రాష్ట్రీయం

కంచుకోటను కూల్చే వ్యూహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భద్రాచలం టౌన్, ఆగస్టు 8: ‘మావోయిస్టులు భీకర యుద్ధానికి సిద్ధమవుతున్నారు. పట్టున్న ప్రాంతాల్లోనే కాదు.. తమకు పట్టులేని ప్రాంతాల్లోనూ గెరిల్లా తరహా భారీ దాడులకు తెగబడే ప్రమాదముంది. అక్కడా, ఇక్కడా అని కాకుండా.. మొత్తం అప్రమత్తంగా ఉండండి. శత్రువు పైచేయి సాధించక ముందే పసిగట్టి ఫలితం సాధించండి.. జాగ్రత్త’ అంటూ మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా పనిచేస్తున్న భద్రతా బలగాలకు ఎనిమిది నెలల క్రితం నిఘావర్గాలు పంపిన హెచ్చరిక ఇది. ఆ హెచ్చరికలకు అనుగుణంగానే మావోల కదలికలపై భద్రతా బలగాలు తీవ్రమై నిఘా పెట్టాయి. ఎప్పటికప్పుడు డేగకన్నుతో కూంబింగ్‌లు చేపడుతూ పైచేయి సాధిస్తున్నాయి. దాడి తర్వాత మావోల నుంచి ప్రతిదాడి ఉంటున్న నేపథ్యంలో నష్ట నివారణకు చర్యలు చేపడుతూనే వ్యూహాత్మకంగా మావోల ఏరివేతే లక్ష్యంగా అడుగులు వేస్తున్నాయి. అటు కేంద్రం మావోయిస్టులపై ఉక్కుపాదం మోపేందుకు సహాయ సహకారాలు అందిస్తుండటంతో చత్తీస్‌గఢ్ దండకారణ్యంలో మావోలకోసం వేట ఉద్ధృతంగా సాగుతోంది. ఒకదాని తర్వాత మరొకటి అన్నట్లు మావోయిస్టులు పదుల సంఖ్యలో నేలరాలుతుండటం.. గతంలో కనివినీ ఎరుగని రీతిలో ఉద్యమాన్ని నీరుగార్చడంతో భద్రతా బలగాల్లోనూ ఆత్మవిశ్వాసం పెరిగింది.
కేడర్ లక్ష్యంగా..
మావోయిస్టు పార్టీని ఆత్మరక్షణలోకి నెట్టి వారి మూలాలను దెబ్బతీయడం, ఉద్యమంలోకి కొత్తగా చేరేవారికి ఎన్‌కౌంటర్ల ద్వారా హెచ్చరికలు పంపడం, తద్వారా కేడర్ బలోపేతం కాకుండా చేయడం తదితరాలను లక్ష్యంగా పెట్టుకొని చత్తీస్‌గఢ్ దండకారణ్యంలో భద్రతా బలగాలు ప్రత్యేక ఆపరేషన్లు చేపడుతున్నారు. అందుకే ప్రత్యేక దళాలను దండకారణ్యంలో రంగంలోకి దింపారు. ఈ నేపథ్యంలోనే గత ఆరునెలల నుంచి వరుస ఎన్‌కౌంటర్లు చోటు చేసుకుంటున్నాయి. మావోయిస్టు అగ్రనేతలపై ఒక కనే్నసి ఉంచుతూనే కేడర్ బలోపేతం కాకుండా వారిని బలగాలు వ్యూహాత్మకంగా మట్టుబెడుతున్నాయి. ఈ భయంతో అటు ఉద్యమంలోకి వెళ్లాలంటే స్థానిక యువత ముందుకు రావటం లేదని పోలీసులు పేర్కొంటున్నారు. ఆత్మరక్షణలోకి నెట్టడం, ఏమి చేయాలో పాలుపోక ఉక్కిరిబిక్కిరి చేయడం, తద్వారా పైచేయి సాధించి ఉద్యమాన్ని నిర్వీర్యం చేయడం ఈ మూడు వ్యూహాలను ప్రధానంగా పోలీసులు పాటిస్తున్నారు. తద్వారా ఫలితాలు సాధిస్తూ అడవుల్లో ఉద్యమాన్ని తుదముట్టిస్తున్నారు. గత ఆరు నెలల కాలంలో దాదాపు 6 ఎన్‌కౌంటర్లు చోటు చేసుకోగా సుమారు 110 మంది వరకు మావోయిస్టులు మృతి చెందారు. దీనికి తోడు వరుస ఎన్‌కౌంటర్ల నేపథ్యంలో ఉక్కిరిబిక్కిరవుతున్న కొందరు జనజీవన స్రవంతిలోకి వచ్చేస్తున్నారు. లొంగిపోయిన వారి ద్వారా అంది పుచ్చుకుంటున్న సమాచారం, నిఘావర్గాల సమాచారంతో పోలీసులు మరింత ముందుకు చొచ్చుకొస్తూ మావోలను ఇరకాటంలో పడేస్తున్నారు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో గ్రేహౌండ్స్ రంగంలోకి దిగడంతో మావోయిస్టు ఉద్యమం నామరూపాలు లేకుండా పోయింది. చత్తీస్‌గఢ్‌లో సమాంతర పాలన సాగించిన మావోయిస్టులను అదేతరహాలో దెబ్బకొట్టాలని భావించిన కేంద్రం ఎప్పటికప్పుడు రాష్ట్రానికి పూర్తి సహాయసహకారాలు అందిస్తోంది. దీనికి తోడు పొరుగున ఉన్న తెలంగాణ నుంచి కూడా మంచి సహకారం అందడంతో మావోల ఏరివేతలో భద్రతా బలగాలు ఫలితాలు సాధిస్తున్నాయని సీనియర్ పోలీసు అధికారులు పేర్కొంటున్నారు.
బలమైన ఇన్‌ఫార్మర్ వ్యవస్థ
మావోయిస్టుల వేటలో భాగంగా వారి షెల్టర్/ శిక్షణ జోన్లుగా ఉన్న ప్రాంతాల్ని ఎస్‌ఐబీ పోలీసులు ఇప్పటికే గుర్తించారని తెలిసింది. బలమైన ఇన్‌ఫార్మర్, కోవర్టు వ్యవస్థలను ఏర్పాటు చేసుకోవడంలోనూ పోలీసులు సఫలమయ్యారు. షెల్టర్లు, శిక్షణ ప్రాంతాల్లోని నేతలను కలిసే కొరియర్లను గుర్తించడం ద్వారా నీడలా వెంబడిస్తున్నారు. ముఖ్య నేతల కదలికల సమాచారాన్ని ఇస్తున్న ఇన్‌ఫార్మర్లకు రూ.లక్షల్లో నజరానా అందిస్తున్నారని తెలుస్తోంది. ఆయా విభాగాలను పర్యవేక్షించే కీలక అధికారులకు మినహా ఇన్‌ఫార్మర్మ సమాచారాన్ని ఎవరికీ తెలియకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
మావోయిస్టు పార్టీతో గతంలో సంబంధాలు కలిగి ఉన్నవారు కూడా పోలీసు ఇన్‌ఫార్మర్లుగా పని చేస్తుండటంతో మావోల కదిలికలను పసిగట్టడం సులవవుతోంది. వీటన్నింటికీ మించి సాంకేతిక నిఘా కోసం ఎస్‌ఐబీ పోలీసులు ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశారని తెలిసింది. ఈ చర్యలన్నింటి ఫలితంగానే మావోయిస్టు పార్టీని వరుసగా దెబ్బకొడుతున్నారు. మావోయిస్టు వ్యతిరేక చర్యల్లో గ్రేహౌండ్స్ పేరుగాంచిన విధంగానే సమాచార సేకరణలో స్పెషల్ ఇంటలిజెన్స్ బ్రాంచ్(ఎస్‌ఐబీ) కీలకంగా వ్యవహరిస్తోంది. మావోయిస్టు పార్టీలోని క్యాడర్‌ను కకావికలం చేయడం ద్వారా ఆ ఉద్యమాన్ని కూకటి వేళ్లతో పెకలించవచ్చనేది ఎస్‌ఐబీ వ్యూహంగా కనిపిస్తోంది. అందునా కీలక నేతల కోసం ఎస్‌ఐబీ ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది. ఒక కీలక నేత కోసం ఒక బృందం ప్రత్యేకంగా ఎంతకాలమైనా పనిచేసేలా వ్యూహం రచించింది. బృందం దృష్టిలో ఉన్న నేత లొంగిపోవడం, లేదంటే ఎన్‌కౌంటర్‌లో మృతి చెందడం జరిగితేనే ఆ బృందం తమకు అప్పగించిన ఆపరేషన్ పూర్తి చేసినట్లు లెక్క. ఈ ప్రత్యేక బృందాల కారణంగానే కీలక నేతలు వెలుగులోకి రాకుండా తలదాచుకుంటున్నట్లు వినికిడి.
బేస్‌క్యాంపుల ఏర్పాటుతో ఉక్కిరిబిక్కిరి
చత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులకు మంచి పట్టున్న ప్రాంతాల్లో ఇటీవల కాలంలో బేస్‌క్యాంపుల సంఖ్యను పెంచారు. బేస్‌క్యాంపుల ఏర్పాటు వల్ల మావోయిస్టుల సంచారం బాగా తగ్గింది. గతంలో వేళ్ల సంఖ్యలో లెక్కపెట్టే బేస్‌క్యాంపులు మాత్రమే ఉండేవి. వీటిపై తరచూ మావోలు దాడులు చేసేవారు. మావోల ఏరివేత లక్ష్యంగా ముందుకెళ్తున్న బలగాలు ఎక్కడికక్కడ బేస్‌క్యాంపులు ఏర్పాటు చేసుకోవడంతో షెల్టర్‌జోన్ దాటి రాలేని పరిస్థితిని కల్పించారు. దీంతో ఇటీవల కాలంలో చత్తీస్‌గఢ్‌లో మావోల హింసాత్మక సంఘటనలు తగ్గుముఖం పట్టినట్లు తెలుస్తోంది. వీటన్నింటికీ బలం చేకూర్చేలా వర్షాకాలంలోనూ అడవుల్లోకి బలగాలు చొచ్చుకెళ్లి మావోలపై ముప్పేట దాడి చేస్తున్నాయి. సాధారణంగా వేసవికాలంలో మావోలు గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటారు. వర్షాలు కురిసి అడవులు దట్టంగా పెరిగిన ఈ సీజన్‌లో కూడా పోలీసులు పన్నిన పక్కా వ్యూహంలో మావోయిస్టులు చిక్కుకుంటున్నారు.