రాష్ట్రీయం

చేతగాని కూటమి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 13: సీట్లు కూడా పంచుకోవడం చేతగానివాళ్లు సర్కార్‌ను ఎలా నడిపిస్తారో ప్రజలు ఆలోచించాలని అద్ధర్మ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు.పొద్దున పూట అభ్యర్థులను ప్రకటిస్తే గాంధీభవన్‌పై దాడి చేస్తారన్న భయంతోనే అర్ధరాత్రి ప్రకటించారని ఎద్దేవా చేశారు. గాంధీభవన్ వద్ద టికెట్ రాని నిరసనకారులు కొందరు సెలైన్ బ్యాటిల్స్ పట్టుకొని కనిపించారని, అది గాంధీభవనేనా? లేక గాంధీ ఆస్పత్రా? అనే అనుమానం కలిగిందని విమర్శించారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని చంద్రబాబుకు తాకట్టు పెడితే, ఈ ప్రాంతంపై ప్రేమ ఎందుకుంటుందని ప్రశ్నించారు. జలవిహార్‌లో మంగళవారం దివ్యాంగ పెన్షనర్ల కృతజ్ఞత సభను ఉద్దేశించి మాట్లాడిన కేటీఆర్ నలభై ఏళ్ల విబేధాలను పక్కనపెట్టి కేసీఆర్‌ను ఓడించాలన్న ఏకైక లక్ష్యంతో చిత్ర, విచిత్రమైన వ్యక్తులు ఒకచోట చేరి మహాకూటమి ఏర్పాటు చేశారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ నేతలు ఇంతకాలం తమ ఆస్తులు పెంచుకున్నారే తప్ప కనీసం మంచినీళ్లు కూడా ఇవ్వలేకపోయారన్నారు. నల్లగొండ జిల్లాలో ఫ్లోరోసిస్ కాంగ్రెస్ పుణ్యమేనని మండిపడ్డారు. కేసీఆర్ దూరదృష్టితో మిషన్ భగీరథ పథకాన్ని తీసుకొచ్చి ఇంటింటికి మంచినీళ్లు ఇస్తున్నరన్నారు. ఈ నెలాఖరుకల్లా మిషన్ భగీరథ పూర్తి అవుతుందన్నారు. ప్రజల అవసరాలను, తెలంగాణ ప్రాధాన్యతలను గుర్తించి పని చేస్తున్న టీఆర్‌ఎస్ ప్రభుత్వానే్న మళ్లీ అధికారంలోకి తీసుకరావాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. ఆదాయాన్ని పెంచి పేదలకు పంచాలన్నది కేసీఆర్ లక్ష్యమన్నారు. పేద ప్రజల సంక్షేమం కోసం బడ్జెట్‌లో 43 శాతం నిధులు ఖర్చు చేస్తున్న ఏకైక ప్రభుత్వం తెరాస ప్రభుత్వమేనని కేటీఆర్ గుర్తు చేశారు. టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చాక పేదల కోసం వివిధ రకాల 453 కార్యక్రమాలను అమలు చేస్తున్నామన్నారు. ప్రస్తుతం దివ్యాంగులకు ఇస్తున్న పెన్షన్‌ను డిసెంబర్ 11న తిరిగి టీఆర్‌ఎస్ అధికారంలోకి రాగానే రూ.3016కు పెంచుతామన్నారు. ఈ పెన్షన్లతో కోటీశ్వర్లు కాకపోయినా ఆత్మస్థైర్యం పెరుగుతుందన్నారు. దివ్యాంగుల సంక్షేమంలో దేశంలోనే తెలంగాణ మొదటి స్థానంలో ఉందని కేంద్ర ప్రభుత్వమే అవార్డు ఇచ్చిందన్నారు. టీఆర్‌ఎస్‌కు బీజేపీకి మధ్య రాజకీయ వైరం ఉన్నప్పటికీ తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన పథకాలను పొగడక తప్పని పరిస్ధితి ఏర్పడిందన్నారు. దివ్యాంగుల సంక్షేమానికి వచ్చే బడ్జెట్‌లో మరిన్ని నిధులు పెంచడానికి కృషి చేస్తామన్నారు. మహిళా శిశు సంక్షేమ శాఖ నుంచి దివ్యాంగుల సంక్షేమ శాఖను వేరు చేసే అంశాన్ని సీఎంతో చర్చించనున్నట్టు కేటీఆర్ ప్రకటించారు. తెలంగాణ జుట్టును చంద్రబాబుకు అప్పగించకుండా ప్రజలు జాగ్రత్తగా ఆలోచించి ఓటు వేయాలని స్పష్టం చేసిన కేటీఆర్ ‘మన తలరాతను మనమే మార్చుకుందామ’ని పిలుపునిచ్చారు.