రాష్ట్రీయం

ఎన్డీయేకు గుణపాఠం చెప్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఆగస్టు 23: కేంద్రం నుంచి రాష్ట్రానికి రావల్సినవి అడిగితే, ఎదురుదాడి చేస్తున్న ఎన్డీయే ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హెచ్చరించారు. గురువారం ఇక్కడ జరిగిన జ్ఞానభేరి సభలో ఆయన మాట్లాడారు. రాష్ట్రం కోసం తాను ధర్మపోరాటం చేస్తున్నానని, అన్ని వర్గాల ప్రజలకు మద్దతు తెలుపుతున్నారని చెప్పారు. విశాఖకు రైల్వే జోన్ ఎందుకు ఇవ్వడం లేదని ఆయన కేంద్రాన్ని సూటిగా ప్రశ్నించారు. రాష్ట్రంలోని కొంతమంది నాయకులు కేంద్రానికి సహకరించడం వల్లే ఈ పరిస్థితి దాపురించిందన్నారు. గతంలో బ్రిటిష్‌వారికి దేశంలోని కొంతమంది సహకరించడం వల్లే పరాయి పాలనను అనుభవించాల్సి వచ్చిందని, భారతీయులు అనేక కష్టాలకు గురయ్యారని అన్నారు. ప్రభుత్వాలు సక్రమంగా లేకపోయినా, అసమర్థ ప్రభుత్వాలు ఉన్నా ప్రజలకు సమస్యలు తప్పవని అన్నారు. కేంద్రానికి అండగా నిలవడం లేదన్న భావనతో రాష్ట్రానికి తీరని అన్యాయం చేస్తున్నారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రం సహకరించినా, లేకపోయినా పోలవరాన్ని పూర్తి చేసితీరుతానని చంద్రబాబు చెప్పారు. రాయలసీమలో వర్షాలు లేకపోయినా, అక్కడి ప్రజలకు తాగు, పంటలకు సాగు నీటిని సమృద్ధిగా అందిస్తున్నామని ఆయన చెప్పారు.
ఏపీ ఓ ప్రయోగశాల
విద్యార్థులు ఆంధ్రప్రదేశ్ ఒక ప్రయోగశాల వంటిదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. స్థానిక ఆంధ్రా యూనివర్శిటీ గ్రౌండ్స్‌లో గురువారం జరిగిన జ్ఞానభేరి సభలో చంద్రబాబు మాట్లాడుతూ విద్యార్థులు తమ విజ్ఞానాన్ని క్షేత్రస్థాయిలో ఉపయోగించాలని సూచించారు. బలమైన సంకల్పంతో ఏ పని మొదలుపెట్టినా అది విజయవంతం అవుతుందన్నారు. జీవితాన్ని మలుపుతిప్పేది విద్యార్థి దశ అని, దాన్ని చక్కగా మలుచుకోవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉందని అన్నారు. ప్రాథమిక విద్య నుంచి ఉన్నత విద్య వరకూ విద్యార్థులు ఎటువంటి ఇబ్బంది లేకుండా చదువుకునేందుకు కోట్ల రూపాయల నిధులతో వౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని అన్నారు. గతంలో తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రంలో భారీ సంఖ్యలో ఇంజనీరింగ్, మెడికల్ కళాశాలలను నెలకొల్పానని తన ఒక్కొక్క విజయం వెనుక ఎన్నో కష్టాలు ఉన్నాయని చంద్రబాబు చెప్పారు. సిలికాన్ వ్యాలీలో తెలుగువారే చక్రం తిప్పడానికి తానే కారణమని చెప్పారు. ప్రతి విద్యార్థి ఒక పారిశ్రామికవేత్తగా తయరైతే, నిరుద్యోగ సమస్య చాలా వరకూ తగ్గిపోతుందని అన్నారు. గతంలో తాను ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి తాను అధిక ప్రాధాన్యం ఇచ్చానని, దాని ఫలితాలు ఇప్పుడు కనిపిస్తున్నాయని అన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పాలన సులభతరమైందని అన్నారు. విద్యార్థులకు కావల్సిన సర్ట్ఫికెట్లు నిముషాల వ్యవధిలో వారి చేతుల్లో ఉంటున్నాయని అన్నారు. వినూత్న ప్రయోగాలు చేసే విద్యార్థులకు తమ ప్రభుత్వం ఎప్పుడూ చేయూతనందిస్తునే ఉంటుందని
చంద్రబాబు చెప్పారు. పదో తరగతి నుంచే విద్యార్థులు వినూత్నంగా ఆలోచించాలని ఆయన సూచించారు. తమ ప్రభుత్వం రియల్‌టైం గవర్నెన్స్‌ను అమలు చేస్తోందని, అలాగే, విద్యార్థులు కూడా రియల్ టైం సమాచారంతో అద్భుతాలు సృష్టించవచ్చని అన్నారు. గతంలో ఏ ప్రభుత్వం ఇవ్వని విధంగా విద్యార్థుల స్కాలర్‌షిప్‌లను నేరుగా వారి అక్కౌంట్‌లోనే వస్తున్నామని చెప్పారు. అలాగే నిరుద్యోగ భృతి కూడా ఇస్తున్నామని చెప్పారు. విద్యార్థులు ఒక యంత్రం మాదిరి మారకుండా, సరళమైన రీతిలో విద్యను అభ్యసిస్తే, వారిలోని సృజనాత్మకతకు పదునుపెట్టడానికి వీలుంటుందని అన్నారు. 18-30 సంవత్సరాల మధ్య ఉన్న యువకులు తమ జీవితం, సమాజం గురించి ఎన్నో కలలు కంటారు. అవి వాస్తవానికి దగ్గరగా ఉండాలని చంద్రబాబు హితవు పలికారు. సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో లేని ఆ రోజుల్లో మనుషులపై వత్తిడి ఉండేది కాదని, అయితే, ఇప్పుడు సెల్‌ఫోన్‌లు వచ్చి మనుషులపై వత్తిడిని పెంచడమే కాకుండా, మానవ సంబంధాలు కూడా దెబ్బతింటున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. యూనివర్శిటీల్లో కులాలు, మతాల గురించి ప్రస్తావన రాకూడదని అన్నారు.
రాష్ట్ర మానవవనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ రాష్ట్రాన్ని నాలెడ్జ్ స్టేట్‌గా, ఎడ్యుకేషన్ హబ్‌గా మార్చేందుకు విద్యాశాఖకు ఏటా 25,003 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని నెంబర్ వన్ స్థానంలో నిలిపేందుకు అహర్నిశలు కృషి చేస్తున్నారని అన్నారు. సామాన్య కుటుంబంలో పుట్టిన చంద్రబాబు ఇప్పుడు దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారని అన్నారు. విద్యార్థులు నిర్దేశిత లక్ష్యాలను సాధించే వరకూ విశ్రమించవద్దని గంటా సూచించారు. విద్యార్థులు తమ తల్లిదండ్రులు గర్వపడేలా వారి వారి జీవితాలను తీర్చిదిద్దుకోవాలని ఆయన సూచించారు. జ్ఞానభేరి కార్యక్రమాన్ని పురస్కరించుకుని ఏయూ పరిధిలో వివిధ కళాశాలల విద్యార్థులకు నిర్వహించిన పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు ట్రోఫీలు, నగదు బహుమతులను ముఖ్యమంత్రి చంద్రబాబు అందచేశారు.

చిత్రం..విశాఖలో జరిగిన జ్ఞానభేరి సభలో మాట్లాడుతున్న సీఎం చంద్రబాబు