రాష్ట్రీయం

ప్రతిపక్షాలూ అప్రమత్తం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 24: ముందస్తు ఎన్నికలకు వెళ్ళాలని ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్‌రావు చేస్తున్న హడావుడితో అంతే హడావుడిగా ప్రతిపక్షాలూ అప్రమత్తమయ్యాయి. ఎన్నికలకు సిద్ధంగా ఉండకపోతే దూరంగా ఉంటామా? అనే భావన ప్రతిపక్షాల్లో వ్యక్తమవుతోంది. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కొవడానికి తప్ప తమకు వేరే పని ఏముంటుందని వివిధ పార్టీల నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రతిపక్షంలోకి రాగానే వచ్చే ఎన్నికలకు కసరత్తు చేస్తూ, ఎల్లప్పుడూ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లో ఎండగడుతూ ఎన్నికలకు సిద్ధంగానే ఉంటామని వారు అభిప్రాయపడ్డారు.
ఎప్పుడొచ్చినా ఎదుర్కొంటాం : ఉత్తమ్ కుమార్ రెడ్డి
ఇలావుండగా పీసీసీ అధ్యక్షుడు ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆంధ్రభూమి ప్రతినిధితో మాట్లాడుతూ ముందస్తు ఎన్నికలకు ‘సై’ అన్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఎదుర్కొంటామని ఆయన తెలిపారు. తామే కాదు ప్రజలూ ఎన్నికల కోసం ఎదురు చూస్తున్నారని వ్యాఖ్యానించారు. ఎన్నికలు వస్తే టీఆర్‌ఎస్‌కు తగిన గుణపాఠం చెప్పి, ప్రతిపక్షంలో కూర్చోబెట్టాలని ప్రజలు ఎదురు చూస్తున్నారని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళితే, అధికారంలోకిగాక ప్రతిపక్షంలోకి వెళ్ళాల్సి ఉంటుందని అన్నారు. ఏఐసీసీ అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత రాహుల్ గాంధీ ఇటీవల హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో చేసిన పర్యటన దిగ్విజయమైందన్నారు. రాహుల్ పర్యటనపై ఇంటెలిజెన్స్ నివేదికతో కంగు తిన్న కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు సమాయత్తమవుతుండవచ్చని ఉత్తమ్ అనుమానం వ్యక్తం చేశారు. లోక్‌సభ ఎన్నికలతో కాకుండా తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీకి ముందే ఎన్నికలు నిర్వహిస్తే, రాహుల్, సోనియా గాంధీ, ఏఐసీసీ ముఖ్య నాయకులు ఎక్కువ సమయం కేటాయించేందుకు సమయం దక్కుతుందన్నారు. ఇది ఒక రకంగా తమకు మేలే చేస్తుందని ఉత్తమ్ అభిప్రాయపడ్డారు.
తయారుగా ఉన్నాం: లక్ష్మణ్
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కే. లక్ష్మణ్ మాట్లాడుతూ ఎన్నికలు రేపు వచ్చినా సిద్ధంగా ఉన్నామని అన్నారు. అన్ని రకాలుగా పార్టీ మొత్తం తయారుగా ఉందన్నారు. రాష్ట్ర స్థాయి నుంచి కింది స్థాయి వరకూ అంటే గ్రామ, పోలింగ్ కేంద్రం
వరకూ ఎన్నికలకు సమాయత్తమైందని వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్ళడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్నామని అన్నారు. పల్లె-పల్లెకూ బీజేపీ నినాదంతో వెళుతున్నామనీ, వివిధ పార్టీల నుంచి అనేక మంది ముఖ్య నాయకులూ తమ పార్టీలోకి వస్తున్నారనీ ఆయన తెలిపారు. ఎన్నికల ముందు ఇంకా అనేక మంది చేరనున్నారని, అయితే, ఆ పేర్లను ఇప్పుడు చెప్పడం బాగుండదని అన్నారు. అసలు ముందస్తు ఎన్నికలకు ఎందుకు వెళ్లాలని కేసీఆర్ భావిస్తున్నారో ప్రజలకు వివరించాలని డాక్టర్ లక్ష్మణ్ డిమాండ్ చేశారు. షెడ్యూలు ప్రకారం అంటే లోక్‌సభతో పాటు అసెంబ్లీ ఎన్నికలకు వెళితే తమకు బీజేపీ, ప్రధాని నరేంద్ర మోదీ ‘హవా’ను తట్టుకోలేమని భావించి ముందస్తు ఎన్నికలకు కేసీఆర్ ఆలోచన చేస్తున్నారేమోనన్న అనుమానాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఏదిఏమైనా, ఎప్పుడు ఎన్నికలు వచ్చినా, ఆఖరికి రేపు ఎన్నికలు వచ్చినా, ఈ రోజే అభ్యర్థులను ప్రకటించి దూసుకుపోయేంతగా పార్టీ యంత్రాంగాన్ని సమాయత్తం చేశామని డాక్టర్ లక్ష్మణ్ చెప్పారు.

కొత్తేమీ కాదు: కోదండరామ్
ముఖ్యమంత్రి కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళతారన్న వార్త కొత్తదేమీ కాదని తెలంగాణ జన సమితి (టీజెఎస్) అధ్యక్షుడు ప్రొఫెసర్ ఎం. కోదండరామ్ అన్నారు. ప్రజలకు సరైన పాలన అందించలేక, ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడం వల్ల అభద్రతాభావంతో ఉన్న కేసీఆర్ ప్రతిపక్షాలు బలపడక ముందే ఎన్నికలకు వెళ్ళాలన్న ఆలోచన చేస్తున్నారని ఆయన విమర్శించారు. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చి ఉంటే ఈ భయం ఉండేది కాదన్నారు. అసంతృప్తితో ఉన్న ప్రజలు, వివిధ రకాలుగా వేధింపులకు గురైన వారు ఈ ప్రభుత్వానికి చరమ గీతం పాడేందుకు ఎదురు చూస్తున్నారని ప్రొఫెసర్ కోదండరామ్ తెలిపారు.

చిత్రం..కోదండరామ్