రాష్ట్రీయం

ప్రజల కోసం ఏ త్యాగానికైనా సిద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు, నవంబర్ 20: ‘ప్రజల కోసం ఏ త్యాగానికైనా సిద్ధం. 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఆదరించిన వారి మేలు కోసం, రాష్ట్ర కోసం, దేశం కోసం పోరాటాన్ని మానేసి నిర్వీర్యమైన పోతున్న దేశ ప్రజాస్వామ్య వ్యవస్థకు సాక్షిగా మిగలదలచుకోలేదు. అంతిమంగా ధర్మం గెలుస్తుంది. మరో ఆరు నెలల్లో మోదీ పాలన నుండి విముక్తికావడం తథ్యం’ అని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పునరుద్ఘాటించారు. నెల్లూరు నగరంలో మంగళవారం జరిగిన ధర్మపోరాట దీక్ష కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ హైదరాబాద్ నగరానికి ప్రపంచపటంలో ప్రత్యేక స్థానాన్ని కల్పించిన ఘనత తనకే దక్కుతుందన్నారు. ఈ విషయాన్ని అక్కడ రిక్షా తొక్కే వ్యక్తినడిగినా చెబుతారన్నారు. తెలుగుజాతి కోసం ఆరాటపడే ఆనాడు హైదరాబాద్‌ను అంతలా అభివృద్ధి చేసి సందపసృష్టి నగరంగా
తీర్చిదిద్దానని తెలిపారు. విడిపోయిన రాష్ట్రంలోనూ అదే తరహా అభివృద్ధి సాధించాలనే తన సంకల్పానికి ఎవరు అడ్డొచ్చినా ఆగే ప్రసక్తే లేదన్నారు. రాష్ట్రానికి అన్యాయం ఎవరు చేశారు? ఏ విధంగా చేశారు? ఎందుకు చేశారు? అనే ఆలోచనలు రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి రావాలని పిలుపునిచ్చారు. దేవుని సాక్షిగా చెప్పిన హామీని కూడా విస్మరించిన బిజెపి ప్రజలు గుణపాఠం చెప్పే రోజు త్వరలోనే ఉందని హెచ్చరించారు. పోలవరం విషయంలోనూ ద్రోహం జరిగేదనే సందేహం కలుగుతోందని, నాడు తాను ఏడు ముంపు మండలాలను కలిపితేనే సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తానని మొండికేయడంతోనే ఆర్డినెన్స్ ద్వారా ఆ మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో కలిపారని గుర్తు చేశారు. ప్రస్తుతం రూ.30వేల కోట్ల వ్యయంతో అమరావతిలో పలు పనులు పురోగతిలో ఉన్నాయని వెల్లడించారు. ఎవరు ఆపినా అమరావతి విషయంలో ఆగేది లేదని స్పష్టం చేశారు. ప్రపంచం మెచ్చేలా, సంపద సృష్టించే రాజధానిని నిర్మిస్తానని ధీమా వ్యక్తం చేశారు. దేశానికి వచ్చే విదేశీయులందరూ అమరావతిని చూసేందుకు వచ్చేలా నగరాన్ని తీర్చిదిద్దుతామన్నారు. రాబోయే రోజుల్లో అభివృద్ధికి దేశంలో ఆంధ్రప్రదేశ్ అడ్రస్‌గా మారుతుందని స్పష్టం చేశారు. విదేశాల్లో దేశ అభివృద్ధిని వివరించే సమయంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ద్వారానే అది సాధ్యమవుతోందనే విషయాన్ని మోదీ జీర్ణించుకోలేక, తప్పనిసరై ప్రస్తావిస్తున్నారని ఎద్దేవా చేశారు. ఆత్మగౌరవం కోసం పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని, ప్రస్తుతం ఆత్మగౌరవాన్ని కాపాడుకుంటూ ఆత్మ విశ్వాసంతో ముందుకెళ్లి సాధించుకుందామని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. అన్ని వౌలిక సదుపాయాలు కల్పిస్తున్నప్పటికీ కడపలో ఉక్కు కర్మాగారానికి కేంద్రం మోకాలడ్డుతోందని విమర్శించారు. తాము నిర్దేశించిన డెడ్‌లైన్‌లోగా స్పందించకుంటే తాము రాయలసీమ ఉక్కు కర్మాగారాన్ని నిర్మించేందుకు సిద్ధమవుతామని, అంతటిశక్తి తమకుందని చంద్రబాబు పేర్కొన్నారు. రాష్ట్రాలు బలంగా ఉండాలని, అందుకు కేంద్రం తన హామీలను నిలబెట్టుకుంటూ పరిపాలన సాగించాలని, రాష్ట్రాలంటే కేవలం పన్నులు వసూలు చేసుకునే ప్రాంతాలుగా పరిగణిస్తే సహకార వ్యవస్థ మనుగడకే ప్రమాదం ఏర్పడే అవకాశముందని ఆందోళన వ్యక్తం చేశారు.
ముంబై-్ఢల్లీ కారిడార్‌పై ఉన్న శ్రద్ధ చెన్నై-బెంగళూరు కారిడార్‌పై కేంద్రానికి లేదని, ఉత్తర భారతదేశం మీద చూపించే శ్రద్ధలో కొంత కూడా దక్షిణ భారతదేశంపై చూపించడం లేదని ధ్వజమెత్తారు. దుగరాజపట్నం పోర్టు ఏర్పాటు చేయాలని విభజన చట్టంలో పేర్కొన్నప్పటికీ కేంద్రం చేతులెత్తేసిందని, రాష్ట్ర ప్రభుత్వమే చొరవచూపి రామాయపట్నం వద్ద పోర్టును సొంత నిధులతో నిర్మించేందుకు సిద్ధమవుతోందని వెల్లడించారు. ఒక్క విమానం కోసం కేంద్రం దయాదాక్షిణ్యాలపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడిందని వాపోయారు. సీబీఐ కేసులకు భయపడిన వైసీపీ నేత బీజేపీని పల్లెత్తు మాట అనడం లేదని, తాను వైసీపీ ఉచ్చులోపడ్డానని ప్రధాని వ్యంగ్యంగా పార్లమెంటులో వ్యాఖ్యానించారని, నిజానికి ఆయనే వైసీపీ ఉచ్చులోనూ, కేంద్ర ప్రభుత్వం అవినీతి ఉచ్చులోనూ పడ్డారని ఎద్దేవా చేశారు. సమాధానం చెప్పే ధైర్యం లేక పార్లమెంటులో తనకు పరిపక్వత లేదని, కేసీఆర్‌కు ఎంతో పరిపక్వత ఉందంటూ మోదీ చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే జాలేస్తోందని, మోదీ కంటే తాను ఎంతో సీనియర్ రాజకీయ నాయకుడినని, కేసీఆర్ కూడా ఒకనాడు తన అనుచరుడన్న సంగతి గుర్తుంచుకోవాలని సూచించారు. రాష్ట్ర హక్కుల కోసం పార్లమెంటులో పోరాడే నేతలందరిపైన వరుసగా కక్షపూరిత దాడులు జరుగుతున్నాయన్నారు. ఇందుకోసం స్వతంత్ర వ్యవస్థలను వాడుకుంటూ వాటిని నిర్వీర్యం చేస్తున్నారని దుయ్యబట్టారు.
సీబీఐలో కేంద్రం జోక్యం పెరిగిందని, అవినీతి ఎక్కువైందని, సాక్షాత్తూ కేంద్ర మంత్రి లంచం తీసుకున్నాడంటూ ఒక సీబీఐ ఉన్నతాధికారి సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారని, నిబద్ధత కలిగిన మంత్రయితే వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని ముఖ్యమంత్రి డిమాండ్ చేశారు. భయపడితే స్వాతంత్య్రం వచ్చేది కాదని, తాము ఎవరికి భయపడేది లేదని, కేంద్రంపై తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఎంత అణగదొక్కాలని ప్రయత్నిస్తే అంతకంత ఎదిగే పార్టీ తెలుగుదేశమన్నారు.
తెలుగు ప్రజలు ఎక్కడున్నా, ఆనందంగా ఉండాలని భావించానని, అందుకోసం ఒక్క అడుగు వెనక్కు తగ్గినా ఫర్వాలేదనుకొని మహాకూటమి ఏర్పాటుకు నాంది పలికానని స్పష్టం చేశారు. తెలంగాణ ఎన్నికల్లో కొన్ని స్థానాలకే పరిమతమయ్యామని పేర్కొన్నారు. ఇదే కోవలో దేశంలో బీజేపీయేతర పార్టీలన్నీ ఒకతాటిపైకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల అనంతరం పార్లమెంటు సమావేశాల్లోగా బీజేపీయేతర పార్టీలన్నీ కలిసి ప్రత్యేక సమావేశంలో పాల్గొని భవిష్యత్ కార్యాచరణపై చర్చించుకోబోతున్నట్టు వెల్లడించారు. ప్రధాని అభ్యర్థి ఎవరూ.. అంటూ తనను పలు సందర్భాల్లో విలేఖరులు ప్రశ్నిస్తున్నారని, తాను వారికి ‘మోదీ కంటే అనుభవమున్న నేతలు ఎందరో దేశంలో ఉన్నారని, వారిలో ఎవరైనా కూడా మోదీ కంటే బాగా పరిపాలన చేయగలరు’ ..అంటూ సమాధానమిస్తున్నానని తెలిపారు. తన ప్రసంగ సమయంలో మోదీ పలు సందర్భాల్లో ఇచ్చిన హామీలు, పార్లమెంటులో ప్రసంగాలను ప్రజలకు స్పీకర్ల ద్వారా వినిపించి, ఏ విధంగా మోదీ మాట తప్పారో వివరించే ప్రయత్నం చేశారు. రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో ప్రధానిని నిర్ణయించబోయేది చంద్రబాబునాయుడేనని జోస్యం పలికారు.
ఈ కార్యక్రమంలో మంత్రులు అమర్‌నాథ్‌రెడ్డి, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, పొంగూరు నారాయణ, శిద్దా రాఘవరావు, దేవినేని ఉమామహేశ్వరరావు, సుజయకృష్ణ రంగారావు, మాజీ కేంద్ర మంత్రి అశోక్‌గజపతిరాజు, ఎంపీలు మురళీమోహన్, మాగంటి బాబు, కొనకళ్ల నారాయణ, బుట్టా రేణుక, శ్రీరామ మాల్యాద్రి, టీడీపీ జిల్లా అధ్యక్షుడు బీద రవిచంద్ర, మాజీ మంత్రి ఆదాల ప్రభాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
చిత్రం..నెల్లూరు ధర్మపోరాట దీక్షలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు