రాష్ట్రీయం

పధ్నాలుగేళ్ల అజ్ఞాతానికి వీడ్కోలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ: పధ్నాలుగేళ్ల పాటు మావోయిస్టు పార్టీ అజ్ఞాత సాయుధ గెరిల్లా దళాల్లో వివిధ ప్రాంతాల్లో పనిచేసిన నల్లగొండ జిల్లా గుర్రంపోడు మండలం ఉట్లపల్లి గ్రామవాసి షేక్ జానిబీ అలియాస్ కక్కబుజ్జి ఎట్టకేలకు పోలీసులకు లొంగిపోయారు. మూడు రోజుల క్రితమే ఆమె జిల్లా పోలీసులకు లొంగిపోయినప్పటికీ మంగళవారం ఎస్పీ రంగనాథ్ అధికారికంగా ఆమె లొంగుబాటును ప్రకటించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో షేక్ జానిబి ఉద్యమ ప్రస్థానం, లొంగుబాటు పరిణామాలను ఎస్పీ వెల్లడించారు. 18ఏళ్ల వయసులో 2004లో షేక్‌జానిబీ కుటుంబ సమస్యలతో సతమవుతున్న తరుణంలో గ్రామానికి వచ్చిన పీపుల్స్‌వార్ కనగల్ దళం ఆటపాటలకు ఆకర్షితురాలై దళంలో చేరింది. ఏడాది పాటు కనగల్ దళంలో పనిచేసిన ఆమె 2005లో కృష్ణపట్టి దళంలో మారిపోగా అదే ఏడాది నల్లమల కార్యదర్శి మాధవ్ ప్రొటెక్షన్ స్క్వాడ్‌లో చేరింది. 2006 జూలై నెలలో జరిగిన సంకెళ్లగూడెం ఎన్‌కౌంటర్‌లో మాధవర్ మృతిచెందిన పిదప జానిబీ శ్రీకాకుళం జిల్లా కొండబారుడి (గొట్ట) దళంలోకి మారింది. 2007లో ఇదే దళానికి చెందిన కిరణ్ అలియాస్ సువర్ణరాజును వివాహం చేసుకుంది. 2016లో రాంగూ వద్ద ఎన్‌కౌంటర్‌లో కిరణ్ మృతి చెందాడు. అంతకుముందు ఒరిస్సాలోని గొట్ట ఏరియా దళం రెండు భాగాలుగా విడిపోగా నూతనంగా ఏర్పడిన నారాయణపట్నం దళంలో జానిబీ 2013 వరకు పనిచేసింది. తదుపరి 2013నుండి ఒరిస్సా మల్కాన్‌గిరి జిల్లాలోని గుమ్మదళం (కటాఫ్) ఏరియా కమిటీ సభ్యురాలిగా పనిచేసింది. 2006లో నల్లమల్ల సంకెళ్లగూడెం ఎన్‌కౌంటర్‌లో, 2010లో మానసమండ ఎన్‌కౌంటర్‌లో, 2011లో మంగళాపురం, రంగానిగూడెం ఎన్‌కౌంటర్‌లలో, 2016 రాంగూడ ఎన్‌కౌంటర్‌లో, 2018 తిక్రపాడ, పానిపోదురు ఎన్‌కౌంటర్‌లలో ఆమె చాకచక్యంగా తప్పించుకుంది. అయితే సుదీర్ఘకాలం అడవుల్లో అజ్ఞాత జీవితం నేపధ్యంలో తలెత్తిన అనారోగ్యం సమస్యలు తట్టుకోలేక చివరకు లొంగుబాట పట్టింది. షేక్ జానిబీ తన లొంగుబాటుపై విలేఖరులతో మాట్లాడుతూ మావోయిస్టు ఉద్యమం నుండి తాను అనారోగ్య కారణాలతో వైదొలిగానని జన జీవన స్రవంతిలో ప్రశాంతంగా కుటుంబ సభ్యులతో కలిసి జీవించేందుకు తనకు అంతా సహకరించాలని కోరారు.
నాలుగు లక్షల రివార్డు
కాగా, షేక్ జానిబీపై నాలుగు లక్షల రివార్డు ఉందని ఆమెకు రివార్డు మొత్తం అందిస్తామని ఎస్పీ రంగానాథ్ తెలిపారు. అలాగే, ఆమెకు వైద్య చికిత్సల సదుపాయాలు, ఇతర ప్రభుత్వ పరమైన పథకాలన్నింటినీ అందిస్తామని ఎస్పీ తెలిపారు. ఆధునిక సమాజంలో అడవుల్లో ఉంటు అజ్ఞాత సాయుధ పోరాటాలతో సాధించేదేమి లేదన్నారు. జిల్లాకు చెందిన వివిధ మరో ఆరుగురు మావోయిస్టులు వివిధ ప్రాంతాల్లో పనిచేస్తున్నారని, అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టులు సైతం జనజీవన స్రవంతిలోకి రావాలని, వారి లొంగుబాటుకు సహకరిస్తామని ఎస్పీ భరోసా ఇచ్చారు.

చిత్రం..మావోయిస్టు నేత షేక్ జానిబీ లొంగుబాటును వెల్లడిస్తున్న ఎస్పీ రంగనాధ్