రాష్ట్రీయం

గల్లంతైన వారికోసం విస్తృతంగా గాలింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమలాపురం, జూలై 15: తూర్పుగోదావరి జిల్లా ఐ పోలవరం మండలం పశువుల్లంక-సలాదివారిపాలెం మధ్య వృద్ధ గౌతమీ గోదావరి నదీపాయలో శనివారం సాయంత్రం పడవ బోల్తా పడిన దుర్ఘటనలో గల్లంతైన వారిలో ఒకరి మృతదేహం ఆదివారం సాయంత్రం లభ్యమయ్యింది. ఈ ప్రమాదంలో ఒక గృహిణితోపాటు ఆరుగురు విద్యార్థినులు గల్లంతైన సంగతి విదితమే. శనివారం రాత్రికే జాతీయ విపత్తుల నివారణ సంస్థ (ఎన్డీఆర్‌ఎఫ్)కు చెందిన బృందాలు ప్రమాదస్థలానికి చేరుకున్నప్పటికీ, వర్షం కురుస్తుండటం, నది ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో ఆదివారం ఉదయం నుండి గాలింపు చర్యలు చేపట్టారు. ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా, ఎస్పీ విశాల్ గున్ని, ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు తదితరులు ప్రమాద స్థలంలో మకాంచేసి, గాలింపు చర్యలను పర్యవేక్షించారు. జిల్లాకు చెందిన రాష్ట్ర అర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు సైతం సంఘటనాస్థలానికి వచ్చి, గాలింపు చర్యలను పర్యవేక్షించారు. 61మందితో కూడిన రెండు ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు, 50మందితో కూడిన రెండు ఏపీఎస్‌ఆర్‌ఎఫ్ బృందాలు, 74మంది ఎస్‌డీఆర్‌ఎఫ్ సభ్యులు, 46మంది అగ్నిమాపక సిబ్బంది, 12మంది నావికాదళానికి చెందినవారు, 12మంది మెరైన్ సిబ్బంది ప్రత్యేక పడవల్లో ఆదివారం ఉదయం నుండి గాలింపు చర్యల్లో పాల్గొన్నారు. వరద ఉద్ధృతి ఆదివారం మరింత పెరగడంతోపాటు ఉదయం నుండి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండటంతో గాలింపు చర్యలు చేపట్టిన బృందాలు విశేషంగా శ్రమించాల్సివచ్చింది. అయితే సాయంత్రం వరకు ఒక్కరి ఆచూకీ కూడా లభించలేదు. చివరకు సాయంత్రం 6.30 గంటల ప్రాంతంలో ఐ పోలవరం మండలం కొమరిగిరి వద్ద నదిలో గల్లా నాగమణి మృతదేహం లభించింది.
శోకతప్త హృదయాలతో తల్లిదండ్రులు
కాగా గల్లంతైన తమ చిన్నారుల ఆచూకీ దొరుకుందనే ఆశతో వారి తల్లిదండ్రులు శనివారం రాత్రి నుండీ ప్రమాదం జరిగిన ప్రాంతంలోనే వేచిచూస్తున్నారు. గల్లంతైన వారిలో కే గంగవరం మండలం శేరిల్లంకకు చెందిన ఒకే కుటుంబంలోని అక్కా చెల్లెళ్లు పోలిశెట్టి సుచిత్ర (6వ తరగతి), అనూష (9వ తరగతి), అదే కుటుంబానికి చెందిన పోలిశెట్టి మనీషా (10వ తరగతి) ఉండటంతో ఆ కుటుంబ సభ్యులను ఓదార్చడం ఎవ్వరితరం కావడంలేదు. అలాగే అదే గ్రామానికి చెందిన కొండేపూడి రమ్య (10వ తరగతి), సలాదివారిపాలెంకు చెందిన సుంకర శ్రీజ (10వ తరగతి), కమినికి చెందిన తిరుకోటి ప్రియ (8వ తరగతి)తో పాటు శేరిలంక చెందిన గృహిణి గెల్లా నాగమణి (28) ఉన్నారు. గల్లంతైన వారంతా లంక గ్రామాలకు చెందిన విద్యార్థులే కావడంతో ఆయా గ్రామాల్లో విషాద వాతావరణం నెలకొంది. చిన్నారులు గల్లంతయ్యారన్న వార్త తెలిసినప్పటి నుండి ఆదివారం మధ్యాహ్నం వరకూ అన్నపానీయాలు ముట్టకుండా లంక గ్రామాల వాసులు విషాదంలో మునిగిపోయారు.

చిత్రాలు..పడవ ప్రమాదానికి ముందు శనివారం పశువుల్లంక ఉన్నత పాఠశాలలో వనం-మనం ప్రతిజ్ఞలో పాల్గొన్న బాలికలు
*లభ్యమైన నాగమణి మృతదేహం

*పశువుల్లంకలో పరిస్థితిని సమీక్షిస్తున్న మంత్రులు రాజప్ప, యనమల