రాష్ట్రీయం

సత్తా చాటుదాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, ఆగస్టు 25: రాష్ట్రాన్ని ఆదుకుంటామని హామీ ఇచ్చి నాలుగేళ్లు వారి వెంట తిప్పుకుని చివరకు నమ్మించి మోసం చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. కర్నూలులో శనివారం నిర్వహించిన ధర్మపోరాట దీక్షలో మాట్లాడిన ఆయన తమను నమ్మించి నట్టేట ముంచిన కేంద్ర ప్రభుత్వంలోని బీజేపీపై ధర్మపోరాటం చేయడాన్ని సమర్ధించుకున్నారు. రాష్ట్రానికి రావాల్సిన ప్రతి రూపాయిని వడ్డీతో సహా వసూలు చేస్తామని, ఇందుకు ప్రజలు సహకరించాలని కోరారు. శ్రీ వెంకటేశ్వరస్వామి సాక్షిగా చెప్పిన మాటలను నెరవేర్చేంత వరకు పోరాడుతామని అన్నారు. కేంద్రం మెడలు వంచి రాష్ట్ర ప్రయోజనాలు సాధించి తీరుతామని ధీమా వ్యక్తం చేశారు. ఒక నాడు బ్రిటిష్ పాలకులకు సహకరించి దేశానికి ద్రోహం చేసిన వారున్నట్లే నేడు కూడా రాష్ట్రానికి మేలు జరుగకుండా బీజేపీకి సహకరిస్తున్న నమ్మకద్రోహులు ఉన్నారని ఆయన వైకాపానుద్దేశించి అన్నారు. విభజన సమయంలో రాష్ట్రానికి అన్నీ చేస్తామని రాజ్యసభ, లోక్‌సభలోనే కాకుండా ఎన్నికల సమయంలో రాష్ట్రంలో జరిగిన సభల్లో, ఆ తరువాత రాజధాని నిర్మాణానికి నిర్వహించిన శంఖుస్థాపన కార్యక్రమంలో కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేకపోయారని అన్నారు. విభజన సమయంలో కాంగ్రెస్ చేసిన ద్రోహానికి బీజేపీ అండగా ఉంటుందని భావించి వారిని విశ్వసించామన్నారు. అయితే వారు మాత్రం బయటకు ఒకటి చెబుతూ లోపల రాజకీయాల కోసం హామీలు ఇచ్చినట్లు అర్ధమైందన్నారు. లోక్‌సభలో మెజారిటీ రాదన్న అనుమానంతో రాష్ట్రానికి హామీలు ఇచ్చారని, అయితే అక్కడ పూర్తి మెజారిటీ రావడంతో రాష్ట్ర ప్రయోజనాలు విస్మరించారని మండిపడ్డారు. రాష్ట్రానికి బీజేపీ సహకరించకుండా స్థానిక ప్రాంతీయపార్టీలు వంత పాడటాన్ని చూస్తుంటే వారికి ప్రజాప్రయోజనాల కన్నా స్వప్రయోజనాలు ప్రాధాన్యమని ప్రజలు గుర్తించాలని కోరారు.
రాష్ట్ర రాజధాని కోసం కేవలం రూ.1500 కోట్లు ఇచ్చి అంతా ఇచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కేంద్రం ఇచ్చిన సొమ్ము రాజధాని నగరంలో విద్యుత్ తీగల ఏర్పాటుకు కూడా సరిపోదని ఎద్దేవా చేశారు. రాజధాని నిర్మాణం పనుల ప్రారంభానికి పవిత్రమైన యమునా నది నీరు, లోక్‌సభ నుంచి మట్టిని తీసుకువచ్చి ఇచ్చిన హామీలను మర్చిపోయి పవిత్రతనే అపవిత్రం చేసిన ఘనత నరేంద్ర మోదీదేనని ఆయన మండిపడ్డారు. రాష్ట్రం ఇబ్బందుల్లో ఉంటే ఆ విషయాన్ని ప్రజలకు తెలియకుండా వారి ప్రయోజనాల కోసం అనేక సంక్షేమ
పథకాలు ప్రవేశపెట్టామన్నారు. రైతులు, పొదుపు మహిళల రుణమాఫీ చేసిన విషయాన్ని గుర్తుచేశారు. దేశంలో నదుల అనుసంధానంపై చర్చ జరుగుతుంటే తాను గోదావరి, కృష్ణానదులను అనుసంధానం చేసి చూపించానని పేర్కొన్నారు. పట్టిసీమ ఎందుకు అన్న నాయకులు ఇప్పుడు నోరు మెదపలేని పరిస్థితిలో పడ్డారని చంద్రబాబు అన్నారు. పట్టిసీమ
ద్వారా గోదావరి జలాలను కృష్ణాడెల్టాకు ఇచ్చి అక్కడ మిగిలిన నీటిని శ్రీశైలం జలాశయంలో నిల్వచేసి రాయలసీమ జిల్లాలకు అందజేస్తున్నామని పేర్కొన్నారు. రాష్ట్రంలో రెండు కోట్ల ఎకరాలకు సాగునీరు అందించాలన్న లక్ష్యంతో తాము పని చేస్తున్నామని బాబు తెలిపారు. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాల్సిన కేంద్రం మీనమేషాలు లెక్కిస్తుంటే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా కోట్ల రూపాయలు ఖర్చు చేసి పనులు కొనసాగిస్తున్నామని పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన ప్రతి విషయానికి అడ్డంకులు సృష్టిస్తూ నిధులు ఇవ్వడం లేదని ఆరోపించారు. మరో వైపు కేంద్రం నుంచి వస్తున్న నిధుల ఖర్చు విషయంలో కూడా పీడీ ఖాతాల్లో అవినీతి జరిగిందని బురద జల్లుతున్నారని మండిపడ్డారు. కేంద్రంలో అధికారంలో ఉన్న వారే ఈ ఆరోపణలు చేస్తున్నారని, వారు చెప్పేది వాస్తవమే అయితే విచారణ ఎందుకు జరిపించడం లేదని బాబు ప్రశ్నించారు. కేవలం బురదజల్లి ప్రజల దృష్టిని మరల్చడానికి వారు ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అవినీతికి తావులేకుండా ప్రజలకు సంబంధించిన ప్రతి పైసా ఖర్చు చేస్తున్న తమపై బురదజల్లే ప్రయత్నం చేసినా ఫలితం లేదని అన్నారు. విద్యనభ్యసించే వారికి దేశంలోనే కాకుండా విదేశాల్లో చదవడానికి కూడా ఆర్థిక సహాయం అందజేస్తున్నామన్నారు. పేదల ఆకలి తీర్చడానికి అన్న క్యాంటీన్లలో అతి తక్కువ ధరకు అల్పాహారం, భోజన సదుపాయాలు కల్పిస్తున్నామని చంద్రబాబు అన్నారు. ఆరోగ్య బీమా, మరణించిన పేదవారి కుటుంబాలకు ఆర్థిక సహాయం అందిస్తూ ప్రతి ఒక్కరికి ప్రభుత్వం అండగా ఉంటుందని ప్రజల్లో ధీమా కల్పించగలిగామని పేర్కొన్నారు.
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నల్లధనాన్ని వెలికితీస్తామని చెప్పి ఏం చేశారని సీఎం ప్రశ్నించారు. ప్రతి పేదవాడి ఖాతాలో రూ.15 లక్షలు జమ చేస్తామని చెప్పిన మాట ఏమైందో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రాన్ని అభివృద్ధిపథంలో నడిపేందుకు విదేశాలు
తిరిగి పెట్టుబడులు పెట్టాలని కోరితే తనపై నమ్మకంతో భారీ పరిశ్రమల ఏర్పాటుకు ఔత్సాహికులు ముందుకు వస్తుంటే నరేంద్ర మోదీ, ఆయన భజనపరులు దిక్కులు చూస్తున్నారని అన్నారు. ఓ నాయకుడు ప్రతి శుక్రవారం అవినీతికేసుల్లో కోర్టుల చుట్టూ తిరుగుతూ బయటకు వచ్చి తనను విమర్శిస్తుంటే నవ్వొస్తోందని చంద్రబాబు ఎద్దేవా చేశారు. ఆయన అవినీతి సొమ్ము ప్రభుత్వానికి అప్పగిస్తే మరింత అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించవచ్చన్నారు.

చిత్రం..ధర్మపోరాట దీక్షలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు