రాష్ట్రీయం

సేవా గుణమే హైందవ ధర్మం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుమల, డిసెంబర్ 2: హైందవ సనాతన ధర్మ పరిరక్షణ ద్వారా సమాజంలో శాంతి, సోదర భావాన్ని పంచాలని, తద్వారా ప్రపంచంలో భారత దేశానికి అగ్రస్థానం సుస్థిరం అవుతుందని ఆంధ్రప్రదేశ్ దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి మాణిక్యాల రావు పీఠాధిపతులను కోరారు. హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ ఆధ్వర్యంలో తిరుమలలోని ఆస్థాన మండపంలో బుధవారం ఉదయం ధార్మిక సదస్సు ఘనంగా ప్రారంభమయింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన మంత్రి మాణిక్యాలరావు మాట్లాడుతూ భక్తులు ఎంతో భక్తి భావంతో, దాతృత్వంతో అందించే కానుకల ద్వారానే ఆలయాలు, పలు ఆశ్రమాల నిర్వహణ, ధర్మ ప్రచారం సాధ్యమవుతోందన్నారు. ధర్మ ప్రచారాన్ని మరింత వేగవంతం చేయాల్సిన అవసరం ఎంతయినా ఉందని చెప్పారు. ఇందులో భాగంగా హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్టు, దేవాదాయ శాఖలోని పలు ఆలయాలతో కలిసి ప్రచార రథాల ద్వారా రాష్ట్రం నలుమూలలా పర్యటించి భగవంతుడిని భక్తుల వద్దకు తీసుకెళ్లి పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. భక్తులకు ఆలయం విశిష్టత ఇతర ఆధ్యాత్మిక విషయాలు తెలియజేసేందుకు పుస్తక ప్రసాదాన్ని మరింత విస్తృతం చేస్తున్నట్లు వివరించారు. దేవాలయాల ఆస్తులను సంరక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తున్నట్లు తెలిపారు. భరతగడ్డ అంటే మట్టి కాదని, భారతమాతగా భావించాలని మంత్రి కోరారు. సాటి వ్యక్తులకు ప్రేమను పంచడం, సేవ తదితర లక్షణాలు హైందవ ధర్మంలో ఉన్నాయని ఈ ధర్మాన్ని పాటించడం ద్వారా కలిగే ప్రయోజనాలతో సామాజిక మార్గదర్శనం చేసేలా పీఠాధిపతులు, మఠాధిపతులు సందేశాలు ఇవ్వాలని ఆకాంక్షించారు.
వెనుకబడిన ప్రాంతాల్లో మత మార్పిడులను అరికట్టేందుకు కార్యాచరణ రూపొందించాలన్నారు. విద్యావిధానంలోనూ మార్పులు రావాల్సి ఉందన్నారు. ఆధ్యాత్మికత విలువలతో కూడిన విద్యను బోధించడం ద్వారా విద్యార్థులను భావిభారత పౌరులుగా తీర్చిదిద్దవచ్చని అన్నారు. భగవంతుడికి భక్తుడికి మధ్య ఆధ్యాత్మిక సంబంధం ఉంటుందని, దేవాలయం కేంద్రంగా క్షేత్రస్థాయిలో ధర్మప్రచారం ఎలా చేయాలి అనే అంశంపై చర్చించాలని కోరారు. ఇలాంటి సదస్సులు తరచూ నిర్వహించడం ద్వారా ధర్మ ప్రచారంలో రాష్ట్రంలో ఆదర్శంగా నిలవాలని తద్వారా దేశానికి, ప్రపంచానికి స్ఫూర్తిని ఇవ్వాలని మంత్రి ఆకాంక్షించారు.
ఆధ్యాత్మిక శక్తిని భావితరాలకు
అందించాలి: చదలవాడ
భారతీయులకు మాత్రమే సొంతమైన మన పూర్వీకులు అందించిన ఆధ్యాత్మిక శక్తిని భావితరాలకు అందించి తద్వారా హైందవ ధర్మాన్ని రక్షించాలని టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షుడు డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి పీఠాధిపతులను, మఠాధిపతులను కోరారు. వేదాల్లోని విజ్ఞానాన్ని సమాజానికి అందించి లోక కల్యాణానికి పాటు పడాలన్నారు. హైందవ ధర్మ పరిరక్షణ, ప్రచారం కోసం కృషి చేస్తున్న ప్రతి ఒక్క సంస్థకు టిటిడి ధర్మకర్తల మండలి పూర్తి సహకారం అందిస్తుందని తెలియజేశారు. ధర్మప్రచార కార్యక్రమాల ద్వారా కలియుగ ప్రత్యక్ష దైవమయిన శ్రీవారి ఆశీస్సులను ప్రపంచ వ్యాప్తంగా హిందువులందరికి అందించాలని ఆయన కోరారు.
సనాతన ధర్మం, వేదాల వ్యాప్తికి
టిటిడి కృషి: ఇఓ సాంబశివరావు
హైందవ సనాతన ధర్మం, వేదాలు, సంస్కృత భాషను విస్తృతం చేసేందుకు టిటిడి విశేషంగా కృషి చేస్తోందని టిటిడి ఇఒ డాక్టర్ డి.సాంబశివరావు ఉద్ఘాటించారు. ధార్మిక సదస్సులో స్వాగతోపన్యాసం చేసిన ఆయన హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్టు ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ సదస్సుకు టిటిడి సంపూర్ణ సహకారం అందిస్తున్నట్లు చెప్పారు. శ్రీవారి దర్శనార్థం విచ్చేసే భక్తులకు దర్శనం, బస, అన్నప్రసాదం తదితర వసతులతో పాటు ధర్మప్రచారం, ఉచిత విద్య, వైద్యం తదితర సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వివరించారు. టిటిడి హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో 40 ఏళ్లుగా దేశ వ్యాప్తంగా ధర్మ ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. భజన మండళ్ళను శ్రీవారి సేవకులను భాగస్వాములను చేసి ధర్మ ప్రచారాన్ని గ్రామస్థాయికి తీసుకువెళ్ళినట్లు చెప్పారు. ధర్మప్రచారం చేస్తున్న సంస్థలకు ఆర్థిక ప్రోత్సాహం, శిక్షణ కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నట్లు వివరించారు. వేదాల పరిరక్షణ కోసం దేశంలోనే ఏకైక వేద విశ్వ విద్యాలయాన్ని, 7వేద పాఠశాలలను టిటిడి నిర్వహిస్తోందన్నారు. దేశంలోని 105 వేద పాఠశాలలకు ఆర్థిక సాయం అందిస్తున్నామని వేద వ్యాప్తికి సంవత్సరానికి రూ. 40కోట్లు బడ్జెట్ కేటాయిస్తున్నట్లు ఆయన చెప్పారు. టిటిడి చేపడుతున్న కార్యక్రమాలపై మఠాధిపతులు, పీఠాధిపతులు సూచనలు ఇవ్వాలని తద్వారా మరింత విజయవంతంగా ధర్మ ప్రచారం జరిగేందుకు సహకరించాలని ఆయన కోరారు.
ప్రతి హైందవుడు సైనికుడిలా
పనిచేయాలి: పివిఆర్‌కె ప్రసాద్
హైందవ ధర్మ ప్రచారాన్ని మరింత విశ్వవ్యాప్తం చేయడానికి ప్రపంచంలోని ప్రతి హైందవుడూ ఒక సైనికుడిలా పనిచేయాలని హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్టు అధ్యక్షుడు పివిఆర్‌కె ప్రసాద్ పిలుపునిచ్చారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందూ కుటుంబాలను ఏకం చేసి వారి తోడ్పాటుతోనే క్షేత్ర స్థాయి నుంచి హిందూ ధర్మ ప్రచారాన్ని వేగవంతం చేయాలన్నారు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడయిన తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి పాదాల చెంత ధార్మిక సదస్సు నిర్వహించుకోవడం ముదావహమని అన్నారు. హిందూ ధర్మ వ్యాప్తికి జీవితాలను అంకితం చేసిన మఠాధిపతులు, పీఠాధిపతులు తమ సందేశాల్లో తగిన సూచనలు, సలహాలు ఇవ్వాలని కోరారు. ముందుగా పీఠాధిపతులు, మఠాధిపతులు ఆధ్యాత్మిక సంస్థల ప్రతినిధులను టిటిడి తరపున శాలువాతో సన్మానించారు. శ్రీవారి ప్రసాదం, నూతన సంవత్సర క్యాలెండర్, డైరీ అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏపి దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి జెఎస్‌వి ప్రసాద్, కమిషనర్ వైవి అనురాధ, టిటిడి బోర్డు సభ్యులు భాను ప్రకాష్‌రెడ్డి, అనంత, రమణ, తిరుమల జెఇఓ శ్రీనివాసరాజు, తిరుపతి జెఇఒ పోల భాస్కర్, సివిఎస్‌ఓ నాగేంద్ర కుమార్, టిటిడి ప్రాజెక్టుల ప్రత్యేక అధికారి ముక్తేశ్వరరావు, టిటిడి హిందూ ధర్మ ప్రచార పరిషత్ కార్యదర్శి ప్రయాగ రామకృష్ణ, హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్టు కార్యదర్శి విజయరాఘవాచార్యులు, ప్రముఖులు పాల్గొన్నారు.

తిరుమలలో జరిగిన ధార్మిక సదస్సులో పాల్గొన్న టిటిడి చైర్మన్ చదలవాడ తదితరులు