రాష్ట్రీయం

నిఘా వైఫల్యంపై మల్లగుల్లాలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), సెప్టెంబర్ 24: విశాఖ జిల్లా అరకు ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేలను పొట్టన పెట్టుకున్న మావోయిస్టుల హత్యాకాండ నేపథ్యంలో రాష్ట్ర పోలీసు శాఖ దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది. రాష్ట్రంలో మావోల ప్రభావమే లేదనే ధీమాతో ఉన్న పోలీసులకు తాజా ఉందంతం మరోసారి గట్టి గుణపాఠం చెప్పినట్లైంది. దీంతో ఉన్నతాధికారులు మేల్కొన్నారు. ఇటు రాష్ట్ర పోలీసు శాఖ, మరోవైపు ఇంటిలిజెన్స్ విభాగం వైఫల్యాలపై మల్లగుల్లాలు పడుతున్నారు. మావోయిస్టు వారోత్సవాల నేపథ్యంలో నేరపూరిత ఘటనలు చోటుచేసుకునే అవకాశాలు ఉన్నాయని, వీఐపీలు, ప్రజాప్రతినిధులు బయటకు వెళ్లేముందుగా తెలియచేయాలని ఇప్పటికే సూచించినట్లు పోలీసులు చెబుతున్నా.. భద్రత కల్పించనందునే ఈ ఘటన జరిగినట్లు బలైపోయిన ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు ఆరోపిస్తుండటం గమనార్హం. ముఖ్యమంత్రి, డీజీపీ విదేశీ పర్యటనల్లో ఉండటం, అధికార పార్టీ ఎమ్మెల్యేను మావోలు పొట్టన పెట్టుకోవడాన్ని పోలీసు శాఖ తీవ్రంగా పరిగణిస్తోంది. సోమవారం ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే అంత్యక్రియలను పురస్కరించుకుని విస్తృత బందోబస్తు ఏర్పాటు చేయగా రాష్ట్ర అదనపు డీజీపీ (లా అండ్ ఆర్డర్) హరీష్‌కుమార్ గుప్తా, డీఐజీ సీహెచ్ శ్రీకాంత్ స్వయంగా దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు విశాఖ ఏజెన్సీని ప్రత్యేక బలగాలు జల్లెడ పడుతున్నాయి. విశాఖ రూరల్ ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ నేతృత్వంలో ప్రత్యేక బలగాలు కూంబింగ్ జరుపుతున్నాయి. ఘటన జరిగిన సమయంలో అక్కడున్న ప్రత్యక్ష సాక్షులు, ఎమ్మెల్యే గన్‌మెన్‌ల స్టేట్‌మెంట్ ఆధారంగా వారిచ్చిన గుర్తుల ప్రకారం ఆపరేషన్‌లో పాల్గొన్న మావోల్లో కొందరి ఫోటోలను పోలీసు శాఖ విడుదల చేసింది. వీరిని ఇప్పటికే ప్రత్యక్ష సాక్షులు గుర్తుపట్టినట్లు తెలుస్తోంది. దగ్గరుండి చూసినవారు చెబుతున్నట్లుగా 20 నుంచి 50 మంది వరకు మావోలు ఈ ఘటనలో పాల్గొనగా.. వారు గుర్తుపట్టిన ముగ్గురి ఫొటోలు, వివరాలను పోలీసు శాఖ బహిర్గతపరిచింది. తూర్పు గోదావరి జిల్లా అడ్డతీగల పోలీస్టేషన్ పరిధిలోని దబ్బపాలం గ్రామానికి చెందిన జులుమూరి శ్రీనుబాబు అలియాస్ సునీల్, రైనో, పశ్చిమ గోదావరి జిల్ల భీమవరం పట్టణానికి చెందిన కామేశ్వరి అలియాస్ స్వరూప, సింద్రి చంద్రి, రింకీ, విశాఖ జిల్లా పెందుర్తి మండలం కరకవానిపాలెం గ్రామానికి చెందిన వెంకట రవి చైతన్య అలియాస్ అరుణను ముఖ్యులుగా గుర్తించారు. తాజా ఉందంతంలో పోలీసు, నిఘా విభాగం వైఫల్యాలు స్పష్టమవుతున్న నేపథ్యంలో ఆత్మరక్షణలో పడిన పోలీసు శాఖ దిద్దుబాటు చర్యల్లో భాగంగా దుంబ్రిగూడ ఎస్‌ఐ అమ్మనరావుపై వేటువేసింది. విధుల్లో నిర్లక్ష్యం వహించినందుకు బాధ్యుడిని చేస్తూ ఉన్నతాధికారులు ఈయనను సోమవారం సస్పెండ్ చేశారు. స్థానికంగా పోలీసుల నిర్లక్ష్యం, వైఫల్యాలపై ప్రాథమిక విచారణకు కమిటీని ఏర్పాటు చేశారు. విచారణాధికారిగా విశాఖ డీసీపీ కె ఫకీరప్పను నియమించారు. మొత్తం మీద కోలుకోని దెబ్బకొట్టిన మావోల దుశ్చర్యపై దృష్టి సారిస్తూనే అంతర్గత పోలీసు వైఫల్యంపై సమీక్షించుకుంటున్న నేపథ్యంలో విదేశీ పర్యటనలో ఉన్న డీజీపీ ఆర్పీ ఠాకూర్ రాగానే ఘటనపై ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం ఏర్పాటు చేసే అవకాశం లేకపోలేదు.