రాష్ట్రీయం

తెలంగాణలో ఆటవిక పాలన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం, ఆగస్టు 7: పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్య పాలనకు బదులు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆటవిక పాలన సాగిస్తున్నాడని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర సహాయ కార్యదర్శి పోటు రంగారావు ఆరోపించారు. మంగళవారం ఖమ్మం నగరంలోని సుందరయ్యభవన్‌లో జరిగిన విలేఖర్ల సమావేశంలో వారు మాట్లాడారు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాల పరిధిలోని పోడుసాగుదార్లలో ఆత్మస్థైర్యాన్ని నింపడానికి రెండురోజులపాటు 3 జిల్లాల్లో పర్యటనకు ముందు ఈ విలేఖర్ల సమావేశం ఏర్పాటు చేశారు. హరితహారం పేరుతో 3వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఖర్చుచేసిందని, ఇప్పటి వరకు 81 కోట్ల మొక్కలు నాటారని అందులో ఎంత శాతం మొక్కలు బతికించారని వారు ప్రశ్నించారు. రాష్ట్రంలోని పోడుభూముల నుండి గిరిజనులను గెంటివేసి కార్పొరేట్ సంస్థలకు అప్పనంగా అందించడానికి కేసీఆర్ ప్రభుత్వం కంకణం కట్టుకుందన్నారు. దళితులకు, గిరిజనులను 3 ఎకరాల భూమిని పంచుతామని తెగప్రచారం చేసిన ప్రభుత్వం 4 ఏళ్ళ పాలనలో ఎందుకు పంచలేదని ప్రశ్నించారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ప్రతి గిరిజన, దళిత కుటుంబానికి 3 ఎకరాల భూమిని పంచాలన్నారు. పంచడానికి భూమి దొరకడం లేదని కుంటిసాకులు చెపుతున్న ప్రభుత్వానికి వారు ఒక సవాల్ విసిరారు. రహదారులు, ప్రాజెక్టులకు కావాల్సిన భూమిని కొన్న ధరల్లో సగం ధర డబ్బును 3 ఎకరాలకు అర్హులైన పేదల పేరున బ్యాంక్‌లో ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసి వడ్డీ పైసలు అందేలా చేసి, భూములు దొరికినప్పుడు అదే డబ్బుతో భూములను కొనివ్వగలరా అని వారు ప్రశ్నించారు. గిరిజనులకు, దళితులకు భూములిచ్చే కేసీఆర్ కాదని, ఉన్న భూముల్ని లాక్కుని కార్పొరేట్లకు కట్టబెట్టే కేసీఆర్ అని ఎద్దేవా చేశారు. 2006 అటవీహక్కు చట్టాన్ని తుంగలోతొక్కి గిరిజనులను కేసీఆర్ ప్రభుత్వం హింసించినంత దారుణంగా ఏ ప్రభుత్వాలు వ్యవహరించ లేదన్నారు.
కేసీఆర్ పాలనలో గిరిజన గ్రామాల్లో గిరిజనులు నిత్యం భయాందోళనల నడుమ బతుకులీడుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బంగారు తెలంగాణ కాదు బతుకుకు భరోసా ఇచ్చే తెలంగాణ కావాలన్నారు. ఇప్పటికైనా కేసీఆర్ గిరిజనుల పట్ల మంకుపట్టు వీడి వారికి అండగా నిలవాలని విజ్ఞప్తిచేశారు.