రాష్ట్రీయం

పారదర్శకంగా ఎన్నికలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: తెలంగాణ శాసనసభకు జరగబోయే ఎన్నికలు పారదర్శకంగా నిర్వహిస్తామని, ఏ స్థాయిలోనూ, ఎక్కడ కూడా లోపాలు లేకుండా చూస్తామని చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ (సీఈఓ) రజత్ కుమార్ ప్రకటించారు. జిల్లా ఎన్నికల అధికారులైన జిల్లా కలెక్టర్లకు సోమవారం ఇక్కడ ఐటీ తదితర అంశాల్లో ఒకరోజు శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులతో సీఈఓ మాట్లాడుతూ, ఆరు నెలల్లోగా ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుందని, అందుకే, వీలైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని స్పష్టం చేశారు. స్వేచ్ఛగా ఓటర్లు తమ ఓటుహక్కు ఉపయోగించుకోవాలన్నదే కేంద్ర ఎన్నికల కమిషన్ ఉద్దేశమన్నారు.
రాష్ట్రంలో తాజాగా చేపట్టిన ఓటర్ల జాబితా సవరణ క్రమశిక్షణతో, నిబద్ధతతో, తప్పులు లేకుండా కొనసాగేలా చూడాలని, ఎక్కడ, ఏ రకమైన తప్పు జరిగినా సంబంధిత సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. ఓటర్ల జాబితానుండి పేర్లు ఎలా తొలిగిపోయాయన్న అంశాన్ని ఒకవైపు పరిశీలిస్తూ, తొలిగిపోయిన వారు వెంటనే దరఖాస్తు చేస్తే వారిపేర్లను తిరిగి జాబితాలో చేర్చాలని సూచించారు. 2018 జనవరి ఒకటో తేదీనాటికి 18 సంవత్సరాలు
నిండినవారు కొత్తగా దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఇచ్చామని, దీనిని యువతీయువకులు ఉపయోగించుకోవాలని సూచించారు. ఓటర్ ఐడీ కార్డుల్లో ఎవరి సమాచారమైనా తప్పుగా ప్రచురించి ఉంటే సరిచేసుకునే అవకాశం కల్పించామని గుర్తు చేశారు. ఓటర్ల జాబితాను ఈ పర్యాయం ఎలాంటి తప్పులు లేకుండా రూపొందించాలన్నదే తమ ఉద్దేశమని, కేంద్ర ఎన్నికల కమిషన్ ఇదే అంశాన్ని పదే పదే తమతో చెప్పిందని అన్నారు. నిర్ణీత ఫారంలో దరఖాస్తు చేసిన వారి పేర్లను వెంటనే జాబితాలో చేరుస్తామని, ఎలాంటి జాప్యం చేయబోమని వెల్లడించారు. ముందు వచ్చిన దరఖాస్తులను ముందుగా పరిష్కరించాలని కిందిస్థాయి సిబ్బందికి ఆదేశాలు జారీ చేశామన్నారు. గత మూడు రోజులుగా గ్రామాలు, పట్టణాలు, నగరాల్లో ఓటర్ల జాబితా సవరణకు సంబంధించి ప్రత్యేక ప్రచారం చేపట్టామన్నారు. పోలింగ్ బూత్‌స్థాయిలో సంబంధిత అధికారులు ఓటర్ల జాబితా సవరణ సమయంలో డ్యూటీలో ఉండాలని ఆదేశాలు జారీ చేశామని రజత్ కుమార్ గుర్తు చేశారు. ఈ ప్రక్రియ ఎలా సాగిందో నివేదిక అందించాలంటూ కలెక్టర్లను ఆదేశించామన్నారు.
ఐటీ సేవలను ఈ ఎన్నికల్లో పూర్తిగా వినియోగిస్తున్నామని, పది ఐటీ అప్లికేషన్స్‌ను ఉపయోగిస్తున్నామని రజత్ కుమార్ తెలిపారు. ఐటీ అంశాల్లో కలెక్టర్లకు శిక్షణ ఇచ్చేందుకు ఢిల్లీ నుండి ఈసీఐ ప్రత్యేక బృందాన్ని పంపించిందని తెలిపారు. ఐటీ సేవలు పజలకు అందించేందుకు ప్రధానంగా సీ-విజిల్ అనే యాప్‌ను రూపొందించామని తెలిపారు. ఎన్నికల ప్రక్రియలో ఎక్కడైనా, ఏవైనా లోపాలు జరిగితే విలేఖరులు, సామాన్యులు, ఉద్యోగులు, స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులు తదితరులు ఎవరైనా ఈ యాప్ ద్వారా ఫోటోలను, వీడియోలను, సమాచారాన్ని పంపించవచ్చన్నారు. ఈ యాప్‌ను కేంద్ర ఎన్నికల కమిషన్ నేరుగా పర్యవేక్షిస్తుందని, యాప్ ద్వారా తమ దృష్టికి వచ్చిన అంశాలపై తక్షణమే స్పందించి, తగిన చర్యలు తీసుకుంటామని రజత్ కుమార్ వివరించారు. జిల్లా స్థాయిలో సిబ్బందికి శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తామని వెల్లడించారు. జిల్లా కలెక్టర్లు ఈ తరహా శిక్షణా కార్యక్రమాలను పర్యవేక్షిస్తారన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్లు, జీహెచ్‌ఎంసీ కమిషనర్ తదితరులు పాల్గొన్నారు.
చిత్రం..శిక్షణ కార్యక్రమంలో మాట్లాడుతున్న సీఈఓ రజత్ కుమార్