రాష్ట్రీయం

ఏనుగుల కథ సుఖాంతం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం, సెప్టెంబర్ 16: గత పది రోజులుగా అటు అటవీశాఖ అధికారులను, ఇటు ప్రజలను హడలెత్తించిన ఏనుగుల కథ సుఖాంతమైంది. ఏనుగుల గుంపును ఆంధ్రా-ఒడిశా సరిహద్దు ప్రాంతమైన కొమరాడ మండలం జంఝావతి అడవుల్లోకి పంపివేయడంలో అటవీశాఖాధికారులు సఫలమయ్యారు. ఏనుగుల వల్ల ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా ముందు జాగ్రత్తలు తీసుకున్నారు. కొన్ని నెలలుగా శ్రీకాకుళం జిల్లా మందసలో ఉన్న ఏనుగుల గుంపు ఇటీవల జిల్లాలోని జియ్యమ్మవలస మండలం పెద్దబుడ్డిడి గ్రామానికి చేరాయి. అడవి నుంచి మైదాన ప్రాంతాల్లోకి ఏనుగులు గుంపు రావడంతో ఆయా గ్రామాల్లోని ప్రజలకు కంటిమీద కునుకు లేకుండాపోయింది. ఏనుగులు ప్రవేశించిన గ్రామాల్లో చెరకు, అరటి పంటలు ధ్వంసమయ్యాయి. ఏనుగుల దాడిలో ఇద్దరు గాయాలపాలైన విషయం విదితమే. ప్రస్తుతం ఏనుగులు మైదాన ప్రాంతం విడిచి అడవుల్లోకి వెళ్లాయని డీఎఫ్‌వో జి.లక్ష్మణ్ మంగళవారం తెలిపారు. ఏనుగులు అడవిలో ఎక్కడ ఉన్నదీ జీపీఎస్ లొకేషన్ల ద్వారా పరిశీలిస్తామన్నారు. ఇందుకోసం కొమరాడ మండలం జంఝావతి ప్రాజెక్టు సమీపంలోని రాజ్యలక్ష్మిపురం గ్రామం వద్ద ఐదు బృందాలను నియమించామన్నారు. వీరు వారం రోజులపాటు అక్కడే ఉండి ఏనుగులు ఏ దిశలో వెళ్తున్నాయో పరిశీలిస్తారన్నారు. కాగా, గత పది రోజులుగా ఏనుగులు జియ్యమ్మవలస, జిఎల్ పురం, గరుగుబిల్లి, కొమరాడ మండలాల్లో పంటలను ధ్వంసం చేసిన విషయం విదితమే. తొలుత జిల్లాలోని జియ్యమ్మవలస మండలం పెద్దబుడ్డిడి గ్రామం చేరుకున్న ఏనుగుల గుంపు అక్కడి పోలీస్ స్టేషన్ వెనుక నుండి బిల్లవానిగుడా చేరుకున్నాయి. ఆ తరువాత అక్కడ నుంచి వనిజ మీదుగా చినబుడ్డిడికి వచ్చాయని డీఎఫ్‌వో లక్ష్మణ్ తెలిపారు. ఆ తరువాత అక్కడి నుంచి తోటపల్లి బ్యారేజ్ సమీపంలో గిజబ గ్రామానికి, అక్కడి నుంచి బాసంగి, తరువాత నాగావళి నదిని దాటి గుణానపురం, కొమరాడ మండలం ఆర్తాం వద్ద ఆగాయన్నారు. ఆర్తాం వద్ద రిజర్వు ఫారెస్టులోకి వెళ్తూ రాత్రివేళ తిరిగి గ్రామంలోకి వచ్చేవని వివరించారు. దీంతో అక్కడి నుంచి రెవెన్యూ, ఇతర శాఖల సహకారంతో రిజర్వు ఫారెస్టులోకి ఏనుగులను పంపివేయగలిగామన్నారు. పంట నష్టం జరిగిన రైతులకు నష్టపరిహారం అందజేస్తామని, ఏనుగుల దాడిలో గాయాలపాలైన వారికి నిబంధనల మేరకు నష్టపరిహారం చెల్లిస్తామన్నారు.