రాష్ట్రీయం

మహోగ్ర గోదావరి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, ఆగస్టు 21: గోదావరి మహోగ్రరూపం దాల్చుతోంది. గంట గంటకూ పెరుగుతున్న వరద ఉద్ధృతి మూడో ప్రమాద హెచ్చరిక దిశగా అడుగులేస్తోంది. తూర్పు గోదావరి జిల్లా ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ అన్ని గేట్లను పూర్తిస్థాయిలో తెరిచి వరద నీటిని వచ్చింది వచ్చినట్టుగా దిగువకు వదిలేస్తున్నారు. ఈ ప్రభావంతో దిగువనున్న కోనసీమ లంక గ్రామాలు అతలాకుతలమవుతున్నాయి. మరోవైపు భద్రాచలం వద్ద గోదావరి 48.10 అడుగులకు పెరిగింది. ఈ నేపథ్యంలో అధికారులు భద్రాచలం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీచేశారు. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద ప్రస్తుతం 14.75 అడుగుల నీటి మట్టం ఉంది. 17.75 అడుగుల స్థాయికి చేరితో మూడో ప్రమాద హెచ్చరిక జారీచేస్తారు. బ్యారేజీ నుంచి 14 లక్షల 34 వేల 360 క్యూసెక్కుల వరద నీరు సముద్రంలోకి ప్రవాహిస్తోంది. ఏటిగట్లను ఒరుచుకుంటూ ప్రవాహ ఉద్ధృతి కొనసాగుతుండటంతో గోదావరి పాయల పరీవాహ గ్రామాలు భీతిల్లుతున్నాయి. దీనితో అధికార యంత్రాంగం పెద్ద ఎత్తున భద్రతా
చర్యలు చేపట్టింది. కాటన్ బ్యారేజీ ఎగువ అఖండ గోదావరి నది పరీవాహంలోని చింతూరు, కూనవరం, విఆర్ పురం, ఎటపాక మండలాల్లో పెద్ద ఎత్తున ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. చింతూరు ఐటీడీఏ పీవో ఆధ్వర్యంలో ఎటపాక డివిజన్‌లో సహాయక చర్యలు చేపట్టారు. దేవీపట్నం మండలంలో ముంపు గ్రామాల్లో ప్రత్యేక ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు ఏర్పాటు చేశారు. ఎటపాక, రంపచోడవరం, అమలాపురం, రాజమహేంద్రవరం, రామచంద్రపురం డివిజన్లు వరద తాకిడికి ప్రభావితమయ్యాయి. గోదావరి నదిలో ప్రస్తుతం ఎక్కడా నాటు పడవలు సంచరించకుండా చర్యలు చేపట్టారు. భద్రాచలం రోడ్డులో శబరి ఉప్పొంగడంతో రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి. సోకిలేరు, పాములేరు, సీతపల్లి వాగు వరదతో ఉప్పొంగడంతో మన్యం ప్రాంతంలో 30 గ్రామాలకు సంబంధాలు తెగిపోయాయి.
చింతూరు, విఆర్ పురం, కూనవరం, ఎటపాక మండలాల్లో శబరి ఉప్పొంగి ప్రవహిస్తోంది. సోకిలేరు, కుయుగూరు, చీకటివాగు, అత్తాకోడళ్ల వాగు, అన్నవరం వాగు, అడవి వెంకన్న గూడెం వాగు, కుందలూరు వాగులు పొంగిపొర్లుతూ శబరిలో కలుస్తుండటంతో శబరి ఉద్ధృతంగా ఉరకలేస్తోంది. కూనవరం వద్ద 18.96 మీటర్ల ఎత్తులో ప్రవహిస్తోంది. దేవీపట్నం మండలంలోని ప్రసిద్ధ గండి పోశమ్మ తల్లి ఆలయం జలదిగ్బంధంలో చిక్కుకోవడంతో రెండు రోజుల పాటు ఆలయ అధికారులు దర్శనాలను రద్దు చేశారు.
తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున సహాయక చర్యలు చేపట్టారు. చింతూరు ఐటీడీఏ పీవో అభిషిక్త్‌వర్మ, రంపచోడవరం ఐటీడీఏ పీవో నిషాంత్‌కుమార్, అమలాపురం ఆర్డీవో వెంకటరమణ, రాజమహేంద్రవరం సబ్ కలెక్టర్ సాయికాంత్ వర్మ కమాండ్ కంట్రోల్ కేంద్రాల ద్వారా 24 గంటలూ వరదను సమీక్షిస్తున్నారు. మూడో ప్రమాద హెచ్చరిక స్థాయికి గోదావరి చేరుకుంటే ఎన్ని గ్రామాలు జలదిగ్బంధమవుతాయో ముందుగానే అంచనా వేసి ఆయా ప్రాంతాల్లో సహాయక బృందాలను, లాంచీలను సిద్ధంగా ఉంచామని జిల్లా కలెక్టర్ చెప్పారు. నదీ గర్భంలో రెండు పాయల మధ్య దాదాపు రెండు శతాబ్దాల కాలం నుంచి ఉన్న సీతానగరం మండలం ములకల్లంక జల దిగ్బంధమైంది. ఇక్కడి సుమారు 150 కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి అవసరమైన మేరకు అధికారులు లాంచీలను సిద్ధంగా ఉంచి అప్రమత్త చర్యలు చేపట్టారు. ప్రస్తుతం పోలీసు బందోబస్తుతో ఇంజన్ నావపై గజ ఈతగాళ్లను పెట్టి స్థానికులను ఒడ్డుకు దాటించడం చేస్తున్నారు. రాజమహేంద్రదవరం సబ్ కలెక్టర్ సాయికాంత్ వర్మ ఈ గ్రామాన్ని సందర్శించి గ్రామస్థులతో మాట్లాడారు. డీఎస్పీ ఎ శ్రీనివాసరావు సమక్షంలో పోలీసు అధికారులు పెద్దఎత్తున పహారా కాస్తున్నారు.
రాజమహేంద్రవరంలోని అఖండ గోదావరి నదిలో ఎవరూ దిగకుండా గట్టి పోలీసు పర్యవేక్షణ ఏర్పాటు చేశారు. కాటన్ బ్యారేజీపై ఇరవై నాలుగు గంటల పాటు ఇటు రెవెన్యూ, జల వనరుల శాఖ, పోలీసు అధికారులు పహారా కాస్తున్నారు. అఖండ గోదావరి దిగువన నదీ పాయల నడుమ ఉన్న గ్రామాల్లోని ఏటిగట్లపై పశువులను కట్టేసి కొన్ని జలదిగ్బంధమైన గ్రామాల నుంచి గ్రామస్థులు సురక్షిత ప్రాంతాలకు తరలివచ్చేందుకు సిద్ధమయ్యారు. నదీ లంకలు, అఖండ గోదావరి నది గర్భంలోని ఇసుక దిబ్బలపై ఉన్న దీవెనలంక, కేతావారిలంక, గోంగూరు లంక, కోటిలింగాల లంకల్లో నివసిస్తున్న మత్స్యకార కుటుంబాలను రాజమహేంద్రవరంలోని నగరపాలక సంస్థ కళ్యాణ మండలంలో శిబిరానికి తరలించి పునరావాసం కల్పిస్తున్నారు. లంక గ్రామాల వద్ద ఉచిత వైద్య శిబిరాలను ఏర్పాటు చేశారు.

చిత్రాలు..గేట్లు ఎత్తివేయడంతో నిండుకుండలా ధవళేశ్వరం బ్యారేజీ
*రాజమహేంద్రవరంలో నీట మునిగిన కైలాసభూమి
*ఎదురుబిడిం కాజ్‌వే వద్ద వరద నీటిలో ప్రజల ఇక్కట్లు