రాష్ట్రీయం

ఎవర్నీ వదిలేది లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 20: ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తే ప్రగతి భవన్‌పైన కూడా చర్యలు ఉంటాయని చీఫ్ ఎలక్టోరల్ అధికారి (సీఈఓ) రజత్ కుమార్ స్పష్టం చేశారు. సచివాలయంలో మంగళవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడుతూ, ఎన్నికల ప్రవర్తనా నియమావళి అన్ని పార్టీలకు, అభ్యర్థులందరికీ సమానంగా వర్తిస్తుందని వివరించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నివాసభవనమైన ప్రగతిభవన్ అధికారిక నివాసభవనమని, రాజకీయ సమావేశాలకు దీన్ని కేంద్రంగా మార్చుకోకూడదన్నారు. ప్రగతి భవన్‌పై వచ్చిన ఆరోపణలపై ఇప్పటికే టీఆర్‌ఎస్ జనరల్-సెక్రటరీకి నోటీసు పంపించామని చెప్పారు. ప్రగతిభవన్‌కో, మరోచోటికో నేరుగా తానే వెళ్లి రాజకీయ కార్యక్రమాలను నివారించడం కుదరదని, బలమైన సాక్ష్యాధారాలతో వచ్చిన ఆరోపణలపై విచారణ చేస్తామన్నారు. ప్రగతిభవన్‌కు సంబంధించి తాము ఇచ్చిన నోటీస్‌కు సమాధానం వచ్చిన తర్వాత అవసరమైతే కేంద్ర ఎన్నికల కమిషన్‌కు నివేదిక పంపిస్తామన్నారు. ఎన్నికల నియమావళి ఉల్లంఘనకు సంబంధించి వచ్చే ఆరోపణలపై సంబంధిత పార్టీ జనరల్ సెక్రటరీకే నోటీసు ఇవ్వడం పరిపాటని, అందులో ఎలాంటి తప్పు లేదన్నారు. వివిధ పార్టీలపై ఇప్పటి వరకు వచ్చిన ఫిర్యాదులపై తాము వివరణ కోరామన్నారు. ఆపద్ధర్మ మంత్రులు కేటీఆర్, హరీష్‌రావుతదితరుల పేర్లతో కూడా నోటీసులు జారీ చేశామన్నారు. నోటీసులు ఇవ్వడం, సమాధానం రావడం, చర్యలు తీసుకోవడం అన్నవి హడావుడిగా జరిగే పనులు కావని, ఇందుకు ప్రొసీజర్ ఉంటుందని, కొంత సమయం పడుతుందన్నారు. ఎవరైనా ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించినట్టు రుజువైతే ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత కూడా ఎమ్మెల్యే పదవి ఊడుతుందన్నారు. నామినేషన్ సందర్భంగా అభ్యర్థులు ఫామ్- 26 ఇవ్వాలని, ఎవరైనా ఫామ్-26 ఇవ్వకపోతే ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకుంటుందన్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనకు సంబంధించి గత ఎన్నికలతో పోలిస్తే ఈ ఎన్నికల సందర్భంగా వచ్చిన ఫిర్యాదులు తక్కువగానే ఉన్నాయన్నారు.
రాష్ట్రం మొత్తంలో ఎమ్మెల్యే పదవులకు పోటీ కోసం వచ్చిన మొత్తం నామినేషన్ల సంఖ్య 3584 కు చేరిందని రజత్ కుమార్ తెలిపారు. కాంగ్రెస్ తరఫున 300 నామినేషన్లు, టీఆర్‌ఎస్ తరఫున 272, బీజేపీ తరఫున 270, బీఎస్‌పీ తరఫున 182, సీపీఎం తరఫున 64, టీడీపీ తరఫున 52, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ తరఫున ఒక నామినేషన్, ఎన్‌సీపీ తరఫున 36, ఎంఐఎం తరఫున 21, సీపీఐ తరఫున ఐదు, స్వతంత్రులు తదితరులు 2441 వరకు నామినేషన్లు దాఖలయ్యాయి. నామినేషన్ల పరిశీలన జరుగుతోందని, బుధవారం వరకు ఈ కార్యక్రమం పూర్తవుతుందని తెలిపారు.

చిత్రం..హైదరాబాద్‌లో మంగళవారం విలేఖరుల సమావేశంలో మాట్లాడుతున్న సిఈఓ రజత్‌కుమార్