రాష్ట్రీయం

తొలగని ప్రతిష్టంభన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: మహాకూటమి భాగస్వామ్యపక్షాల మధ్య ఇంకా సీట్ల సర్దుబాటు జరగలేదు. శనివారం జరిగిన చర్చలు అసంపూర్తిగా ముగిసాయి. దీంతో కూటమిలోని టీడీపీ, టీజేఎస్ నేతలు అసంతృప్తి వ్యక్తం చేయగా, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట రెడ్డి మరో
ముందడుగు వేసి ఐదు స్థానాలకు ఏకంగా అభ్యర్థులనే ప్రకటించారు. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి ఆర్‌సీ కుంతియా రెండు రోజుల పాటు దుబాయి పర్యటనకు వెళ్లినందున చర్చలకు బ్రేక్ పడింది. శనివారం ఓ స్టార్ హోటల్‌లోకుంతియా తెలంగాణ జన సమితి (టీజేఎస్) అధ్యక్షుడు ప్రొఫెసర్ ఎం. కోదండరామ్‌తో మంతనాలు జరిపారు. చర్చలు ఫలప్రదం కాలేదు. తాను తమ పార్టీ స్టీరింగ్ కమిటీలో చర్చించి చెబుతానంటూ కోదండరామ్ వెళ్లిపోయారు. ఆయన నేరుగా తన నివాసానికి వెళ్ళి స్టీరింగ్ కమిటీ సభ్యులతో సమావేశమై కాంగ్రెస్ అనుసరిస్తున్న తీరుపై బాధను వ్యక్తం చేశారు. ఇక అన్ని స్థానాలకు పోటీ చేయాలంటూ మిగతా నాయకులు ఆయనకు సూచించారు. ‘ఇది సరైన సమయం కాదు. వేర్వేరుగా పోటీ చేసినట్లయితే ఓట్లు చీలిపోతాయి. మళ్లీ టీఆర్‌ఎస్‌కే అధికారం అప్పగించినట్లు అవుతుంది’అని కోదండరామ్ అభిప్రాయపడినట్లు సమాచారం.
మరోవైపు తెలంగాణ టీడీపీ అధ్యక్షుడ ఎల్. రమణ, పార్టీ నాయకులు నామా నాగేశ్వర రావు, రావుల చంద్రశేఖర్ రెడ్డి తదితరులతో సమావేశమై సీట్ల సర్దుబాటులో కాంగ్రెస్ అనుసరిస్తున్న తీరుపై చర్చించారు. పొత్తుల విషయంలో పట్టింపులు వద్దని పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇదివరకే పార్టీ తెలంగాణ నాయకులకు సూచించారు. కాంగ్రెస్ ఇస్తామన్న 14 సీట్లలో మెజారిటీ సీట్లను పాతనగరంలో, ఓడిపోయే సీట్లను కేటాయించాలని ప్రయత్నించడంపై వారు కినుక వహించారు. తాము అడిగిన సీట్లను, బలమైన సీట్లను, 2014లో తమ పార్టీని గెలిపించిన సీట్లను కోరితే కాంగ్రెస్ ‘నో’ అంటోందని నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఉదాహరణకు ఎల్‌బీ నగర్, ఇబ్రహీంపట్నం సీట్లను టీడీపీ కోరుతున్నది. 2014 ఎన్నికల్లో ఆ రెండు స్థానాల్లోనూ టీడీపీ గెలుపొందిన సంగతి తెలిసిందే. కాగా ఇప్పుడు ఆ స్థానాలు ఇచ్చేందుకు కాంగ్రెస్ వెనుకాడుతున్నది. దీంతో చర్చల్లో ప్రతిష్టంభన ఏర్పడుతోంది.
ఇక తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు డాక్టర్ చెరకు సుధాకర్ తమకు మూడు స్థానాలు కావాలని కోరగా, ఒక్క నకిరేకల్ సీటు ఇచ్చేందుకు కాంగ్రెస్ సుముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం. ఆ ఒక్క సీటు విషయంలోనూ కోమటిరెడ్డి బ్రదర్స్ అడ్డు చెప్పడంతో అదీ ఖరారు కాలేదు. దీంతో ఎక్కడికక్కడ సీట్ల పంచాయితీ తేలక కాంగ్రెస్ నేతలకు తలనొప్పిగా మారింది.
కాగా ఎన్నికల సమయంలో సీట్ల సర్దుబాటు చేయకుండా జాప్యం చేయడం సరైంది కాదని ప్రొఫెసర్ కోదండరామ్ విమర్శించారు. శనివారం టీజేఎస్ స్టీరింగ్ కమిటీ సమావేశానంతరం ఆయన మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ కూటమిలో ప్రధాన పాత్ర పోషిస్తున్న కాంగ్రెస్సే జాప్యం చేస్తున్నదని విమర్శించారు. సీట్ల సర్దుబాటు విషయంలో రోడ్డు మ్యాప్ లేకపోవడం వల్లే అనిశ్చితి నెలకొందని అన్నారు. సర్దుబాటు విషయంలో కొన్ని చిక్కులు ఉన్నాయని, ఒకటి, రెండు రోజుల్లో పరిష్కారమవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే సోషల్ మీడియాలో సీట్ల సర్దుబాటు, కూటమి అంటేనే వ్యంగ్యంగా వార్తలు రావడం బాధాకరమని అన్నారు. ప్రతి పార్లమెంటు సీటు పరిథిలో ఒక అసెంబ్లీ సెగ్మెంట్ తమకు కావాలని అడిగామని ఆయన చెప్పారు. ఉమ్మడి ఎన్నికల గుర్తుపై ఈసీ అభిప్రాయం తీసుకున్నామని ఆయన తెలిపారు.