గ్రామ ప్రజలంతా సమష్టిగా ప్రభుత్వంపై అలుపెరుగని పోరాటానికి తెరలేపి రెండేళ్లు పూర్తి చేసుకుని మూడవ యేడాదిలోకి దిగ్విజయంగా అడుగుపెట్టారు. రాష్ట్రాన్ని సాధించిన నాలుగేళ్ల చిరుప్రాయంలోనే యావత్ దేశాన్ని ఆకర్షించే వివిధ సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అందరి మన్ననలు పొందుతున్న సీఎం కెసీఆర్.. ఆ గ్రామ ప్రజలను ఒప్పించడంలో విఫలమయ్యారు. అన్ని రకాల అండదండలుండినా నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్న ఎమ్మెల్యేకానీ, రాష్ట్ర స్థాయిలో తనకంటూ ఓ ఇమేజ్ ఉన్న మంత్రికానీ ఆ గ్రామంలో కాలుమోపే సాహసం గడచిన రెండేళ్లలో చేయలేకపోయారంటే గ్రామస్థుల ఐక్యతను చాటిచెప్పుతోంది. తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయానికి అవసరమైన సాగునీటిని అందించడానికి ప్రభుత్వం గోదావరి నదిపై నిర్మిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీటిని సరఫరా చేసేందుకు సంకల్పించింది. ఇందులో భాగంగా ఎత్తిపోతల ద్వారా నీటిని అందించడానికి సిద్దిపేట జిల్లా తొగుట, కొండపాక మండలాల పరిధిలో మల్లన్నసాగర్ రిజర్వాయర్ నిర్మించడానికి 2016 సంవత్సరంలో ప్రణాళికలు రూపొందించింది. ఈ రిజర్వాయర్ నిర్మాణంలో రెండు మండలాల్లో దాదాపు 14 గ్రామాల భూములు ముంపుకు గురికానున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ముందే 2013లో అప్పటి యూపీఏ ప్రభుత్వ హయాంలో 2013 భూ సేకరణ చట్టాన్ని ఆమోదించి మార్గనిర్దేశాలను అమలులోకి తీసుకువచ్చింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన భూ సేకరణకు బాధిత రైతులకు ఏకకాలంలో భూ నష్ట పరిహారాన్ని చెల్లించడానికి 123 జీఓను ప్రవేశపెట్టి ఎకరానికి ఆరు లక్షల చొప్పున కేటాయించింది. 123 జీవోను వ్యతిరేకిస్తూ రైతులు హైకోర్టును ఆశ్రయించగా కోర్టు సైతం జీవోను రద్దు చేయాలని సూచించడంతో 2017 భూ సేకరణ చట్టాన్ని తీసుకువచ్చింది. అయినా ఆ చట్టాన్ని కూడా రైతులు ససేమిరా అంటూనే ఉన్నారు. ఇందులో భాగంగా 2016 సంవత్సరంలో రెవెన్యూ అధికారులు భూ సేకరణ నిమిత్తం ముందుగా తొగుట మండలం ఏటిగడ్డకిష్టాపూర్ గ్రామానికి చేరుకోవడంతో చెల్లించే పరిహారంతో తాము తీవ్రంగా నష్టపోతున్నామంటూ రైతులు అధికారులను ప్రతిఘటించారు. ఈ క్రమంలో అధికారులతో వాగ్వాదానికి దిగడంతో పోలీసులు కల్పించుకుని రైతులపై బెదిరింపు చర్యలకు పాల్పడ్డారు. అదే గ్రామానికి చెందిన కొంతమంది నాయకులు ప్రభుత్వానికి వత్తాసు పలుకుతున్నారని సదరు నాయకుల ఇళ్లపై దాడులకుదిగి విధ్వంసానికి పాల్పడటంతో ఉద్యమం తారస్థాయికి చేరుకుంది. అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, మంత్రులు కల్పించుకుని నచ్చజెప్పే ప్రయత్నం చేసినా బెడిసికొట్టాయి. సంఘటితమైన రైతులకు ప్రతిపక్ష పార్టీలతో పాటు రైతు సంఘాలు, ప్రజాసంఘాలు, న్యాయవాదులు, ఉద్యోగ సంఘాలు, చివరకు తెలంగాణ జేఏసీ సైతం ఉద్యమానికి బాసటగా నిలిచి సంఘీభావం పలికాయి. ఇదేక్రమంలో ఆయా గ్రామాల ప్రజలు రచ్చబండల వద్ద రిలేనిరాహార దీక్షలను ప్రారంభించారు. తొగుట మండలం వేముగాట్ ప్రజలు కూడా రిలేదీక్షలను ప్రారంభించారు. ఈ ఆందోళన కార్యక్రమంలో వినూత్న నిరసన కార్యక్రమాలను నిర్వహించారు. ఉద్యమ కార్యక్రమాల్లో భాగంగా ప్రభుత్వానికి తమ నిరసనను వ్యక్తం చేసేందుకు రాజీవ్ రహదారి దిగ్బంధం కార్యక్రమం ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. రహదారి దిగ్బంధం కార్యక్రమానికి హాజరవుతున్న ప్రజలపై పోలీసులు లాఠీలు ఝుళిపించి విచక్షణారహితంగా చావాబాదారు. అదుపుతప్పున క్రమంలో గాల్లోకి కాల్పులు సైతం నిర్వహించారు. బాధితులను పరామర్శించడానికి ఎవరు కూడా వెళ్లకుండా గ్రామాల కూడళ్ల వద్ద పోలీసులు గస్తీ నిర్వహించి నిర్భందం చేసారు. లాఠీలు, బూటుకాళ్లతో కర్కశంగా తొక్కి కాళ్లు, చేతులు విరగ్గొట్టినా, గాల్లోకి కాల్పులు జరిపినా మొక్కవోని ధైర్యంతో అహింసాయుతంగా గాంధేయ మార్గంలో రాజీలేనిపోరాటం చేస్తూనే ఉన్నారు. ఆరంభంలో అన్ని గ్రామాల ప్రజలు ఉద్యమించిన ప్రభుత్వం కల్పించిన భయాలకు, ప్రలోభాలకు లొంగిపోయినా వేములగాట్ ప్రజలు మాత్రం నిరంతర పోరాటం చేస్తూ తమ ఆస్తులను రక్షించుకునేందుకు ఆరాటపడుతున్నారు. 2016 జూన్ 4వ తేదీన ప్రారంభమైన రిలేదీక్షలు రెండేళ్లు పూర్తిచేసుకుని ముచ్చటగా మూడవ యేడాదిలోకి అడుగుపెట్టుకున్నారు. అన్నదాతకు ఆపన్నహస్తం అందించడానికి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేసిన రైతుబంధు పంట పెట్టుబడి సాయానికి కూడా వేములగాట్ గ్రామ రైతులు నోచుకోకపోవడం దురదృష్టకరం. తమకు పంటపెట్టుబడి సాయం ఇవ్వకున్నా సరేకానీ తమ భూములను బలవంతంగా లాక్కోవద్దని గ్రామ రైతులు డిమాండ్ చేస్తున్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వ పదవి కాలం ఇంకా 362 రోజులు మాత్రమే మిగిలివుంది. వేములగాట్ మాత్రం పూర్తిస్థాయిలో భూసేకరణ కాలేదు. మిగిలిన పదవి కాలంలోగా గ్రామ రైతులను ఒప్పించి నూరు శాతం భూ సేకరణ చేయడం అన్నది ప్రభుత్వానికి తలకుమించిన భారంగానే కనిపిస్తోంది. తరతరాల ఆస్తులను కాపాడుకోవడంలో రైతులు విజయం సాధిస్తారా? సాగునీటి ప్రాజెక్టును నిర్మించడానికి అవసరమైన భూ సేకరణ చేయడంలో ప్రభుత్వం తన పంతాన్ని నెగ్గించుకుంటుందో వేచిచూడాల్సిందే.