రాష్ట్రీయం

ఉద్ధృతంగా గోదావరి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, జూలై 13: గోదావరి వరద ఉద్ధృతి ఇంకా కొనసాగుతోంది. భద్రాచలం వద్ద 29.70 అడుగుల మట్టంలో వరద ఉద్ధృతి నిలకడగా సాగుతోంది. దీనితో తూర్పు గోదావరి జిల్లా ధవళేశ్వరం కాటన్ బ్యారేజి వద్ద వరద నీటి ప్రవాహ ఉద్ధృతి స్వల్పంగా పెరుగుతూ కొనసాగుతోంది. కాటన్ బ్యారేజి నాలుగు ఆర్మ్‌లలో వున్న మొత్తం 175 గేట్లను శుక్రవారం 0.70 మీటర్లకు ఎత్తి వేసి వరద జలాలను సముద్రంలోకి విడిచి పెట్టారు. శుక్రవారం ఉదయం బ్యారేజి నుంచి 3 లక్షల 9 వేల 948 క్యూసెక్కుల వరద జలాలను దిగువకు విడిచి పెట్టారు. దీనితో బ్యారేజి దిగువనున్న కోనసీమ లంక గ్రామాలను ముంపు భయం వెంటాడుతోంది. గోదావరి వరద దృష్ట్యా ధవళేశ్వరానికి ఎగువనున్న సీతానగరం, దేవీపట్నం, వి ఆర్ పురం, కూనవరం, ఎటపాక మండలాలను, దిగువనున్న మండలాలను అప్రమత్తం చేశారు. కోనసీమలోని మురమళ్ళ, టి. కొత్తపల్లి, తాళ్ళరేవు మండలం పిల్లంక, పి గన్నవరం, మామిడికుదురు మండలాల్లోని ఏటిగట్లపై పహారా కాస్తున్నారు. మరో రెండు మూడు రోజుల పాటు ప్రవాహ ఉద్ధృతి కొనసాగుతుందని అంచనావేస్తున్నారు.
రాజమహేంద్రవరం సమీపంలో ఏటిగట్లు ఆక్రమణలకు గురికావడంతో వెంకటనగరం నుంచి ధవళేశ్వరం వరకు గండ్లు పడే పరిస్థితి వుందని తెలుస్తోంది. రాజమహేంద్రవరంలో కైలాసభూమి నుంచి ధవళేశ్వరం సాయిబాబా గుడి వరకు ఆక్రమణలు పెరిగిపోవడంతో ప్రధాన ప్రవాహ గమనదిశ మారిపోయి గోంగూరలంక వద్ద గట్టు కోతకు గురయ్యే పరిస్థితి వుందని స్థానికులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఈ ప్రాంతంలో జల వనరుల శాఖ యంత్రాంగం పర్యవేక్షణ కొరవడింది. వరదల సమయంలో కీలకంగా బాధ్యతలు నిర్వహించే లస్కర్ల పోస్టులు దాదాపు అంతరించిపోవడంతో ప్రవాహ ఉద్ధృతి ఎప్పటికప్పుడు పసిగట్టలేని పరిస్థితి కనిపిస్తోంది.
సాగునీటికి తగ్గిన డిమాండు
ఉభయ గోదావరి జిల్లాల్లో విస్తారంగా వర్షాలు పడుతుండటంతో సాగునీటికి డిమాండు తగ్గిపోయ్యింది. చాలా ప్రాంతాల్లో వరి నారుమళ్లు నీట మునిగాయి. వర్షాలు తగ్గుముఖం పట్టకపోతే ఇప్పటికే ముంపులో వున్న నారుమళ్లకు నష్టం తప్పని పరిస్థితి నెలకొంది. తూర్పు డెల్టా పరిధిలోని పంట కాలువలకు గత 48 గంటలుగా సాగునీటి విడుదల నిలిపివేశారు. తూర్పు డెల్టాలోని 23 మండలాల పరిధిలో 2,81,303 ఎకరాల్లో ఖరీఫ్ సాగు జరుగుతోంది. మధ్యమ డెల్టాలో దిగువన వున్న ఉప్పలగుప్తం, అల్లవరం మండలాల్లోని కొన్ని ప్రాంతాల్లో గత నాలుగు రోజులుగా నారుమడులు నీటిలో నానుతున్నాయి. 2,01,896 ఎకరాల్లో ఖరీఫ్ సాగు జరుగుతున్న మధ్యమ డెల్టాకు 1000 క్యూసెక్కుల నీరు మాత్రమే విడుదల చేస్తున్నారు. 5,29,962 ఎకరాల అత్యధిక సాగు విస్తీర్ణం కలిగిన పశ్చిమ డెల్టాలో 563 కిలో మీటర్ల పొడవున 11 ప్రధాన కాలవలకు కేవలం 2000 క్యూసెక్కులు మాత్రమే విడుదలచేస్తున్నారు.
మిగిలిన లక్షలాది క్యూసెక్కుల వరద జలాలను నిల్వ సముద్రంలోకి విడుదల చేయాల్సిన పరిస్థితి కొనసాగుతోంది. కాటన్ బ్యారేజి నుంచి వచ్చిన నీటిని వచ్చినట్టుగా దిగువకు విడిచి పెడుతున్నారు. పట్టిసీమ ఎత్తిపోతల పథకంలోని 24 పంపుల నుంచి 8500 క్యూసెక్కుల వరద జలాలను తోడి కృష్ణా డెల్టాకు అందిస్తున్నారు.

చిత్రం..ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ నుండి దిగువకు వదిలేస్తున్న వరద జలాలు