రాష్ట్రీయం

మోదీని నిగ్గదీయండి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, జూలై 18: కేంద్ర ప్రభుత్వంపై ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానం చర్చకు వచ్చేలోగా వ్యూహాత్మకంగా అడుగులు వేయాలని ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నిర్ణయించారు. వివిధ పార్టీల మద్దతుతో టీడీపీ ఎంపీలు బుధవారం లోక్‌సభలో ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై శుక్రవారం చర్చ జరగనున్న నేపథ్యంలో విభజన చట్టం ప్రకారం రాష్ట్రానికి రావాల్సిన కేటాయింపులు, మంజూరు కావాల్సిన సంస్థలు, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు ఇచ్చిన హామీల వివరాలన్నింటినీ సిద్ధం చేసుకోవాలని ఎంపీలు, మంత్రులను బుధవారం ఆయన టెలీకాన్ఫరెన్స్‌లో ఆదేశించారు. మరోవైపు సమాచారం సేకరించి ఎంపీలకు అందించే విషయమై సమాలోచనలు జరుపుతున్నారు. అవిశ్వాస తీర్మానం తెలుగుదేశం పార్టీకి ప్రతిష్టాత్మకంగా మారినందున కూలంకషంగా అన్ని అంశాలను ప్రస్తావించాలని సూచించారు. ఎంపీలకు అవసరమైన రికార్డులను కేంద్ర ప్రభుత్వ గణాంకాలతో సహా సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. రాత్రికే సమాచారం అందించాలన్నారు. ఢిల్లీ - ముంబయి ఇండస్ట్రియల్ కారిడార్‌కు ఎంతిచ్చారు? విశాఖ - చెన్నై కారిడార్‌కు ఎంత కేటాయించారు? దేశం మొత్తానికి వచ్చిన జైకా నిధులు స్వల్ప వడ్డీ ప్రయోజనం ఒక్క రాష్ట్రానికేనా? బుల్లెట్ ట్రైన్‌కే జైకా నిధులు పరిమితమా? కేంద్రం రాబడులకు రాష్ట్రాలు నష్టపోవాలా? ఇప్పటికే 16వేల లోటులో ఉన్న రాష్ట్రాన్ని మరింత నష్టాల్లోకి నెట్టటం ధర్మమేనా? ఇంకా రాష్ట్రానికి ప్రత్యేక హోదా, రాజధానికి కేటాయింపులు, విశాఖ రైల్వేజోన్, కడప ఉక్కు కర్మాగారం, దుగరాజపట్నం పోర్టు, తదితర అంశాలపై ప్రధాని మోదీని నిగ్గదీయాలని చంద్రబాబు ఎంపీలకు నిర్దేశించారు. ‘రాజమహేంద్రవరం విమానాశ్రయానికి రూ. 250కోట్ల విలువైన భూములిచ్చాం. విజయవాడలో వెయ్యికోట్ల విలువైన భూకేటాయింపులు జరిపాం. అయినా అమరావతికి అంతర్జాతీయ విమాన సర్వీస్‌లు నడపటంలో ఎందుకీ జాప్యమ’ని ప్రశ్నించాలన్నారు. రాజధానికి రూ. 50వేల కోట్ల విలువైన భూములు రైతులిస్తే మీరిచ్చిన 15వందల కోట్ల నిధులతో ఢిల్లీ తరహా రాజధాని నిర్మాణం సాధ్యమేనా?, రూ. 25వేల కోట్ల పెట్టుబడులపై 10 శాతం అంటే రూ. 2500 కోట్లు కేంద్రానికి ఏడాదిలో పన్నుల రూపంలో వస్తుందని, అయినా ఎందుకీ నిర్లక్ష్యమని నిలదీయాలన్నారు. ఎన్నికల ముందు తిరుపతి, అధికారంలోకి వచ్చాక అమరావతిలో ప్రధాని ఇచ్చిన హామీలను గుర్తు చేయాలన్నారు. వివిధ కార్యక్రమాలకు వచ్చిన సందర్భంగా కేంద్ర మంత్రులు చేసిన వాగ్దానాల రికార్డులను కూడా సేకరించాలన్నారు. సుప్రీంకోర్టులో కేంద్రం దాఖలు చేసిన అఫిడవిట్‌పై చర్చించి ఎండగట్టాలన్నారు. గత పార్లమెంట్ సమావేశాల సందర్భంగా యూపీఏను ఉద్దేశించి రాష్ట్ర విభజనపై మోదీ చేసిన వ్యాఖ్యల సారాంశం, హేతుబద్ధత లేని విభజనపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ అందించిన డాక్యుమెంట్లను కూడా అధ్యయనం చేయాలని సూచించారు. జాతీయ వ్యవసాయ విద్యాలయం, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్, ట్రైబల్, పెట్రోలియం విశ్వవిద్యాలయాలకు అనుమతుల విషయంలో కేంద్ర నిర్లక్ష్యాన్ని ఎలుగెత్తి చాటాలన్నారు. పోలవరం ప్రాజెక్టుకు ఇంకా రూ. 2200 కోట్లు రావాలని, రెండో డీపీఆర్‌కు ఆమోదం తెలపాల్సిందిగా డిమాండ్ చేయాలన్నారు. స్టాండర్డ్ ఎక్స్‌పెండిచర్ పేరుతో రెవెన్యూ లోటు భర్తీలో కోత విధించిన వైనాన్ని సభలో విశదీకరించాలన్నారు. అవిశ్వాసానికి ముందే మనం ఇతర పార్టీలను కలవడం మంచిదయిందని బాబు చెప్పారు. అన్ని పార్టీల ఎంపీలను సమన్వయం చేసుకొని పార్లమెంట్ చర్చలో రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై పూర్తిస్థాయిలో స్పందించాలని ఉద్బోధించారు. 14ఏళ్ల తరువాత కేంద్రం ఎదుర్కొంటున్న అవిశ్వాసమిదని, చర్చకు 10 గంటలు సమయం ఇచ్చే అవకాశం ఉందన్నారు. పార్టీ బలాబలాలను బట్టి చర్చా సమయం ఉంటుందని, ఇచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. చర్చలో తొలి అవకాశం మనకే వస్తుందని, ప్రధాని జవాబు తరువాత తిరిగి మనకే రైట్ టు రిప్లై ఉంటుందన్నారు. చర్చలో ముగ్గురు సభ్యులు మాట్లాడేందుకు అనుమతివ్వాలని, సమయం చాలకపోతే లిఖితప్రతి అందజేయాలని, లోక్‌సభ రికార్డులలో నమోదు చేయాల్సిందిగా కోరాలని మార్గదర్శకాలు జారీ చేశారు. కామన్ కేటగిరి కింద ఏపీకి ఎంత ఇచ్చారు? ఎంత రావాలి? విభజన చట్టంలోని 18 అంశాల్లో ఏపీకి జరిగిన అన్యాయం, తదితర అంశాలన్నింటినీ క్రోడీకరించి కేంద్రాన్ని ఇరకాటంలో పెట్టటం ద్వారా దేశ ప్రజల దృష్టిని ఆకర్షించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పార్టీ ఎంపీలకు దిశానిర్దేశం చేశారు.