రాష్ట్రీయం

ఏజెన్సీని ఏలేదెవరో..?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిలాబాద్, నవంబర్ 6: ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలోని ఎస్టీ రిజర్వుడ్ నియోజకవర్గాల్లో రాజకీయ పార్టీల భవితవ్యం తేల్చే ఈ ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. లంబాడా, ఆదిమ గిరిజన తెగల మధ్య కొనసాగుతున్న వర్గపోరు నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికల్లో పాగా వేసేందుకు రాజకీయ పార్టీలు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నాయి. జిల్లాలోని ఖానాపూర్, బోథ్, ఆసిఫాబాద్ ఎస్టీ రిజర్వుడ్ నియోజకవర్గాల్లో గిరిజనేతరుల ఓట్లే నిర్ణయాత్మక పాత్ర పోషించనున్నాయి. మూడు స్థానాల్లో టీఆర్‌ఎస్ ఇప్పటికే అభ్యర్థులను ఖరారు చేసి ప్రచారంలో దూకుడు పెంచగా కాంగ్రెస్ పార్టీ నేతలు సైతం క్షేత్రస్థాయిలో హస్తం గుర్తుతో ఓటర్లను ఆకట్టుకుంటున్నారు. ఇప్పటికే గిరిజనుల వర్గపోరు నేపథ్యంలో కాంగ్రెస్ హైకమాండ్ ఆదివాసీ, లంబాడా నేతలను వేరు వేరుగా పిలిపించుకొని టికెట్ల ఖరారుపై చర్చలు మంతనాలు సాగించి వారి మద్య సయోధ్య కుదుర్చడం ఆశాజనక పరిణామంగా రాజకీయ విశే్లషకులు పేర్కొంటున్నారు. బోథ్ ఎస్టీ నియోజకవర్గంలో మొత్తం 1,69,499 ఓట్లు ఉండగా వీటిలో 55,203 గిరిజనులు, 73,340 గిరిజనేతరులు( ఓసి,బీసీలు), 28,425 షెడ్యూల్డ్ కులాలు, 12,531 ఇతరుల ఓట్లు ఉన్నాయి. ఖానాపూర్ నియోజకవర్గంలో మొత్తం 1,51,319 ఓట్లకు గాను 53,151 ఎస్టీ ఓటర్లు ఉండగా 29,414 ఎస్సీ ఓటర్లు, 62,751 గిరిజనేతరులు, 6003 ఇతరులు ఉన్నారు. అదే విధంగా ఆసిఫాబాద్ ఎస్టీ నియోజకవర్గంలో మొత్తం 1,60,040 ఓటర్లకు గాను 80,319 ఎస్టీ ఓటర్లు ప్రాతినిథ్యం వహిస్తుండగా 21,373 ఎస్సీ ఓటర్లు, 54,213 గిరిజనేతరులు, 4,135 ఇతరుల ఓట్లు ఉన్నాయి. అయితే ఈ మూడు నియోజకవర్గాలను పరిశీలిస్తే బోథ్, ఆసిఫాబాద్ స్థానాల్లో ఆదిమ గిరిజనుల ఓట్లు అధికంగా ఉండడంతో అక్కడ ఆదిమ తెగలకు చెందిన అభ్యర్థులనే రంగంలోకి దించేలా కాంగ్రెస్ పార్టీ కసరత్తు సాగించింది. ఆదిమ తెగ నుండి ఉద్యమాలకు నాయకత్వం వహిస్తున్న మాజీ ఎమ్మెల్యేలు ఆత్రం సక్కుకు ఆసిఫాబాద్ స్థానం, బోథ్ నుండి మాజీ ఎమ్మెల్యే సోయం బాపురావుకు టికెట్లు ఖాయమనే ప్రచారం సాగుతోంది. అధిష్ఠానం కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో నియోజకవర్గాల్లో వారిద్దరు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఖానాపూర్‌లో లంబాడా ఓట్ల ప్రాబల్యం అధికంగా ఉండడంతో మాజీ ఎంపి రమేష్ రాథోడ్ పేరు ఖాయమని తెలుస్తోంది. ఆయన కూడా ఇప్పటికే నెల రోజులుగా ప్రచారాన్ని ముమ్మరం చేయడం గమనార్హం. బోథ్ నుండి టీఆర్‌ఎస్ తరపున తాజా మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు, ఖానాపూర్ నుండి రేఖానాయక్ ఇద్దరు లంబాడా తెగ నుండి పోటీ చేస్తుండగా ఆసిఫాబాద్‌లో ఆదివాసీ తెగకు చెందిన కోవలక్ష్మి మరోసారి కారుగుర్తుపై బరిలో నిలిచారు. కాంగ్రెస్ ఈసారి వ్యూహాత్మకంగా రెండు తెగల నేతలతో సంప్రదించి అభ్యర్థులను పోటీలోకి దించడంతో రాజకీయ సమీకరణలు వేడెక్కాయి. మూడు చోట్ల టీఆర్‌ఎస్‌కు కాంగ్రెస్ గట్టిపోటీనిచ్చే అవకాశం ఉండగా మహాకూటమిలోని మిత్రపక్షాలు ఈ మూడు స్థానాలను కాంగ్రెస్‌కే వదిలిపెట్టేందుకు అంగీకారం తెలిపినట్లు విశ్వసనీయంగా తెలిసింది. మరోవైపు సాంప్రదాయ ఓటుబ్యాంకుపై ఆశలు పెట్టుకున్న బిజెపి బలమైన అభ్యర్థులను రంగంలోకి దించేలా పావులు కదుపుతోంది. బోథ్ నుండి ఆదిమ గిరిజన తెగకు చెందిన బిజెపి రాష్ట్ర నాయకుడు మడావి రాజు పేరును ఖరారు చేయగా ఖానాపూర్‌లో ఆదివాసీ నేత సట్ల అశోక్‌ను బరిలో దించడంతో పోటీ రసవత్తరంగా మారనుంది. ఆసిఫాబాద్‌లో కాంగ్రెస్, టిజెఎస్ టికెట్ ఆశిస్తున్న నేతలకు టికెట్ దక్కకపోతే వారిలో బలమైన అభ్యర్థిని బిజెపి తరపున పోటీకి దించేలా ఆ పార్టీ రాష్ట్ర నేతలు మంతనాలు జరుపుతున్నట్లు తెలిసింది. ఇక్కడ బిజెపి తరపున ఆత్మరాం నాయక్‌ను వ్యూహాత్మకంగా పోటీకి దించారు. ఇద్దరు ఆదివాసీ అభ్యర్థులు రంగంలో ఉంటే ఓట్లు చీలి బిజెపికి అనుకూలిస్తాయని భావించి ఎత్తుగడలతో అక్కడ కమల నాథులు లంబాడా అభ్యర్థికి టికెట్ కేటాయించారు. ఏది ఏమైనా మూడు ఎస్టీ నియోజకవర్గాల్లో గెలుపు ఓటములను ప్రభావితం చేసే గిరిజనేతరుల ఓట్లు ఈ ఎన్నికల్లో కీలకం కావడంతో వారి మద్దతు కోసం రాజకీయ పార్టీలు కాకా పడుతున్నాయి.
చిత్రాలు.. సంప్రదాయ దుస్తుల్లో లంబాడా మహిళలు
*ఆదిమ గిరిజన గుస్సాడీ నృత్యం