రాష్ట్రీయం

అతివృష్టి.. అనావృష్టి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, ఆగస్టు 21: ఒకవైపు అతివృష్టి..మరోవైపు అనావృష్టి.. కోస్తా జిల్లాల్లో లక్షలాది క్యూసెక్కుల నీరు సముద్రంలోకి వృథాగా పోతుంటే రాయలసీమ ప్రాంతంలో వర్షాభావ పరిస్థితుల కారణంగా పంటలు ఎండు దశకు చేరుతున్న పరిస్థితిపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మంగళవారం వివిధ జిల్లాల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి వారికి దిశానిర్దేశం చేశారు. గత కొద్దిరోజులుగా కురిసిన భారీ వర్షాలు, వరదల కారణంగా
కోస్తాంధ్ర ప్రాంతంలో శ్రీకాకుళం, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని పలు గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. వేల హెక్టార్ల పంటలు నీట నానుతున్నాయి. మంగళవారం నాటికి రాష్ట్రంలోని అన్ని రిజర్వాయర్లలో మొత్తం 935 టీఎంసీల సామర్థ్యానికి గాను 550 టీఎంసీల నీరు చేరింది. ధవళేశ్వరం ఆన కట్ట వద్ద 14లక్షల క్యూసెక్కుల మేర గోదావరి, ప్రకాశం బ్యారేజీ వద్ద రెండులక్షల క్యూసెక్కుల కృష్ణా నదీ జలాలు సముద్రంలోకి వదులుతున్నారు. ప్రభుత్వం ఇప్పటికే లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించింది. వరద పరిస్థితిపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆయా జిల్లాల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వివరాలడిగి తెలుసుకున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో 19 మండలాల్లోని 43 గ్రామాలను వరదనీరు చుట్టుముట్టింది. జిల్లాలో 24 సహాయ పునరావాస శిబిరాల్లో 3059 మంది తలదాచుకుంటున్నారు. 665 ఇళ్లు దెబ్బతిన్నాయి. 4వేల హెక్టార్లలో వరి, 634 హెక్టార్లలో పత్తి, 1664 హెక్టార్లలో ఉద్యానవన పంటలు నీట నానుతున్నాయి. అంటువ్యాధులు ప్రబలకుండా జిల్లా వ్యాప్తంగా 79 వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. పశ్చిమ గోదావరి జిల్లాలో 20 మండలాల్లో 186 గ్రామాల వరద ప్రభావిత ప్రాంతాలుగా గుర్తించారు. జిల్లాలో 32 సహాయ కేంద్రాల్లో 11వేల మంది ఆశ్రయం పొందుతున్నారు. జిల్లా వ్యాప్తంగా 323 ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. 6334 హెక్టార్లలో వరి, 2004 హెక్టార్లలో ఉద్యానవన పంటలు, 650 హెక్టార్లలో పత్తిపైర్లు నీట మునిగాయి. కాగా శ్రీకాకుళం జిల్లాలోని 27 మండలాల్లో 293 గ్రామాలు వరద ముంచెత్తింది. వ్యవసాయ, ఉద్యానవన పంటలు 13వేల హెక్టార్లలో నీట మునిగాయని అధికారులు వివరించారు. మొత్తం 3 ఎన్డీఆర్‌ఎఫ్, 9 ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాలు సహాయ చర్యల్లో నిమగ్నమయ్యాయని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఇదిలా ఉండగా రాయలసీమ ప్రాంతంలో వర్షాభావం కారణంగా పంటలు ఎండుదశకు చేరుకున్నాయి. రెయిన్‌గన్ల ద్వారా ఇప్పటి వరకు 17వేల 226 హెక్టార్లలో పంటలు కాపాడగలిగామని అధికారులు సీఎం దృష్టికి తెచ్చారు. మరో 8వేల 96 హెక్టార్లను పరిశీలిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో వరద పరిస్థితులపై ముఖ్యమంత్రి స్పందిస్తూ బృంద స్ఫూర్తితో నిర్వాసితులకు సేవలందించాలని ఆదేశించారు. అధికార యంత్రాంగం అప్రమత్తంగా వ్యవహరిస్తూ ఎప్పటికప్పుడు అంచనాలు సిద్ధం చేయాలన్నారు. వరద నీరు తగ్గుముఖం పట్టిన తరువాత నష్టం అంచనాలు ప్రారంభించాలని సూచించారు. పశ్చిమగోదావరి జిల్లా నల్లజెర్ల వద్ద ఎర్రకాలువలో 6వేల క్యూసెక్కుల వరదనీరు ప్రవహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. నాగార్జునసాగర్, శ్రీశైలం, పులిచింతలకు ఇంకా 157 టీఎంసీల మేర నిల్వ సామర్థ్యం ఉందని చెప్పారు. అవుకు టనె్నల్ పూర్తయితే 16వేల క్యూసెక్కుల నీటిని తరలించే అవకాశం ఉండేదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. పోతిరెడ్డిపాడు నుంచి వీలైనంత ఎక్కువ నీటిని సీమ జిల్లాలకు తరలించాలని ఆదేశించారు. తుంగభద్ర, హంద్రీ-నీవా నుంచి నీటిని విడుదల చేయాలని సూచించారు. వైకుంఠపురం ఎత్తిపోతల వీలైనంత త్వరగా పూర్తిచేయాలన్నారు. గోదావరి నీటిని నాగార్జునసాగర్ కుడికాలువకు మళ్లించే ప్రయత్నాలు జరగాలన్నారు. రైతులు వేసిన ప్రతి పంటను కాపాడాలన్నారు. పంటలు వేయనిచోట ప్రత్యామ్నాయ సాగును ప్రోత్సహించాలన్నారు. కర్ణాటక నుంచి సరిహద్దు జిల్లాల యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ఇప్పటి వరకు 422 హెక్టార్లలో తెగుళ్లు సోకాయని నియంత్రణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు.