రాష్ట్రీయం

రాళ్లసీమను రతనాల సీమ చేస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప, ఆగస్టు 25: ‘రాష్ట్రంలోని ఐదు నదులను అనుసంధానం చేస్తాం, ఒక్క గోదావరి నుంచే 15 లక్షల క్యూసెక్కులు అంటే 150 టీఎంసీల నీరు సముద్రం పాలైంది. భవిష్యత్‌లో ఈ నీటినంతా వినియోగిస్తాం. పట్టిసీమ ద్వారా గోదావరి, కృష్ణా నదులను అనుసంధానం చేశాం. గోదావరి, పెన్నా నదులను అనుసంధానం చేయబోతున్నాం. భవిష్యత్‌లో గోదావరి, వంశధార, నాగావళి, కృష్ణా, పెన్నా నదులు ఐదింటినీ అనుసంధానం చేయబోతున్నాం’ అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తన జలస్వప్నాన్ని విద్యార్థుల ముందు ఆవిష్కరించారు. శనివారం కడప నగరంలోని యోగివేమన విశ్వవిద్యాలయం క్యాంపస్‌లో జరిగిన 69వ ‘వనం-మనం’ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో 2 కోట్ల ఎకరాలకు సాగునీరు అందిస్తామన్నారు. అందులో కోటి ఎకరాలకు మైక్రోఇరిగేషన్‌తో నీళ్లు ఇస్తామన్నారు. మైక్రోఇరిగేషన్ వల్ల ఒక ఎకరాకు పారే నీరు రెండెకరాలకు సరిపోతుందన్నారు. ప్రకృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత భావితరాలైన విద్యార్థులపై ఉందని చెబుతూ ప్రకృతి అసమతుల్యం వల్లే అతివృష్టి, అనావృష్టి సంభవిస్తున్నాయన్నారు. కేరళలో వరదలు ముంచెత్తి అతివృష్టి ఏర్పడితే, కడప జిల్లాలో సాధారణ వర్షపాతం కన్నా 58 శాతం తక్కువతో అనావృష్టి ఏర్పడిందన్నారు. రాష్ట్రంలో జీరో బడ్జెట్ వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు 5 లక్షల ఎకరాల్లో ప్రకృతి సేద్యం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఎరువులు, పురుగుమందులు వాడకుండా తక్కువ పెట్టుబడితో నాణ్యమైన పంటలు పండించే విధానాన్ని అమలులోకి తేవాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. జిల్లాలోని అన్ని ప్రాజెక్టులతో కలిపి 90 టీఎంసీల నీరు నిల్వ ఉంచే అవకాశం ఉందన్నారు. అది జరగాలంటే సముద్రం పాలవుతున్న గోదావరి, కృష్ణానదుల నీటిని మళ్లించాల్సి ఉంటుందన్నారు. నదుల అనుసంధానం ద్వారా దాన్ని నెరవేరుస్తామన్నారు. రాష్ట్రంలో ఎక్కడ కురిసిన నీరు అక్కడే భూగర్భజలంగా మార్చేందుకు 10 లక్షల ఫారంపాండ్స్, చెక్‌డ్యామ్‌లు, కాంటూర్ ట్రెంచర్స్ నిర్మిస్తున్నామన్నారు. అడవిలో ట్రెంచర్స్ నిర్మించి నీటిని భూగర్భజలంగా మార్చే విధానాన్ని అమలుచేస్తున్నామన్నారు. రాష్ట్రంలో 57 ప్రాజెక్టులు పూర్తి చేయాల్సి ఉందన్నారు. 15 నుంచి 20 ప్రాజెక్టులు దాదాపు పూర్తయ్యాయని ఆయన అన్నారు. మరో 20 ప్రాజెక్టులు వచ్చే ఏడాది జూన్ లోగా పూర్తి అవుతాయని ముఖ్యమంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. కుప్పం కన్నా ముందు పులివెందులకు నీళ్లు ఇస్తామనే మాటను నిలబెట్టుకున్నామని ఆయన మరోసారి ఉద్ఘాటించారు. చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌కు లిఫ్టుల ద్వారా నీరు ఇచ్చామని, అందువల్లే పులివెందుల నియోజకవర్గంలోని లింగాల మండలం పండ్ల తోటలతో సుభిక్షంగా ఉందన్నారు. నీళ్లు ఉంటే కడప జిల్లాను ఒక హార్టికల్చర్ హబ్‌గా మార్చవచ్చునని, ఆ పని చేస్తామని అన్నారు. జిల్లా విస్తీర్ణం 15,380 చదరపు కిలోమీటర్లు ఉంటే, అందులో 5050 చదరపు కిమీ అటవీ ప్రాంతం ఉందని, దీన్ని 50 శాతం పచ్చదనానికి పెంచాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. రాష్ట్రంలో 23 శాతం అడవులతో పచ్చదనం ఉందని, ఇటీవల మైదానాల్లో పండ్ల తోటలను పెంచడం ద్వారా మరో 3 శాతం పెరిగిందన్నారు. దీన్ని 50 శాతానికి పెంచడం లక్ష్యమన్నారు. రాష్ట్రంలో రెండు నేషనల్ పార్కులు, 13 సైన్సరీస్, ఒక టైగర్ పార్కు ఉన్నాయన్నారు. విశాఖపట్టణం, తిరుపతిలో రెండు జంతు ప్రదర్శనశాలలు ఏర్పాటు చేయబోతున్నామన్నారు. ఒక ఎలిఫెంట్ సఫారి ఉందన్నారు. రాష్ట్రంలో 11 నగరవనాలకు శ్రీకారం చుట్టామని, 9 ఏకోటూరిజం సెంటర్లు అభివృద్ధి చేయబోతున్నామని, 13 టెంపుల్ టూరిజం కేంద్రాల్లో పార్కులు పెట్టి ఏకో టూరిజానికి అనుసంధానం చేస్తామన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో పార్కులు, పచ్చదనం, పరిశుభ్రతతో ఏకో టూరిజంను అభివృద్ధి చేశామన్నారు.
చిత్రం..కడపలో శనివారం జరిగిన వనం-మనం కార్యక్రమంలో ప్రసంగిస్తున్న ముఖ్యమంత్రి