రాష్ట్రీయం

హిందూ ధర్మాన్ని రక్షించుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుమల, డిసెంబర్ 2: ఇటీవల కాలంలో హైందవ మతంపై అన్యమతస్థులు చేస్తున్న విష ప్రచారాలను, మత మార్పిడులను తిరుమలలో బుధవారం జరిగిన వేద సదస్సు తీవ్రంగా గర్హించింది. ఈ పరిస్థితులు తలెత్తకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చట్టబద్ధత కల్పించాలని, గ్రామీణ స్థాయి నుంచి హైందవ ధర్మ గొప్పతనాన్ని విస్తృతంగా ప్రజా బాహుళ్యంలోకి తీసుకువెళ్ళాలని సదస్సు ఏకగ్రీవంగా తీర్మానించింది. ఇందుకు టిటిడి, రాష్ట్ర ప్రభుత్వంతో పాటు మఠ, పీఠాధిపతులు హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్టు ఎవరికి వారు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించాలని తీర్మానించింది. తిరుమలలోని ఆస్థాన మండపంలో హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్టు అధ్యక్షుడు పివిఆర్‌కె ప్రసాద్ ఆధ్వర్యంలో టిటిడి సౌజన్యంతో ఒకరోజు ధార్మిక సదస్సు నిర్వహించారు. 50మంది మఠ, పీఠాధిపతులకు, ధర్మ ప్రచారకర్తలకు ఆహ్వానం పంపగా, 42మంది హాజరయ్యారు. కంచికామకోటి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి, ఉడిపి పెజావర్ మఠం విద్యాధీశ తీర్థస్వామి, శ్రీరంగం నుంచి శ్రీరంగరామానుజ మహాదేశిగన్ స్వామి హాజరయిన వారిలో ఉన్నారు, త్రిదండి శ్రీమన్నారాయణ చిన్న జీయర్ వస్తారని భావించినా కొన్ని అనివార్య కారణాల వల్ల ఆయన హాజరుకాలేకపోయారు. ఆయన తరఫున ప్రతినిధి ఒకరు సదస్సుకు హాజరైయ్యారు. కాగా ఉదయం 9గంటలకు ప్రారంభమైన ఈసదస్సు రాత్రి 7గంటల వరకు హైందవ ధర్మ రక్షణ, అందుకు చేపట్టాల్సిన ప్రణాళికలపై సుదీర్ఘంగా చర్చించింది. ఈ సమయంలో మీడియాను కూడా అనుమతించలేదు. సదస్సు ముగిసిన అనంతరం పి వి ఆర్ కె ప్రసాద్ దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావు సదస్సులో తీసుకున్న 26 తీర్మానాలను విలేఖరులకు వివరించారు. ఇందులో ప్రధానంగా మత మార్పిడులను అడ్డుకోవడానికి చేపట్టాల్సిన కార్యక్రమాలు,హైందవ సనాతన గొప్పతనాన్ని ప్రజలు మరింత లోతుగా తెలుసుకునేందుకు వీలుగా చేపట్టాల్సిన ప్రణాళికలపైనే దృష్టి సారించింది. ఇందుకు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టాల్సిన అంశాలపై కూడా సమావేశం తీర్మానాల రూపంలో ప్రత్యేకంగా చాటింది.
ఈసందర్భంగా పివిఆర్‌కె మాట్లాడుతూ హైందవులను ప్రలోభాలతో మతమార్పిడులు చేస్తున్న అన్యమతస్థుల కదలికలు గుర్తించే విధంగా ధర్మ పరిరక్షకులను ఏర్పాటుచేయాలని సదస్సు నిర్ణయించిందన్నారు. అయితే ఈపరిరక్షకులకు అవసరమయ్యే వ్యయభారాలను దేవాలయాలకు వచ్చే ఆదాయంతో కాకుండా ప్రతి హైందవ కుటుంబాలను భాగస్వామ్యం చేసి నిధులు సేకరించాలని నిర్ణయించామన్నారు. ఎవరైనా వారి ఇష్ట పూరితంగా మత మార్పిడులు చేసుకుంటే అలాంటి వారిని హైందవ ధర్మవైపు నడిపించాల్సిన అవసరం లేదని కూడా సమావేశం భావించిందన్నారు. అయితే ప్రలోభపెట్టి మత మార్పిడులకు పాల్పడే వారిపైన నాన్ బెయిలబుల్ కేసులు పెట్టాలని కూడా సమావేశం నిర్ణయించిందన్నారు. హైందవ ధర్మాన్ని పరిరక్షించడానికి రాష్ట్ర, జిల్లా, మండలస్థాయిలో ఉన్న ధర్మప్రచారకులకు తగిన ఆర్థిక సాయం కూడా అందించాలని నిర్ణయించించింది. హిందూ భక్త మండళ్ళు స్థాపించి వాటిని ఒక గొడుగుకిందకు తీసుకువచ్చి కార్యక్రమాన్ని చక్కదిద్దాలని నిర్ణయించిందన్నారు. ఈ మండళ్లతో హరిజన, గిరిజన, మత్స్యకార వర్గాలకు ప్రాధాన్యత కల్పించాలని నిర్ణయించామన్నారు. ధర్మ పరిరక్షణ ట్రస్టు ఆధ్వర్యంలో ఆ బాధ్యత సాగాలని సదస్సు నిర్ణయించింది. మఠ, పీఠాధిపతులు చేపట్టే ధార్మిక కార్యక్రమాలను ఒక గొడుగు కిందకు తీసుకువచ్చి సమైక్యంగా బోధనలు చేయాలని నిర్ణయించామన్నారు.
హిందూ దేవుళ్ళను అవహేళన చేసే విధంగా తీస్తున్న చిత్రాలు, సాంస్కృతిక కార్యక్రమాల దుష్ట సంస్కృతిని నివారించడానికి ప్రభుత్వం దృష్టి సారించాలని తీర్మానించింది. క్రైస్తవులు జెరూసలెం, ముస్లింలు మక్కా ప్రార్థనా స్థలాల సందర్శనకు కేంద్రం నిధులు వెచ్చిస్తోందని, అలాగే హైందవ క్షేత్రాలైన తిరుపతి, బదరి, కాశీ, కేదారనాధ్, ద్వారక వంటి క్షేత్రాలకు హైందవులను పంపేందుకు ఖర్చులు భరించాలని తీర్మానించింది. ధర్మప్రచారానికి ఎస్వీ బిసి చానల్‌తోపాటు మరో మూడు చానల్స్‌ను ఏర్పాటుచేసే బాధ్యతను టిటిడి తీసుకోవాలని నిర్ణయించిందన్నారు.
ఇదిలావుండగా ఈ హైందవుల పరిరక్షకుల వ్యవస్థను నడిపేందుకు అవసరమైన ఆర్థిక వనరులను మూడు సంవత్సరాలు పాటు టిటిడి, దేవాదాయశాఖ అందించేలా సహకరించాలని సదస్సు ఒక ప్రతిపాదన చేసినట్లు సమాచారం. ఈ పరిరక్షకులకు అవసరమైన ఆర్థిక వనరులు విరాళాల రూపంలో సేకరించాలని ప్రతిపాదించిన మరుక్షణం విజయదుర్గం పీఠం వెదురుపాక స్వామి లక్ష రూపాయలు ప్రకటించి ధన రూపంలో పివి ఆర్‌కె ప్రసాద్‌కు అందజేశారు. కాగా ఇకపై ఏడాదికి రెండు పర్యాయాలు ఇలాంటి సదస్సులు నిర్వహించాలని కూడా సదస్సు నిర్వహించింది.

చిత్రం... తిరుమలలో నిర్వహించిన ధార్మిక సదస్సుకు వివిధ ప్రాంతాల నుంచి హాజరైన మఠాధిపతులు, పీఠాధిపతులు.