రాష్ట్రీయం

శ్రీరాంసాగర్‌కు పోటెత్తుతున్న వరద

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్, ఆగస్టు 21: తెలంగాణ వరప్రదాయిని శ్రీరాంసాగర్ రిజర్వాయర్‌కు వరదనీరు పోటెత్తుతోంది. స్థానికంగానే కాకుండా ఎగువన మహారాష్టల్రోనూ గడిచిన మూడు రోజుల నుండి ఏకధాటిగా కురుస్తున్న కుండపోత వర్షాలతో ఎస్సారెస్పీలోకి వరద జలాలు పెద్దఎత్తున వచ్చి చేరుతున్నాయి. దీంతో ఈ రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటిమట్టానికి వడివడిగా చేరువవుతోంది. మంగళవారం సాయంత్రం నాటికి ఎగువ ప్రాంతాల నుండి రెండున్నర లక్షల క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరుతోందని, ఇన్‌ఫ్లో ఇదేవిధంగా కొనసాగితే బుధ, గురువారాల్లో ఏ క్షణమైనా ప్రాజెక్టుకు చెందిన వరద గేట్ల ద్వారా మిగులు జలాలను దిగువ గోదావరిలోకి విడుదల చేసే అవకాశాలుంటాయని ఎస్సారెస్పీ అధికారులు పేర్కొంటున్నారు. భారీగా వచ్చి చేరుతున్న ఇన్‌ఫ్లోలతో ప్రతీ గంటకు ఒక టీఎంసీ కంటే ఎక్కువ మేర నీటి నిల్వలు పెరుగుతుండడం ఈ అంచనాలకు ఆస్కారం కల్పిస్తోంది. రిజర్వాయర్ ఎగువ ప్రాంతాలైన నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలలో కురుస్తున్న వర్షాలతో పాటు మహారాష్టల్రోని విష్ణుపురి, అమ్దురా, బలేగాం, బాబ్లీ ప్రాజెక్టుల మిగులు జలాలు తోడవడంతో ఎస్సారెస్పీలోకి 2.55లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగుతోంది. దీంతో 1091.00అడుగులు, 90టీఎంసీల పూర్తిస్థాయి సామర్థ్యం కలిగిన రిజర్వాయర్‌లో, మంగళవారం సాయంత్రం నాటికి 1080.90అడుగులు, 54.95టీఎంసీలకు నీటిమట్టం చేరుకుంది. సోమవారం నాడు 1072.50అడుగులు, 34.18టీఎంసీల వద్ద నిలువ ఉన్న నీటిమట్టం భారీగా వచ్చి చేరిన ఇన్‌ఫ్లోలతో గడిచిన 24గంటల్లోనే 20టీఎంసీల వరకు నీటి నిల్వలు పెరగడం విశేషం. మరికొద్ది గంటలు ఇదే తరహాలో ఇన్‌ఫ్లోలు కొనసాగే అవకాశాలుండడం వల్ల ఈసారి శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టాన్ని సంతరించుకోవడం ఖాయమని ఎస్సారెస్పీ అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. గత సంవత్సరం ఇదే రోజున రిజర్వాయర్ నీటిమట్టం 1059.50అడుగులు, 13.06టీఎంసీల వద్ద నీరు నిల్వ ఉందని ఏ.ఈ మహేందర్ తెలిపారు.
నీటి విడుదలకు సన్నాహాలు షురూ
కాగా, శ్రీరాంసాగర్‌లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతూ, రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటిమట్టాన్ని సంతరించుకునే అవకాశాలు ఉండడంతో ఆయకట్టుకు సాగునీటిని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మంగళవారం జలసౌధలో మంత్రులు హరీశ్‌రావు, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి, మిషన్ భగీరథ వైస్ చైర్మెన్ వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎం.పీ బీబీ.పాటిల్‌లు ఇరిగేషన్ ఉన్నతాధికారులతో భేటీ అయి ఎస్సారెస్పీ తాజా పరిస్థితిపై సమీక్ష జరిపారు. ఎస్సారెస్పీ ప్రధాన కాలువలైన కాకతీయ, సరస్వతి, లక్ష్మీ కెనాళ్లతో పాటు చౌట్‌పల్లి హన్మంత్‌రెడ్డి, నవాబ్, గుత్ప, అలీసాగర్ లిఫ్టులు, మరో 24చిన్న తరహా ఎత్తిపోతల పథకాల ద్వారా పూర్తిస్థాయి ఆయకట్టుకు ఎస్సారెస్పీ నీటిని అందించాలని నిర్ణయించారు. ఆన్ అండ్ ఆఫ్ పద్ధతిలో చివరి ఆయకట్టు వరకు కూడా నీరు చేరేలా పకడ్బందీగా ప్రణాళిక రూపొందించాలని మంత్రి హరీశ్‌రావు ఇరిగేషన్ ఈఎన్‌సీ మురళీధర్, ఓఎస్‌డీ శ్రీ్ధర్‌దేశ్‌పాండే, స్పెషలాఫీసర్ కే.ప్రసాద్ తదితరులను ఆదేశించారు
క్షేత్ర స్థాయిలో ఇంజినీర్లు, ఆయకట్టు రైతులు, రెవెన్యూ అధికారులు, ప్రజాప్రతినిధులతో సమావేశాలు ఏర్పాటు చేసుకుని, నీటి విడుదలకు ప్రణాళిక ఖరారు చేయాలని సూచించారు. మొత్తానికి ఎస్సారెస్పీ పూర్తిస్థాయి నీటిమట్టాన్ని సంతరించుకుంటుండడంతో ప్రస్తుత ఖరీఫ్‌తో పాటు వచ్చే రబీ సీజన్‌లోనూ ఆయకట్టు పంటలకు సాగునీటి భరోసా లభించింది.
చిత్రాలు..భారీగా వచ్చి చేరుతున్న వరదనీటితో నిండు కుండలా తొణికిసలాడుతున్న శ్రీరాంసాగర్ ప్రాజెక్టు

*సమీక్ష సమావేశంలో మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, పోచారం, హరీష్‌రావు