రాష్ట్రీయం

సమ్మెచేస్తే ఇంటికే..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 7: సమ్మెకు దిగితే ఉద్యోగాల నుంచి తొలగిస్తామని, యూనియన్ నేతల మాటలు నమ్మి మోసపోవద్దని ముఖ్యమంత్రి కేసీఆర్ టిఎస్‌ఆర్టీసి సమ్మెపై తీవ్రంగా స్పందించారు. సమ్మెకు అంటూ పోతే ఆర్టీసిలో ఇదే చివరి సమ్మెగా మిగిలిపోతుందని హెచ్చరించారు. ఈ నెల 11 నుంచి సమ్మె చేస్తామని ఆర్టీసి గుర్తింపు కార్మిక సంఘం టిఎంయు, మిగిలిన కార్మిక సంఘాలు ప్రకటించడంతో సమ్మె నిర్వహణకు సన్నాహక ప్రక్రియ ప్రారంభమైంది. మరో వైపు శుక్రవారం సమ్మెపై రవాణా మంత్రి మహేందర్‌రెడ్డి శాఖ అధికారులు, యూనియన్ నేతలతో చర్చలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ పరిస్థితిలో సమ్మెపై కేసీఆర్ గురువారం ఉన్నత స్ధాయి సమీక్ష నిర్వహించారు. సమ్మె జరిగితే ఎదుర్కొనేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని, ప్రజలకు ఇబ్బంది తలెత్తకుండా చూడాలని ఆదేశించారు. ఈ సమీక్ష సందర్భంగా ఆర్టీసి కార్మిక సంఘాలపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఉద్యోగాలు పోగొట్టుకోవాలనుకునే వాళ్లే సమ్మెకు దిగాలని, ఉద్యోగాలు కావాలనుకునే కార్మికులు తాము సమ్మె చేయడం లేదని ఆర్టీసి యాజమాన్యానికి లిఖితపూర్వకంగా తెలియజేయాలని సూచించారు. అంతేకాకుండా యూనియన్ నేతల మాటలు విని మోసపోవద్దని, వాళ్లు ఆర్టీసి ముంచే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. సాలీనా 700 కోట్ల రూపాయల అప్పుతో ఆర్టీసి మనుగడ సాధిస్తుంటే సమ్మె నోటీసు ఇవ్వడం అసమంజసం, అసంబద్దమని, బాధ్యతారాహిత్యానికి నిదర్శనమని మండిపడ్డారు. సమ్మె చేస్తే ఇప్పుడు ఉన్న నష్టాలకు తోడు రోజుకు కోటిన్నర రూపాయాలు నష్టపోవాల్సి వస్తుందని అన్నారు. యూనియన్ నేతల అసమంజసమైన కోరికల వల్ల సాలీనా ఆర్టీసిపై మరో రూ.900 కోట్ల అదనపు భారం పడుతుందని సిఎం పేర్కొన్నారు. ఈ నేపధ్యంలో సమ్మెకు పోయి ఆర్టీసి కార్మికుల గొంతుకోసే దానికంటే సంస్థను ఎలా బలోపేతం చేసుకోవాలో యూనియన్ నేతలు ఆలోచించాలని హితవు పలికారు. ఈ సమీక్షలో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, ఆర్ధిక మంత్రి ఈటల రాజేందర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కె జోషి, డిజిపి మహేందర్‌రెడ్డి, రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి సునీల్ శర్మ, ఆర్టీసి ఎండి జివి రమణారావు తదితరులు పాల్గొన్నారు.
నేడు చర్చలు
రవాణా శాఖ అధికారులతో ఆ శాఖ మంత్రి పి.మహేందర్ రెడ్డి శుక్రవారం సచివాలయంలోని తన చాంబర్‌లో ఆర్టీసి సమ్మెపై చర్చించనున్నారు. అనంతరం ఆర్టీసి కార్మిక సంఘాలతోనూ మంత్రి చర్చలు జరపనున్నారు. ఆ మేరకు ఆర్టీసి యాజమాన్యం గురువారం వెల్లడించింది.