రాష్ట్రీయం

గట్టి పోటీకి పార్టీల వ్యూహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 15: తెలంగాణలో వచ్చేనెలలో జరగనున్న శాససభ ఎన్నికలకు ఒకవైపు అధికారికంగా కేంద్ర ఎన్నికల కమిషన్ ఏర్పాట్లు చేస్తుండగా, మరోవైపు వివిధ రాజకీయ పార్టీలు ఎన్నికల్లో పాల్గొనేందుకు సమాయత్తం అవుతున్నాయి. ఓటర్ల జాబితా సవరణ అంశం దాదాపు నెలరోజుల పాటు చర్చనీయాంశంగా కొనసాగింది. హైకోర్టు ఆదేశాలతో ఈ అంశం సమసిపోయింది. కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఎన్నిలకు సంబంధించిన పనిలో చీఫ్ ఎలక్టోరల్ అధికారి నిమగ్నమయ్యారు.
చీఫ్ ఎలక్టోరల్ కార్యాలయంలో పరిపాలనాపరమైన పనులు వేగంగా కొనసాగేందుకు అదనపు సిబ్బందిని రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. వివిధ పార్టీలు రోజూ చేస్తున్న రకరకాల ఫిర్యాదులు వీలైతే ఇక్కడే పరిష్కరిస్తున్నారు. సీఈఓ కార్యాలయం పరిష్కరించలేని దరఖాస్తులను కేంద్ర ఎన్నికల కమిషన్‌కు (సీఈఐ) పంపిస్తున్నారు. జాతీయ, ప్రాంతీయ పార్టీలకు ఎన్నికల కమిషన్ ఇప్పటికే గుర్తులు కేటాయించినప్పటికీ, రిజిస్టర్డ్ రాజకీయ పార్టీలకు శాశ్వతంగా ఎన్నికల గుర్తులు లేవు. ఈ తరహా పార్టీలు దాదాపు 33 దాకా ఉన్నాయి. ఎన్నికల కమిషన్ రూపొందించిన గుర్తుల నుంచి ఈ పార్టీలకు, స్వతంత్ర అభ్యర్తులకు గుర్తులు కేటాయిస్తారు. రాజకీయంగా రాష్ట్రంలో ఏర్పడ్డ తాజా పరిస్థితిని పరిశీలిస్తే ప్రధానంగా నాలుగు పార్టీలు/గ్రూపుల మధ్య పోటీ జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. అధికార టీఆర్‌ఎస్ ఒంటరిగానే పోటీ చేస్తోంది. అయితే టీఆర్‌ఎస్‌కు ఎంఐఎం అండగా ఉంది. ఎంఐఎం ప్రధానంగా హైదరాబాద్ నగరంలో తన దృష్టిని కేంద్రీకరించింది. ముస్లింల ఓట్లన్నీ తమకే పడతాయన్న తలంపుతో ఈ పార్టీ నేతలు అసదుద్దీన్ ఒవైసీ, అక్బరుద్దీన్ ఒవైసీ గట్టినమ్మకంతో ఉన్నారు. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో ఎంఐఎం పోటీలో లేని నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్‌కు అండగా ఉండాలని ఎంఐఎం నిర్ణయించింది. ఎంఐఎం పోటీచేస్తున్న హైదరాబాద్‌లోని వేర్వేరు శాసనసభా నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్ స్నేహపూర్వక పోటీలో ఉంటోంది. హిందువుల ఓట్లు పూర్తిగా బీజేపీకి పడకుండా, టీఆర్‌ఎస్ కొన్నింటినైనా చీల్చగలిగితే పరోక్షంగా ఎంఐఎంకు సహకరించినట్టవుతుందని ఒకవైపు టీఆర్‌ఎస్, మరోవైపు ఎంఐఎం భావిస్తున్నాయి. అందుకే స్నేహపూర్వక పోటీ పేరుతో టీఆర్‌ఎస్ రంగంలో ఉంటోంది. ఇలా ఉండగా మహాకూటమిగా అవతరించిన నాలుగు పార్టీలు తమ రాజకీయ విధానాలను రూపొందించుకుంటున్నాయి. కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, తెలంగాణ జన సమితి (టీజేఎస్) మధ్య అవగాహన కుదిరేందుకు కసరత్తు జరుగుతోంది. మహాకూటమి తరఫున ఏ ఏ పార్టీలు ఎన్ని సీట్లలో పోటీ చేయాలో ఇంకా స్పష్టత రాలేదు. కాంగ్రెస్ తరఫున ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తదితరులు, టీడీపీ తరఫున ఎల్. రమణ తదితరులు, సీపీఐ తరఫున చాడావెంకటరెడ్డి తదితరులు, టీజేఎస్ తరఫున ప్రొఫెసర్ కోదండరాం తదితరులు సీట్ల సర్దుబాటుపై మంతనాలు జరుపుతున్నారు. మహాకూటమికి కొత్త ఎన్నికల గుర్తు ఏమీ ఉండదు. కూటమిలో ఉన్న రాజకీయ పార్టీలు తమ తమ పార్టీల గుర్తులతోనే పోటీ చేస్తాయి. ఒక పార్టీ పోటీలో ఉన్న నియోజకవర్గంలో ఆ పార్టీ అభ్యర్థికి ఇతర పార్టీలు సహకరించాలన్నదే మహాకూటమి అవగాహనలో ప్రధాన ఉద్దేశం. బీజేపీ స్వతంత్రంగా పోటీలో నిలుస్తోంది. ఈ పార్టీ ఏ ఇతర పార్టీతో పొత్తుపెట్టుకోవడం లేదు. బీజేపీ తన ఉనికిని చాటేందుకే ఒంటరిగా పోటీలో ఉండాలని నిర్ణయించింది. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని బీజేపీ తన ఓటు బ్యాంకును కాపాడుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఇక బహుజన లెఫ్ట్ పార్టీ (బీఎల్‌ఎఫ్) మరో కూటమిగా రంగంలో ఉండబోతోంది. సీపీఎం, ఎంసీపీఐ, బీఎస్‌పీ తదితర పార్టీలు కలిసి బీఎల్‌ఎఫ్‌గా ఏర్పడ్డాయి. వాస్తవంగా జాతీయ స్థాయిలో బీఎల్‌ఎఫ్‌లో 28 పార్టీలు ఉన్నప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో ప్రధానంగా మూడు పార్టీలే ఈ కూటమిలో ఉన్నాయి. సీపీఎం, సీపీఐ పార్టీలకు పాత నల్లగొండ, పాత ఖమ్మం జిల్లాల్లో ఎక్కువగా ప్రాబల్యం ఉంది.
ఇతర జిల్లాల్లో కూడా ఈ పార్టీలకు కార్యకర్తలు, నాయకులు ఉన్నప్పటికీ ఎన్నికల్లో ప్రభావం చూపించే నేతలు తక్కువగా ఉన్నారని తెలుస్తోంది. ఎన్నికల్లో ఈ నాలుగు భాగస్వామ్య పార్టీలు రంగంలో ఉండబోతున్నప్పటికీ, నామినేషన్ల ఘట్టం ప్రారంభమైన తర్వాత తిరుగుబాటు అభ్యర్థులు, స్వతంత్ర అభ్యరులు కూడా రంగంలో నిలిచే అవకాశాలు ఉన్నాయి. ప్రధాన పోటీ ఎవరెవరి మధ్య ఉండబోతోందన్నది త్వరలోనే తేలుతుంది.